BRAHMASTRA: ఆట మొదలైంది.. హాలీవుడ్‌ సినిమాను తలపించేలా బాలీవుడ్‌ మూవీ ట్రైలర్‌

బాలీవుడ్‌ డైరెక్టర్‌ ఆయాన్‌ ముఖర్జీ కలల ప్రాజెక్ట్‌గా సిద్ధమైన చిత్రం ‘బ్రహ్మాస్త్ర’. సుమారు రూ.400 కోట్లకు పైగా బడ్జెట్‌తో రూపుదిద్దుకున్న ప్రతిష్ఠాత్మకమైన సినిమా ఇది. పంచభూతాలు, శక్తి రూపాలుగా చెప్పుకునే వివిధ...

Updated : 15 Jun 2022 13:38 IST

ప్రతి సీనూ అద్భుతమే.. రణ్‌బీర్‌ అదరగొట్టేశాడు

ముంబయి: బాలీవుడ్‌ డైరెక్టర్‌ అయాన్‌ ముఖర్జీ కలల ప్రాజెక్ట్‌గా సిద్ధమైన చిత్రం ‘బ్రహ్మాస్త్ర’. సుమారు రూ.400 కోట్లకు పైగా బడ్జెట్‌తో రూపుదిద్దుకున్న ప్రతిష్ఠాత్మకమైన సినిమా ఇది. వివిధ అస్త్రాల విశిష్ఠతను తెలియజేసే కథాంశంతో ఈ సినిమా రూపుదిద్దుకుంది. బాలీవుడ్‌ యువ జంట రణ్‌బీర్‌ కపూర్‌, ఆలియాభట్ ప్రధాన పాత్రల్లో నటించారు. అమితాబ్‌ బచ్చన్‌, నాగార్జున కీలకపాత్రలు పోషించారు. మూడు భాగాలుగా సిద్ధమవుతోన్న ఈ ప్రాజెక్ట్‌లోని మొదటి భాగాన్ని ‘బ్రహ్మాస్త్రం.. పార్ట్‌-1 శివ’ అనే పేరుతో తెలుగు ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. సెప్టెంబర్‌ 9న ఈ సినిమా విడుదల కానుంది. ఈనేపథ్యంలో బుధవారం ఉదయం ట్రైలర్‌ని చిత్రబృందం విడుదల చేసింది.

‘‘నీరు, గాలి, నిప్పు.. కొన్ని వేల సంవత్సరాలుగా ఈ శక్తులన్నీ కొన్ని అస్త్రాలలో ఇమిడి ఉన్నాయి. ఈ కథ అస్త్రాలన్నింటికీ అధిపతి అయిన బ్రహ్మాస్త్రానిది. ఆ బ్రహ్మాస్త్రం విధి తన అరచేతి రేఖలలో చిక్కుకుని ఉందన్న విషయం ఆ యువకుడికే తెలియదు. అతనే శివ’’ అంటూ చిరంజీవి వాయిస్‌ ఓవర్‌తో ప్రారంభమైన ఈ ట్రైలర్‌లోని ప్రతి సీన్‌ అద్భుతంగా సాగింది. ఓ వైపు యువ జంట ప్రేమను చూపిస్తూనే, బ్రహ్మాస్త్రాన్ని కాపాడేందుకు శివ, నంది అస్త్రం (నాగార్జున) దుష్టశక్తులతో చేసే పోరాట సన్నివేశాలు హాలీవుడ్‌ని తలపించేలా ఉన్నాయి. ‘‘ఇషా నాకేమీ కాదు. అగ్నితో నాకు బంధం ఉంది. అగ్ని నన్ను దహించలేదు’’ అంటూ శివ చెప్పే డైలాగ్‌లు, ఇషా-శివల ప్రేమాయణం మెప్పించేలా సాగాయి.  ధర్మా ప్రొడక్షన్స్‌ పతాకంపై కరణ్‌జోహార్‌ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇక, తెలుగులో రాజమౌళి సమర్పణలో ఈసినిమా విడుదల కానుంది.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని