Bobby Deol: మరో బాలీవుడ్‌ నటుడు టాలీవుడ్‌లోకి విలన్‌గా రానున్నాడా..!

బాలీవుడ్‌ నటుడు బాబీ దేఓల్‌ త్వరలోనే తెలుగులో నటించనున్నట్లు సమాచారం. క్రిష్‌ జాగర్లమూడి దర్శకత్వంలో పవన్‌ కల్యాణ్‌ హీరోగా నటిస్తున్న హరి హర వీరమల్లులో విలన్‌ పాత్ర కోసం చిత్రబృందం ఆయన్ని సంప్రదించిందట. దీనితో పాటు త్వరలోనే రానున్న బాలకృష్ణ సినిమాలోనూ ప్రతినాయకుడి పాత్రలలో కనిపించనున్నారంటున్నారు.

Published : 04 Nov 2022 18:46 IST

హైదరాబాద్‌: బాలకృష్ణ, పవన్‌ కల్యాణ్‌ల సినిమాలు వస్తున్నాయంటేనే టాలీవుడ్‌లో క్రేజ్‌ నెలకొంటుంది. ఈ హీరోల ప్రాజెక్టులు ప్రకటించిన దగ్గరి నుంచి అప్‌డేట్స్‌ కోసం ఫ్యాన్స్‌ ఎదురుచూస్తుంటారు. ఈ పెద్ద సినిమాల గురించి ఏ చిన్న విషయం బయటకు వచ్చినా అది క్షణాల్లో వైరల్‌ అవుతుంది. తాజాగా ఈ సినిమాలకు సంబంధించిన ఓ వార్త నెట్టింట తెగ చక్కర్లు కొడుతోంది. ఈ రెండు సినిమాల్లో బాబీ దేఓల్‌(Bobby Deol) విలన్‌గా నటిస్తున్నారనే వార్త ఫిల్మినగర్‌లో హల్‌చల్‌ చేస్తోంది. క్రిష్‌ జాగర్లమూడి(Krish) దర్శకత్వంలో పవన్‌ కల్యాణ్‌ నటిస్తోన్న హరి హర వీరమల్లు(Hari Hara Veera Mallu). ఈ  చిత్రంలో విలన్‌ పాత్ర కోసం బాలీవుడ్‌ నటుడు అర్జున్‌ రాంపాల్‌(Arjun Rampal)ను చిత్ర బృందం సంప్రదించింది. కానీ, కొన్ని కారణాల వల్ల అతని స్థానంలో బాబీ దేఓల్‌ ఎంపిక చేసినట్లు సమాచారం. ఇప్పటికే శరవేగంగా షూటింగ్‌ జరుపుకొంటున్న ఈ చిత్రంలో ఆయన షెడ్యూల్‌ త్వరలోనే ప్రారంభం కానుందట.

ఇక ‘ఎఫ్‌3’ సినిమాతో మంచి ఫామ్‌లో ఉన్నాడు అనిల్‌ రావిపూడి(Anil Ravipudi). ఈ దర్శకుడు బాలకృష్ణ(Balakrishna)తో కలిసి ఓ మాస్‌ ఎంటర్‌టైనర్‌ తెరకెక్కించనున్న విషయం తెలిసిందే. ఈ సినిమాలో ప్రతినాయకుడి పాత్ర కోసం బాబీ దేఓల్‌తో చర్చలు జరిపారట. ఇక బాబీ కూడా విలన్‌ పాత్రకు అంగీకరించినట్లు సమాచారం. ఇప్పటికే స్క్రిప్ట్‌ వర్క్‌ పూర్తయిన ఈ సినిమా షూటింగ్‌ త్వరలోనే ప్రారంభం కానుంది. ఈ రెండు చిత్రాల్లో బాబీ నటిస్తున్నారో లేదో అనే విషయంలో అధికారిక ప్రకటన లేదు. కానీ, ఈ వార్త మాత్రం సోషల్‌ మీడియాలో తెగ తిరిగేస్తోంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని