Bollywood: ఏ ఇంటి దీపాలైనా... వెండితెరకు వెలుగులే

కథానాయికలు సినిమా రంగంలో చాలా తక్కువ కాలమే ఉంటారని ఇప్పటి వరకూ ఉన్న అభిప్రాయం. పెళ్లైతే ఇక అవకాశాలు ఎక్కడొస్తాయి? అనేది పాత మాట. ఇప్పుడు కథ మారింది. పెళ్లి అయిన తర్వాతా వెండితెర మీద తమ ప్రతిభను చూపించడానికి ప్రయతిస్తున్నారు బాలీవుడ్‌ భామలు. కొత్తగా వస్తున్న హీరోయిన్లతో పోటీ పడుతున్నారు. గతంలో ఎన్నడూ లేని విధంగా బాలీవడ్‌లో ఇప్పుడు అగ్ర కథానాయికలు ఆరుగురూ వివాహ బంధంలో ఉంటూనే సినిమాల్లో బిజీగా ఉండటం విశేషం.

Updated : 23 Apr 2022 07:15 IST

కథానాయికలు సినిమా రంగంలో చాలా తక్కువ కాలమే ఉంటారని ఇప్పటి వరకూ ఉన్న అభిప్రాయం. పెళ్లైతే ఇక అవకాశాలు ఎక్కడొస్తాయి? అనేది పాత మాట. ఇప్పుడు కథ మారింది. పెళ్లి అయిన తర్వాతా వెండితెర మీద తమ ప్రతిభను చూపించడానికి ప్రయతిస్తున్నారు బాలీవుడ్‌ భామలు. కొత్తగా వస్తున్న హీరోయిన్లతో పోటీ పడుతున్నారు. గతంలో ఎన్నడూ లేని విధంగా బాలీవడ్‌లో ఇప్పుడు అగ్ర కథానాయికలు ఆరుగురూ వివాహ బంధంలో ఉంటూనే సినిమాల్లో బిజీగా ఉండటం విశేషం.


అమ్మ అయినా అదే వేగం

దాదాపు దశాబ్దం కిందట కథానాయకుడు సైఫ్‌ అలీఖాన్‌తో జీవిత భాగస్వామిగా ప్రయాణం మొదలు పెట్టింది కరీనా కపూర్‌. వివాహ బంధంలో ఉంటూనే ‘తలాష్‌’, ‘కి అండ్‌ కా’, ‘సత్యాగ్రహ’, ‘భజరంగీ భాయ్‌జాన్‌’, ‘ఉడ్తా పంజాబ్‌’ వంటి భారీ చిత్రాల్లో నటించింది. మధ్య మధ్యలో కాస్త విరామం తీసుకున్నా బీ టౌన్‌లో కరీనాకు ఉన్న క్రేజ్‌ ఏ మాత్రం తగ్గలేదు. ఇద్దరు పిల్లల తల్లిగా కుటుంబాన్ని చూసుకుంటూ సినిమాల్లో నటించడం తనకు సాధ్యమేనని ఈ భామ చెప్పుకొచ్చింది. ప్రస్తుతం అద్వైత్‌ చందన్‌ దర్శకత్వంలో వస్తున్న ‘లాల్‌ సింగ్‌ చద్ధా’లో ఆమిర్‌ ఖాన్‌ సరసన నటిస్తోంది. ఇవి కాకుండా సుజొయ్‌ ఘోష్‌ తెరకెక్కిస్తున్న నెట్‌ఫ్లిక్స్‌ థ్రిల్లర్‌ సిరీస్‌, హన్సల్‌ మెహతా ప్రాజెక్టులూ చేతిలో ఉన్నాయి.


క్రికెటర్‌కు భార్య అయినా...

భారత క్రికెట్‌ జట్టు ఆటగాడు కోహ్లీని అనుష్క శర్మ 2017లో వివాహం చేసుకుంది. పెళ్లి అయిన తర్వాత ఈ భామ సినిమాలకు వీడ్కోలు చెబుతుందని అప్పట్లో వార్తలు వినిపించాయి. వాటికి ఈ అమ్మడు ఫుల్‌స్టాప్‌ పెట్టింది. సినిమాలను వదిలే ప్రసక్తే లేదని కుండ బద్దలు కొట్టింది. పెళ్లి అయ్యాకానే ‘పారీ’, ‘సంజూ’ తదితర పెద్ద చిత్రాల్లో నటించింది. 2023లో అనుష్క ప్రధాన పాత్రలో నటించిన ‘చక్డా ఎక్స్‌ప్రెస్‌ విడుదల కానుంది. ఇందులో భారత మహిళా క్రికెట్‌ జట్టులో ఫాస్ట్‌ బౌలర్‌ జులన్‌ గోస్వామి పాత్రలో కనిపించనుంది అనుష్క. హీరోయిన్‌గానే కాదు నిర్మాత గానూ రాణిస్తూ తన సత్తా చాటుకుంది. ఆమె నిర్మాతగా వ్యవహరించిన ‘పాతాల్‌ లోక్‌’, ‘బుల్‌బుల్‌’ ఓటీటీలో మంచి ఆదరణను పొందాయి.


కీలక చిత్రాల్లో వెలుగుతూ

వివాహం తర్వాత కెరీర్‌ను వేగంగా పరుగులెత్తిస్తున్న మరో భామ దీపికా పదుకొణె. బాలీవుడ్‌ అగ్ర కథానాయకుడు రణ్‌వీర్‌ సింగ్‌ను 2018లో పెళ్లాడింది. వివాహం తర్వాత దీపిక ‘చపాక్‌’, ‘జీరో’ వంటి చిత్రాలతో అలరించింది. గతేడాది వచ్చిన ‘83’ సినిమాలో భర్త రణ్‌వీర్‌ సరసన అతిథి పాత్రలో తళుక్కున మెరిసింది. ఓటీటీలో   విడుదలైన ‘గెహ్‌రాయీ’ చిత్రం మిశ్రమ ఫలితాన్ని అందించినా దీపికా నటనకు ప్రేక్షకులు మంచి మార్కులే వేశారు.  షారుఖ్‌ ఖాన్‌తో ‘పఠాన్‌’, హృత్రిక్‌ రోషన్‌ సరసన ‘ఫైటర్‌’ చిత్రాల్లో నటిస్తోంది. వీటితో పాటు కార్పొరేట్‌ వ్యవహారాలే నేపథ్యంగా వస్తున్న ‘ద ఇంటర్న్‌’, సైన్స్‌ ఫిక్షన్‌ జోనర్‌లో రానున్న ప్రభాస్‌ తర్వాతి సినిమా ‘ప్రాజెక్ట్‌ కె’ లోనూ ఈ ముద్దుగుమ్మే కథానాయిక.


హాలీవుడ్‌ తారగా

టుడు, గాయకుడు నిక్‌ జోనస్‌తో 2018లో వివాహం అనంతరం ఆకాశమే హద్దుగా దూసుకెళ్లిపోతోంది ప్రియాంక చోప్రా. హాలీవుడ్‌లో కథానాయికగా రాణిస్తూ విరామం లేకుండా ఉండటంతో హిందీ చిత్రాల్లో తక్కువగా కనిపిస్తోంది. ‘ఛేజింగ్‌ హ్యాపీనెస్‌’, ‘ది వైట్‌ టైగర్‌’ తదితర చిత్రాల్లో నటించింది. తాజాగా విడుదలైన ‘ది మాట్రిక్స్‌ రిసరెక్షన్స్‌’ లోనూ కనిపించి ఆకట్టుకుంది. హాలీవుడ్‌ చిత్రమైన ‘ఇట్స్‌ ఆల్‌ నెక్స్ట్‌ టు మి’ తో పాటు ఫర్హాన్‌ అక్తర్‌ దర్శకత్వంలో హిందీ సినిమా ‘జీ లే జరా’ సినిమాలో నటిస్తూ బిజీగా ఉంది.


తగ్గని వేగం

కొన్ని నెలల పాటు ప్రేమలో మునిగి తేలిన కత్రినా కైఫ్‌, విక్కీ కౌశల్‌ జంట 2021లో పెళ్లి పీటలెక్కింది. పెద్దగా విరామం తీసుకోకుండానే సెట్స్‌లోకి అడుగుపెట్టింది కత్రినా. తను నటించిన హాస్య ప్రధాన చిత్రం ‘ఫోన్‌ బూత్‌’ త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది.  విజయ్‌ సేతుపతితో కలిసి నటిస్తున్న ‘మెర్రీ క్రిస్‌మస్‌’ ఈ సంవత్సరం చివర్లో రానుంది. థ్రిల్లర్‌ కథలను అద్భుతంగా చెప్పే శ్రీరామ్‌ రాఘవన్‌ ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఫర్హాన్‌ అక్తర్‌ దర్శకత్వం వహిస్తున్న ‘జీ లే జరా’ సినిమాలోనూ కనిపించనుంది. సల్మాన్‌ ఖాన్‌తో కలిసి నటిస్తున్న భారీ యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌ ‘టైగర్‌ 3’. 2023 ఈద్‌ సందర్భంగా ఇది ప్రేక్షకుల ముందుకు రానుంది.


బిజీగా కొత్త పెళ్లికూతురు

టీవలే పెళ్లి పీటలు ఎక్కిన అలియా భట్‌ చేతిలోనూ భారీ ప్రాజెక్టులు ఉన్నాయి. తన భర్త, ప్రేమికుడు రణ్‌బీర్‌ కపూర్‌తో కలిసి నటించిన ‘బ్రహ్మాస్త్ర’ విడుదలకు సిద్ధంగా ఉంది. ఈ చిత్రం విడుదలకు కొన్ని రోజుల ముందే వీరి వివాహం జరగడంతో ఈ సినిమాకు కావల్సినంత ప్రచారం లభించింది. ప్రస్తుతం రణ్‌వీర్‌ సింగ్‌ సరసన ‘రాకీ ఔర్‌ రాణీ కి ప్రేమ్‌ కహానీ’ చిత్రంలో నటిస్తోంది. దీనికి కరణ్‌జోహార్‌ దర్శకత్వం వహిస్తున్నారు. జస్మీత్‌ కె రీన్‌ దర్శకత్వంలో రానున్న కామెడీ డ్రామా ‘డార్లింగ్స్‌’ లోనూ అలియా ఆడిపాడనుంది. వీటితో పాటు ఓ హాలీవుడ్‌ సినిమాలోనూ కనిపించనుందని తెలుస్తోంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని