Brahmanandam: ఏ జీవిగా పుట్టించినా నవ్వించాలనే కోరుకుంటా: బ్రహ్మానందం

ఫిల్మ్ నగర్ కల్చరల్ క్లబ్ (ఎఫ్‌ఎన్‌సీసీ) ప్రముఖ హాస్య నటుడు బ్రహ్మానందాన్ని సత్కరించింది. ఏ జీవిగా పుట్టించినా నవ్వించాలని దేవుణ్ని కోరుకుంటానని బ్రహ్మానందం అన్నారు.

Published : 24 Mar 2023 00:05 IST

హైదరాబాద్‌: కోట్లాది మంది ప్రేక్షకులను నవ్వించడం అదృష్టంగా భావిస్తున్నానని, ఏ జీవిగా పుట్టించినా నవ్వించాలనే దేవుణ్ని కోరుకుంటానని ప్రముఖ హాస్య నటుడు బ్రహ్మానందం (Brahmanandam) అన్నారు. ఉగాదిని పురస్కరించుకొని హైదరాబాద్ ఫిల్మ్ నగర్ కల్చరల్ క్లబ్ (ఎఫ్‌ఎన్‌సీసీ) సభ్యులు బ్రహ్మానందాన్ని సత్కరించారు. తెలంగాణ మంత్రి తలసాని శ్రీనివాస యాదవ్, ప్రముఖ దర్శకుడు త్రివిక్రమ్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఎఫ్‌.ఎన్‌.సి.సి స్థాపించి 30 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా నిర్వహించిన సన్మాన కార్యక్రమంలో పలువురు కళాకారులు నృత్య ప్రదర్శనతో ఆకట్టుకున్నారు.

వేడుకనుద్దేశించి బ్రహ్మానందం మాట్లాడుతూ.. ‘‘ఇదంతా చూస్తుంటే ‘నా హృదయం సంతోషంతో నిండిపోతే.. నోరు మూగబోతోంది’’ అనే సామెత గుర్తుకొస్తోంది. ఓ కళాకారుడు రంగస్థలంపై ఎప్పుడూ అబద్ధాలు చెప్పకూడదు. అలా చెబితే అంతకు మించిన దుర్మార్గం ఇంకోటి ఉండదు. నాకు జరిగిన ఈ సన్మానం నా జీవితంలో మర్చిపోలేనిది. ఈ కార్యక్రమం ఇంత అద్భుతంగా ఉంటుందని నేను ఊహించలేదు. మన పండగల పూర్వాపరాలు, సంస్కృతుల గొప్పతనాన్ని తెలియజేస్తూ కళారుకారులు చేసిన నృత్యాలు అద్భుతం. ఇన్ని కోట్ల మందిని నవ్వించడం నేను పూర్వజన్మలో చేసుకున్న సుకృతం. అందరూ మోక్షం కోరుకుంటారు. అంటే జన్మరాహిత్యం.. మరో జన్మ ఉండ కూడదు అని. కానీ, నేను దేవుణ్ణి.. నాకు మోక్షం వద్దు మళ్లీ మళ్లీ జన్మించాలని.. ఆ జన్మల్లో నేను ఏ జీవిగా పుట్టినా సరే నా తోటి జీవులను నవ్వించే వరం ప్రసాదించమని కోరుకుంటా. ఉత్తేజ్‌ రాసిన సన్మానపత్రం నా హృదయాన్ని తాకింది. ఇంతమంది మహామహుల మధ్య గడిపిన ఈ క్షణాలు నాకు ఎప్పటికీ మర్చిపోలేని తీపి గుర్తులు’’ అని ఆనందం వ్యక్తం చేశారు.

తలసాని శ్రీనివాసయాదవ్‌ మాట్లాడుతూ.. ‘‘గిన్నీస్‌ బుక్‌ రికార్డు సాధించి, కోట్లాది ప్రేక్షకుల హృదయాల్లో స్థానం సంపాదించిన బ్రహ్మానందంగారు తెలుగు చిత్ర పరిశ్రమకు చెందిన వారు కావడం మనందరికీ గర్వకారణం. ఆయన భారతదేశం గర్వించదగ్గ నటుడు. తెలుగు పరిశ్రమకు ఎప్పుడు ఏం కావాలన్నా చేయడానికి ప్రభుత్వం సిద్ధంగానే ఉంటుంది’’ అని అన్నారు.

త్రివిక్రమ్‌ శ్రీనివాస్‌ మాట్లాడుతూ.. ‘‘సినిమా పరిశ్రమకు చెందిన వ్యక్తిగా బ్రహ్మానందం గారితో వ్యక్తిగతంగా గడిపే సమయం దొరకడం నా అదృష్టం. ప్రేక్షకుల్ని నవ్వించడమే కాదు.. ఆయన కూడా ఎప్పుడూ నవ్వుతూ బతుకుతుంటారు. మనం ఏదైనా చెబితే విననట్టే ఉంటారు. కానీ, మనం ఆ సీన్‌ చెప్పిన మరుక్షణం నుంచి ఆయన అందులో పరకాయప్రవేశం చేసి, దాని గురించే ఆలోచిస్తూ ఉంటారు. ఆ క్యారెక్టర్‌ను తనలోని నటుడి దగ్గరకు లాక్కుంటారు. మనకు భౌతికంగా కనిపించే బ్రహ్మానందం వేరు.. మానసికంగా శిఖరాగ్రానికి చేరిన బ్రహ్మానందం వేరు. ఆయన చాలా లోతైన వ్యక్తి. ఎంతో విజ్ఞానం ఉన్న వ్యక్తి. మానసికంగా ఆయన స్థాయి నుంచి ఎన్నో మెట్లు దిగి ఈ కమెడియన్‌ పాత్రను పోషిస్తున్నారు. ఆధ్యాత్మికత, వాస్తవికతల మధ్యలో ఉండే సంఘర్షణలో బతికే మేధావి బ్రహ్మానందం. ‘రంగమార్తాండ’లో ఆయన పాత్రే.. ఆయన నిజ జీవితం. మనందరి నవ్వులు ఒక్క సంవత్సరం కింద లెక్కేస్తే.. కొన్ని కోట్ల సంవత్సరాలు అవుతాయి. ఆయన అన్ని సంవత్సరాలూ జీవించాలని, మనల్ని నవ్విస్తూనే ఉండాలని కోరుకుంటున్నా’’ అని అన్నారు.

‘‘పద్మశ్రీ బ్రహ్మానందం గారిని సత్కరించుకోవడం మనందరి అదృష్టంగా భావిస్తున్నా. 1250కి పైగా చిత్రాల్లో నటించి కోట్ల మందిని నవ్వించే భాగ్యం ఆయనకు దక్కడం భగవంతుని వరం. మా కమిటీ సభ్యులు, సబ్‌ కమిటీల్లోని సభ్యులందరూ  సొంత కార్యక్రమం అన్నట్టుగా భావించి పనిచేయడం వల్లే ఇది సాధ్యమైంది. 30 సంవత్సరాలుగా ఈ క్లబ్‌ను ఈ స్థాయికి తీసుకు రావడానికి చాలామంది పెద్దలు ఎంతో కష్టపడ్డారు. హైదరాబాద్‌ నగరంలో అనేక క్లబ్‌లు ఉన్నప్పటికీ ఎఫ్‌ఎన్‌సీసీ చేస్తున్న కార్యక్రమాలు మిగిలిన క్లబ్‌లకు ఆదర్శంగా నిలవడం చాలా సంతోషించదగ్గ విషయం’’ అని ఎఫ్‌ఎన్‌సీసీ ప్రెసిడెంట్ ఘట్టమనేని  ఆదిశేషగిరిరావు పేర్కొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని