Buchi Babu: ‘పుష్ప’ కోసం కాదట.. మరి ఎన్టీఆర్‌ కోసమేనా?

‘ఉప్పెన’తో బాక్సాఫీస్‌ వద్ద ఘన విజయాన్ని అందుకున్నారు దర్శకుడు బుచ్చిబాబు (Buchi Babu).

Published : 29 Jul 2022 02:10 IST

హైదరాబాద్‌:  ‘ఉప్పెన’తో బాక్సాఫీస్‌ వద్ద ఘన విజయాన్ని అందుకున్నారు దర్శకుడు బుచ్చిబాబు (Buchi Babu). అయితే, ఆయన తర్వాత చేయబోయే చిత్రంపై మాత్రం ఇప్పటివరకూ స్పష్టత రాలేదు. ఈ క్రమంలో ఓ ఆసక్తికర వార్త సామాజిక మాధ్యమాల్లో విపరీతంగా వైరల్‌ అయింది. సుకుమార్‌ తెరకెక్కించనున్న ‘పుష్ప2’ కోసం బుచ్చిబాబు కూడా పనిచేస్తున్నారని వార్తలు వెలువడ్డాయి. ఇందుకోసమే సుకుమార్‌ని కలిశారని చెప్పుకొచ్చారు. ఈ వార్తలపై బుచ్చిబాబు స్పష్టత ఇచ్చారు. సుకుమార్‌తో కలిసి దిగిన ఫొటోను పంచుకుంటూ ‘‘ఈ ఫొటో నేను తర్వాత చేయబోయే నా సినిమా కథ గురించి చర్చిస్తున్న సందర్భంలోనిది. మా గురువుగారు సుకుమార్ సర్‌ నా కోసం నా సినిమా కథ కోసం సాయం చేయడానికి వచ్చారు. సుకుమార్ సర్‌ సినిమా కథలో నేను కూర్చొని చర్చించేంత స్థాయి నాకు లేదు రాదు. ఆయన నుంచి నేర్చుకోవడం తీసుకోవడమే తప్ప , ఆయనకి ఇచ్చేంత లేదు’’ అని ట్వీట్‌ చేశారు.

ఇంతవరకూ బాగానే ఉన్నా, ఇప్పుడు ఈ చర్చ ఎన్టీఆర్‌ వైపు వెళ్లింది. ‘ఉప్పెన’ విజయం తర్వాత బుచ్చిబాబు ఓ కథను ఎన్టీఆర్‌కు వినిపించారు. ‘పెద్ది’ అనే టైటిల్‌ను కూడా అనుకుంటున్నారని అప్పట్లో వార్తలు వచ్చాయి. పూర్తి మాస్‌ కమర్షియల్‌ మూవీగా విజయనగరం బ్యాక్‌డ్రాప్‌లో స్పోర్ట్స్‌ డ్రామాగా బుచ్చిబాబు కథను వినిపించారని టాక్‌. అయితే, దీనిపై ఎలాంటి అప్‌డేట్‌ రాలేదు. ఫస్టాఫ్‌ ఎన్టీఆర్‌కు బాగా నచ్చిందని, అయితే, సెకండాఫ్‌కు ఇంకా మెరుగులు దిద్దాలని సూచించినట్లు టాలీవుడ్‌లో టాక్ వినిపించింది. దీనిపై ఓ స్పష్టతకు రాలేకపోవడంతో ఎన్టీఆర్ ఇప్పుడు సుక్కుని రంగంలోకి దింపాడని తెలుస్తోంది. బుచ్చిబాబు కథకు సుక్కు మెరుపులు జోడించే పనిలో పడ్డారని టాక్‌ వినిపిస్తోంది.

ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో ఎన్టీఆర్ ఓ సినిమా చేస్తున్నారు. ఇది పూర్తయ్యేలోపు బుచ్చిబాబు తన సినిమాకు సంబంధించిన స్క్రిప్ట్‌ రెడీ చేయాలి. ఇప్పుడు సుకుమార్‌ కూడా దీనిపై దృష్టిసారించడంతో త్వరలోనే ఎన్టీఆర్‌ చిత్రంపై ఓ క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. మరి చూడాలి ఏం చేస్తారో.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని