‘బ్రహ్మాస్త్ర’ మా ఇద్దరి డీఎన్‌ఏలో భాగం : రణ్‌బీర్‌ కపూర్‌

బ్రహ్మాస్త్ర(Brahmastra) సినిమా ప్రచారంలో భాగంగా రణ్‌బీర్‌ కపూర్(Ranbir Kapoor)‌-ఆలియా భట్‌(Alia Bhatt) జంట జోరుగా ప్రమోషన్‌ కార్యక్రమాల్లో.......

Updated : 15 Nov 2022 16:29 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: బ్రహ్మాస్త్ర(Brahmastra) సినిమా ప్రచారంలో భాగంగా రణ్‌బీర్‌ కపూర్(Ranbir Kapoor)‌-ఆలియా భట్‌(Alia Bhatt) జంట జోరుగా ప్రమోషన్‌ కార్యక్రమాల్లో పాల్గొంటోంది. కొద్ది రోజులు క్రితం తెలుగునాట సందడి చేసిన ఈ జంట ప్రస్తుతం నార్త్‌లో ప్రచారం చేస్తున్నారు. ఇందులో భాగంగా ఓ మీడియా సంస్థకిచ్చిన ఇంటర్వ్యూలో రణ్‌బీర్‌ ‘బ్రహ్మాస్త్ర’ గురించి కీలక వ్యాఖ్యలు చేశారు.

బ్రహ్మాస్త్ర చిత్రం ప్రత్యేకత ఏంటి? అని అడిగిన ప్రశ్నకు స్పందిస్తూ ‘సినిమా విడుదలయ్యాక ఈ ప్రశ్నకు ప్రేక్షకులే సమాధానం చెప్తారు. ఇక నా విషయానికొస్తే ‘బ్రహ్మాస్త్ర’ నాకు, ఆలియాకు చాలా ప్రత్యేకం. ఒక్క మాటలో చెప్పాలంటే మా ఇద్దరి డీఎన్ఏలో బ్రహ్మాస్త్ర ఒక భాగం. ఈ సినిమాతోనే నేను కొత్త జీవితాన్ని ప్రారంభించాను. ఆస్వాదిస్తున్నాను. బ్రహ్మాస్త్ర షూటింగ్‌ రోజుల్లో ఆలియాను నా జీవితంలోకి ఆహ్వానించడం, మేమిద్దరం ఒక్కటవ్వడం, మా జీవితంలోకి మరొకరు రావడం ఇవన్నీ ఓ కలలా జరిగిపోయాయి. ఇంకా ఆలియాకు ఈ సంవత్సరం చాలా ప్రత్యేకమైనది. గంగూభాయి కథియావాడి, ఆర్‌ఆర్‌ఆర్‌ లాంటి భారీ విజయాల్లో భాగమైన ఆమె ఇప్పుడు బ్రహ్మాస్త్ర చిత్రంలోనూ కీలకం కానుంది. నిజానికి ఆలియాకు నేను హైవే చిత్రం నుంచే పెద్ద అభిమానిని’ అంటూ వెల్లడించాడు.

ఈ కార్యక్రమంలో ఆలియా మాట్లాడుతూ..‘నిజంగా బ్రహ్మాస్త్ర మాకు చాలా ప్రత్యేకమైన చిత్రం. మా డైరెక్టర్‌ అయాన్‌ పెద్ద అద్భుతాన్ని సృష్టించారు. కృషి, నిబద్ధత ఆయాన్‌ అనే వ్యక్తికి పర్యాయపదాలు. ఇక రణ్‌బీర్‌ విషయానికొస్తే అతడి చిత్రాల్లో నాకు బర్ఫీ అంటే ఇష్టం. ఎందుకంటే ఆ చిత్రంలో రణ్‌బీర్‌ కళ్లతో నటించాడు’ అని చెప్పుకొచ్చింది. 

ఈ నెల 9న విడుదల కానున్న ‘బ్రహ్మాస్త్ర’ దేశవ్యాప్తంగా ఐదు భాషల్లో  త్రీడీలో విడుదల కానుంది. ఈ చిత్రంలో రణ్‌బీర్‌కపూర్‌, ఆలియాభట్‌ జంటగా నటించగా, అమితాబ్‌ బచ్చన్ (Amitabh Bachchan)‌, నాగార్జున(Nagarjuna) కీలకపాత్రలు పోషించారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని