Bollywood: వెండితెర క్రీడామణులు
అందంతో ఆకట్టుకోవడమే కాదు.. ఆటతో కనికట్టు చేయడమూ కథానాయికలకు తెలుసు. క్యారవాన్‌ల నుంచి కాలు బయట పెట్టని ముద్దుగుమ్మలకు పాత్ర కోసం నెలలకొద్దీ కష్టపడటమూ వచ్చు. అవకాశం చిక్కాలేగానీ మేం హీరోలకు ఏమాత్రం తీసిపోకుండా స్పోర్ట్స్ డ్రామా బయోపిక్‌లలో నటించగలం అని ఇప్పటికే ఎంతోమంది నిరూపించారు
అందంతో ఆకట్టుకోవడమే కాదు.. ఆటతో కనికట్టు చేయడమూ కథానాయికలకు తెలుసు. క్యారవాన్‌ల నుంచి కాలు బయట పెట్టని ముద్దుగుమ్మలకు పాత్ర కోసం నెలలకొద్దీ కష్టపడటమూ వచ్చు. అవకాశం చిక్కాలేగానీ మేం హీరోలకు ఏమాత్రం తీసిపోకుండా స్పోర్ట్స్ డ్రామా బయోపిక్‌లలో నటించగలం అని ఇప్పటికే ఎంతోమంది నిరూపించారు. పలు రకాల క్రీడాకారుల పాత్రల్లో ఒదిగిపోయారు. ఈ వరుసలోనే ఇంకొందరు భామలు మేటి క్రీడాకారుల జీవితాలకు తెర రూపం ఇవ్వడానికి సిద్ధమవుతున్నారు.
జులన్‌గా అనుష్క
ఈ మధ్యే ఆటకు వీడ్కోలు పలికారు భారత దిగ్గజ క్రికెటర్ జులన్ గోస్వామి. ఎవరి అండదండలు లేకుండా, పుట్టెడు కష్టాలు ఎదుర్కొని మేటి క్రీడాకారిణిగా ఎదిగారామె. ఆమె జీవితంలోని ఆటుపోట్లు, విజయాలు, మలుపుల ఆధారంగా ‘చక్డా ఎక్స్‌ప్రెస్’ రూపొందుతోంది. ఇందులో అనుష్కశర్మ జులన్ పాత్ర పోషిస్తున్నారు. ప్రోసిత్ రాయ్ తెరకెక్కిస్తుండగా.. అనుష్క సోదరుడు కర్ణేష్‌శర్మ నిర్మిస్తున్నారు. ఈ పాత్రలో ఒదిగిపోవడానికి అనుష్క ఓ కోచ్‌ని పెట్టుకొని మరీ మూడునెలలపాటు క్రికెట్ నేర్చుకున్నారు. భర్త విరాట్ నుంచి చాలా మెలకువలు ఒడిసిపట్టానన్నారు. ఇప్పటికే ఈ చిత్ర షూటింగ్ సగభాగం పూర్తైనట్టు అనుష్క సామాజిక మాధ్యమాల్లో వెల్లడించారు. వచ్చే ఏడాది ప్రథమార్ధంలో విడుదల చేయనున్నారు.
మిథాలీగా మెప్పించిన తాప్సి
దేశంలో ఎంతోమంది అమ్మాయిలు క్రికెట్ బ్యాట్ పట్టడానికి స్ఫూర్తిగా నిలిచిన క్రీడాకారిణి మిథాలీరాజ్. ఆమె నెలకొల్పిన లెక్కలేనన్ని రికార్డుల వెనక చెప్పలేనంత కష్టం దాగుంది. దర్శకుడు శ్రీజిత్ ముఖర్జీ ఈ ప్రయాణానికి ‘శభాష్ మిథూ’తో తెర రూపం ఇచ్చారు. ఇందులో తాప్సి టైటిల్ రోల్ పోషించారు. ఆ పాత్ర బాగా రావడానికి ఆమె కొన్నాళ్లపాటు స్వయంగా క్రికెట్‌లో శిక్షణ తీసుకున్నారు. ఈ చిత్రం జులై 15న థియేటర్లలోకి వచ్చింది. తాప్సి నటనకి విమర్శకుల ప్రశంసలు దక్కినా.. బాక్సాఫీసు దగ్గర పెద్దగా విజయం సాధించలేదు.
స్ప్రింటర్‌ని మించిన కష్టంతో..
కటిక పేదరికంలో పుట్టి, కష్టాలతో సావాసం చేస్తూ అంతర్జాతీయ స్ప్రింటర్‌గా ఎదిగిన ఒడిశా అమ్మాయి ద్యుతీచంద్. ఆమె కథని ‘రష్మీ రాకెట్’లో చూపించారు. ఆమె కష్టాలు, కన్నీళ్లు, ఆటపై ఆశ, చేదు అనుభవాలనన్నింటినీ తాప్సీ తెరపై చక్కగా ఆవిష్కరించారు. ఆకర్ష్ ఖురానా ఈ చిత్ర దర్శకుడు. జయాపజయాల సంగతి పక్కన పెడితే ఈ సినిమా కోసం తాప్సి నిజమైన స్ప్రింటర్‌కి మించి కష్టపడిందని అంతా మెచ్చుకున్నారు.
షూటర్లుగా భూమి, తాప్సి
‘షూటర్ దాదీ’, ‘రివాల్వర్ దాదీ’లంటే ఉత్తర్‌ప్రదేశ్ రాష్ట్రానికంతటికీ తెలుసు. అతివలే అయినా వాళ్లు పేరు మోసిన షార్ప్‌షూటర్లు. అలాంటి నేర నేపథ్యం ఉన్న ఇద్దరు మహిళలు షూటింగ్ క్రీడాకారిణిలుగా మారి అంతర్జాతీయ వేదికలపై సత్తా చాటడం అద్భుతమే. వీళ్ల కథను సాండ్ కీ ఆంఖ్ పేరుతో తుషార్ హీరానందాని తెరకెక్కించారు. ఈ బయోపిక్‌లో వయసు మళ్లిన చంద్రో, ప్రకాషిలుగా భూమి పెడ్నేకర్, తాప్సిలు నటించారు.
ధోనీ భార్యగా జాన్వీ?
మిస్టర్ కూల్, భారత క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ ఎం.ఎస్.ధోనీ జీవితంపై ఇప్పటికే రెండు బయోపిక్‌లు వచ్చాయి. సినీవర్గాలు ఇంకా ధ్రువీకరించకున్నా తాజాగా పట్టాలెక్కుతున్న ‘మిస్టర్ అండ్ మిసెస్ మహీ’ సైతం ధోనీ జీవితం ఆధారంగా రూపొందుతున్నట్టు సమాచారం. ఇందులో జాన్వీ కపూర్, రాజ్‌కుమార్ రావు ప్రధాన పాత్రధారులు. గతంలో ఎవరూ చూపించని విధంగా ధోనీ జీవితంలోని వ్యక్తిగత అంశాలు ఇందులో స్పృశిస్తున్నట్టు తెలుస్తోంది. ఈ చిత్రానికి సంబంధించిన గ్లింప్స్‌ని జాన్వీ ఇన్‌స్టాలో పంచుకుంది. అందులో క్రికెట్ మ్యాచ్‌కి సంబంధించిన దృశ్యాలు కనిపించడంతో ఇది కచ్చితంగా ధోనీ బయోపిక్ అనీ.. ధోనీ భార్య సాక్షి పాత్రలో జాన్వీ నటిస్తున్నట్టు అభిమానులు ఒక అంచనాకు వచ్చేశారు. శరణ్ శర్మ దీనికి దర్శకుడు.
‘సైనా’గా పరిణతి చూపిన పరిణీతి
స్టార్ షట్లర్ సైనా నెహ్వాల్ జీవితం రూపొందిన చిత్రం ‘సైనా’. ఇరవైనాలుగు అంతర్జాతీయ పతకాలు నెగ్గి భారత బ్యాడ్మింటన్ రంగంలో ఒక చరిత్ర సృష్టించిన సైనా జీవితంలో ఎన్నో చేదు సంఘటనలున్నాయి. ఆడపిల్లగా పుట్టినందుకు చిన్నప్పుడు ఆమె దగ్గరివాళ్ల నుంచే చులకనకు గురైంది. ఆ అవమానాలు, గెలవాలనే కసి, భావోద్వేగాలను అణుచుకుంటూ ఎదిగిన క్రమం... అన్నీ తెరపై కనిపించేలా సైనా పాత్రలో జీవించింది పరిణీతి చోప్రా. అమోల్ గుప్తే దర్శకత్వం వహించిన ఈ సినిమా 2021లో విడుదలైంది. సైనా జీవితాన్ని చక్కగా తెరకెక్కించారని అంతా మెచ్చుకున్నా.. కలెక్షన్లు నిరాశే మిగిల్చాయి. భూషణ్‌కుమార్, కృష్ణకుమార్ నిర్మించారు.
* ‘మేరీకోమ్’ బయోపిక్ కోసం ప్రియాంకా చోప్రా మూడునెలలపాటు బాక్సింగ్ నేర్చుకుంది.
* ‘దంగల్’లో ఫాతిమా సనా షేక్, సాన్యా మల్హోత్రాలు రెజ్లింగ్ క్రీడాకారులు గీతా ఫోగట్, బబితా కుమారిలుగా మెప్పించారు. మొత్తం షూటింగ్ సమయానికి మించి ఆటలోనే శిక్షణ తీసుకున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
IND vs AUS: ఆసీస్‌పై ఆల్‌రౌండ్ షో.. టీమ్ఇండియా ఘన విజయం
-
Bennu: నాసా ఘనత.. భూమి మీదికి గ్రహశకలం నమూనాలు!
-
Canada MP: ‘కెనడా హిందువుల్లో భయం’.. ట్రూడోపై సొంతపార్టీ ఎంపీ ఆర్య విమర్శలు..!
-
‘NEET PG అర్హత మార్కులు.. వారికోసమే తగ్గించారా?’: కాంగ్రెస్
-
Top Ten News @ 9 PM: ఈనాడు.నెట్‌లో టాప్ 10 వార్తలు
-
TTD: వైభవంగా శ్రీవారి బ్రహ్మోత్సవాలు.. చంద్రప్రభ వాహనంపై శ్రీనివాసుడు