love mouli ott: నవదీప్‌ బోల్డ్‌ మూవీ ‘లవ్‌ మౌళి’.. ఓటీటీలో ఎప్పుడంటే?

నవదీప్‌, ఫంకూరీ గిద్వానీ కీలక పాత్రల్లో నటించిన ‘లవ్‌ మౌళి’ ఓటీటీలో వచ్చేందుకు సిద్ధమైంది.

Published : 23 Jun 2024 00:00 IST

హైదరాబాద్‌: నవదీప్‌ (Navdeep) కథానాయకుడిగా అవనీంద్ర దర్శకత్వంలో తెరకెక్కిన లవ్‌ రొమాంటిక్‌ మూవీ ‘లవ్‌ మౌళి’ (Love Mouli). ఫంకూరీ గిద్వానీ (Pankhuri Gidwani) కథానాయిక. ప్రేమ అనేది లేకుండా ప్రపంచంలో మనుషులకు దూరంగా బతుకుతున్న వ్యక్తికి అనూహ్యంగా ప్రేమ దొరికితే ఎలా ఉంటుంది.. ఆ సమయంలో ప్రేమించే వ్యక్తి దొరికితే మనిషి ఎలా మారతాడు? అన్న కాన్సెప్ట్‌తో ‘లవ్‌ మౌళి’ని రూపొందించారు. ఇటీవల ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం యువతను ఆకట్టుకుంది. ఇప్పుడు ఓటీటీ ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమైంది. తెలుగు ఓటీటీ వేదికగా ‘ఆహా’లో జూన్‌ 27వ తేదీ నుంచి (Love Mouli ott) స్ట్రీమింగ్‌ కానుంది. ఈ విషయాన్ని తెలియజేస్తూ ఆహా (Aha) సరికొత్త పోస్టర్‌ను పంచుకుంది.

కథేంటంటే: చిన్నప్పుడే తల్లిదండ్రులు విడిపోవ‌డంతో మౌళి (న‌వ‌దీప్‌) ఒంట‌రిగా పెరుగుతాడు. మేఘాల‌య‌లోని రిసార్ట్‌లో ప్ర‌కృతి మ‌ధ్య త‌న‌కు న‌చ్చిన‌ట్లుగా బ‌తుకుతుంటాడు. పెయిటింగ్స్‌ వేస్తూ వాటి ద్వారా వ‌చ్చిన డ‌బ్బుల‌తో జీవిస్తుంటాడు. తన చిన్న‌త‌నం నుంచి చూసిన, ఎదురైన సంఘటనలు, అనుభవాల కార‌ణంగా మౌళికి ప్రేమ‌పై పెద్దగా న‌మ్మ‌కం ఉండ‌దు. అదే సమయంలో ఓ అఘోరా (రానా ద‌గ్గుబాటి) ఇచ్చిన పెయింటింగ్ బ్ర‌ష్‌తో తాను కోరుకునే ల‌క్ష‌ణాలున్న అమ్మాయిని సృష్టించే శ‌క్తి మౌళికి వ‌స్తుంది. స్వతహాగా చిత్రకారుడైన మౌళి వేసిన పెయింటింగ్ ద్వారా చిత్ర (ఫంఖూరీ గిద్వానీ) అత‌డి ముందు ప్ర‌త్య‌క్ష‌మ‌వుతుంది. కొన్నాళ్లు వారి ప్రేమ బంధం సాఫీగా సాగుతుంది. ఆ త‌ర్వాత‌ చిత్ర‌తో గొడ‌వ‌లు రావ‌డంతో మ‌రో పెయింటింగ్ గీస్తాడు మౌళి. మరోసారి కూడా చిత్ర‌నే అతడి ముందు ప్రత్యక్షమవుతుంది. మరి ఆ తర్వాత మౌళి, చిత్ర ఒక్క‌ట‌య్యారా? మౌళి ప్రేమకు గుడ్‌బై చెప్పడానికి కారణం ఏంటి?ప్రేమకు నిజ‌మైన అర్థాన్ని మౌళి ఎలా తెలుసుకున్నాడు? అన్న‌దే ఈ చిత్ర కథ.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని