Bollywood: సరికొత్త మాస్‌ అవతారం

‘జవాన్‌’... షారూక్‌ నటిస్తున్న సరికొత్త చిత్రం. తమిళ దర్శకుడు అట్లీ దీన్ని తెరకెక్కిస్తున్నారు. నయనతార ఇందులో నాయిక. ఈ చిత్రం గురించి తొలిసారిగా షారూక్‌ మాట్లాడారు. బాలీవుడ్‌లో తను కెరీర్‌ మొదలు పెట్టి 30 సంవత్సరాలు అయిన సందర్భంగా సామాజిక

Updated : 27 Jun 2022 07:08 IST

‘జవాన్‌’(Jawan)... షారూక్‌(Shahrukh Khan) నటిస్తున్న సరికొత్త చిత్రం. తమిళ దర్శకుడు అట్లీ(Atlee) దీన్ని తెరకెక్కిస్తున్నారు. నయనతార(Nayanthara) ఇందులో నాయిక. ఈ చిత్రం గురించి తొలిసారిగా షారూక్‌ మాట్లాడారు. బాలీవుడ్‌లో(Bollywood) తను కెరీర్‌ మొదలు పెట్టి 30 సంవత్సరాలు అయిన సందర్భంగా సామాజిక మాధ్యమాల ద్వారా అభిమానులు అడిగిన ప్రశ్నలకు సమాధానాలిచ్చారు. ఎక్కువ మంది జవాన్‌ గురించి... నయనతార అందులో నటిస్తోందా? లేదా? అని అడిగారు. వీటిపై స్పందించారు బాద్‌షా. ‘‘మాస్‌ సినిమాలు రూపొందించడంలో అట్లీ ప్రతిభ ఇప్పటికే అందరికీ తెలుసు. ‘జవాన్‌’ సరికొత్త మాస్‌ చిత్రం. నేను మునుపెన్నడూ చేయని పాత్ర ఇందులో పోషిస్తున్నా. భిన్నమైన కథ అయినందునే ఇందులో నేను భాగస్వామినయ్యాను. ఇక నయనతార గురించి చెప్పేదేముంది. అంతటి ప్రతిభ గల నటితో కలిసి పనిచేసే అవకాశం ముందుంది. ఇంతకంటే ఎక్కువగా ఈ చిత్రం గురించి వివరాలు వెల్లడించలేను’’ అని చెప్పుకొచ్చారు.


‘మళ్లీ రాదు.. ఈ తీయని రాతిరి..’

బాలీవుడ్‌ మిస్టర్‌ పర్‌ఫెక్ట్‌ ఆమిర్‌ఖాన్‌(Aamir Khan) కథానాయకుడిగా తెరకెక్కుతున్న చిత్రం ‘లాల్‌సింగ్‌ ఛద్దా’(Laal Singh Chaddha). కరీనాకపూర్‌(Kareena Kapoor) కథానాయిక. నాగచైతన్య(Naga Chaitanya) కీలకపాత్ర పోషించారు. ఆగస్టు 11న ప్రేక్షకుల ముందుకొస్తోంది. ప్రచార కార్యక్రమాల్లో భాగంగా ఈ చిత్రంలోని మూడో పాటను ఇటీవల విడుదల చేశారు. అమితాబ్‌ భట్టాచార్య రాయగా, ప్రీతమ్‌ బాణీలు సమకూర్చారు. అరిజిత్‌సింగ్‌(Arijit Singh) ఆలపించారు. ‘ఫిర్‌ న ఐసీ రాత్‌ ఆయేగీ..’ అంటూ సాగే ఈ మెలోడీ గీతం మనసుకి జోల పాడేలా ఉంది. ‘మనసుకి నచ్చినవాళ్లు దూరమైతే కలిగే వేదన, దీర్ఘకాలపు ఎదురుచూపులు చాలా బాధకరం.. ఈ భావోద్వేగాలను ఈ సాంగ్‌ ఒడిసిపడుతుంది’ అంటూ చిత్రాన్ని నిర్మిస్తున్న ‘ఆమిర్‌ఖాన్‌ ప్రొడక్షన్స్‌’ వివరాలు సామాజిక మాధ్యమాల్లో పంచుకుంది.


దానికి మంచి ఫలితమే ఉంటుంది

‘‘వేచి చూడటమనేది ఎంతో మంచి ఫలితాన్ని ఇస్తుంది’’ అంటోంది శ్రద్ధా కపూర్‌(Shraddha Kapoor). ప్రభాస్‌(Prabhas) ‘సాహో’తో(Saaho) తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన ఈ భామ బాలీవుడ్‌లో క్రేజీ ప్రాజెక్టులతో బిజీగా ఉంది. ఈ సుందరి రణ్‌బీర్‌కు(Ranbir Kapoor) జంటగా ఓ చిత్రంలో నటిస్తోంది. లవ్‌ రంజన్‌(Love Ranjan) దర్శకుడు. రొమాంటిక్‌ కామెడీ  జానర్‌లో రూపొందుతున్న ఈ సినిమా 2021లో ప్రారంభమైంది. ఇటీవలే స్పెయిన్‌ షెడ్యూల్‌తో దీని చిత్రీకరణ ముగిసింది. ఈ సందర్భంగా శ్రద్ధా మాట్లాడుతూ ‘‘ఈ చిత్రం కోసం మేమెంతో  ఆసక్తిగా చూశాం. ఇప్పుడది పూర్తైంది. ఇలా ఎదురుచూపులకు మంచి ఫలితం తప్పకుండా ఉంటుందని నా నమ్మకం. ఈ సినిమాకు సంబంధించి ఈ రెండేళ్లలో ఎన్నో వీడియోలు లీక్‌ అయ్యాయి. అయినా మా బృందం కుంగిపోలేదు. అన్ని పనులు పూర్తి చేసి... ప్రేక్షకుల ముందుకు రానున్నాం’’ అని   చెప్పుకొచ్చింది శ్రద్ధా. ఇందులో డింపుల్‌ కపాడియా మరో ముఖ్యపాత్ర పోషిస్తోంది. చాలా ఏళ్ల తర్వాత బోనీకపూర్‌ ఓ పాత్రలో మెరవనున్నారు. 2023, మార్చి 8న ఈ సినిమా విడుదల కానుంది.

Read latest Movies News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts