Butta Bomma: ‘బుట్టబొమ్మ’ ప్రత్యేకత అదే!

అనిక సురేంద్రన్‌, సూర వశిష్ఠ, అర్జున్‌ దాస్‌ ప్రధాన పాత్రధారులుగా రూపొందిన ‘బుట్టబొమ్మ’ ఈ నెల 4న ప్రేక్షకుల ముందుకొస్తోంది.

Updated : 02 Feb 2023 07:16 IST

అనిక సురేంద్రన్‌, సూర వశిష్ఠ, అర్జున్‌ దాస్‌ ప్రధాన పాత్రధారులుగా రూపొందిన ‘బుట్టబొమ్మ’ (Butta Bomma) ఈ నెల 4న ప్రేక్షకుల ముందుకొస్తోంది. ఈ సందర్భంగా దర్శకుడు శౌరి చంద్రశేఖర్‌ టి.రమేష్‌ బుధవారం హైదరాబాద్‌లో విలేకర్లతో ముచ్చటించారు. ఆ విషయాలివీ...

‘‘లాక్‌డౌన్‌ సమయంలో మలయాళంలో విడుదలైన ‘అయ్యప్పనుమ్‌ కోశియుమ్‌’, ‘కప్పేలా’ సినిమాల్ని చూసి చాలా ఇష్టపడ్డా. వీటిని మనం చేస్తే బాగుంటుందనుకున్నా. ఆ రెండు సినిమాల రీమేక్‌ హక్కుల్ని సితార సంస్థ కొనుక్కుందని తెలిసింది. నా స్నేహితుడు ఎడిటర్‌ నవీన్‌ నూలి సహకారంతో నిర్మాతలు చినబాబు, నాగవంశీని కలిసి ‘కప్పేలా’పై నాకున్న ఆసక్తిని చెప్పా. కొన్ని రోజుల కథా చర్చల తర్వాత నేను చేయగలనని నమ్మి వాళ్లు ఈ అవకాశం ఇచ్చారు. కథ, కథనాల్లోని బలమే నన్ను ఎక్కువగా ఆకట్టుకుంది. వర్తమాన సాంకేతికత అంశాలు అంతగా ప్రభావం చూపని ఓ మారుమూల ప్రాంతంలో సాగే కథ ఇది. హాస్యం, భావోద్వేగాలు, మలుపులు మనసుల్ని హత్తుకుంటాయి. అనిక సురేంద్రన్‌, అర్జున్‌ దాస్‌, సూర్య వశిష్ఠ.. పాత్రల్లో ఒదిగిపోయారు’’.  

‘‘మాది సినిమా నేపథ్యమున్న కుటుంబం కాదు. అయినా చిన్నప్పట్నుంచీ సినిమా అంటే చాలా ఇష్టం. మా నాన్న ప్రతి వారం ఏదో ఒక సినిమాకి తీసుకెళ్లేవారు. ఆ ఆసక్తితోనే పీజీ తర్వాత ఇటువైపు వచ్చా. సుకుమార్‌ దగ్గర ‘జగడం’ నుంచి ‘పుష్ప’ సినిమాల వరకు ప్రయాణం కొనసాగుతోంది. అంతకుముందు రామ్‌గోపాల్‌ వర్మ కార్పొరేషన్‌లో పనిచేశా. ‘శూల్‌’  తెరకెక్కించిన ఈశ్వర్‌ నివాస్‌ దగ్గర నాలుగు సినిమాలకు పని చేశా’’.  

‘‘అన్ని సినిమాల్ని రీమేక్‌ చేయలేం. ‘బుట్టబొమ్మ’ పూర్తిగా స్క్రిప్ట్‌పై ఆధారపడిన చిత్రం. మన నేపథ్యానికి, అభిరుచులకి తగ్గట్టుగా చాలా మార్పులు అవసరమయ్యాయి. కథనమే ఈ సినిమాకి ప్రధాన బలం. దర్శకుడు సుకుమార్‌కి ‘కప్పేలా’ గురించి చెప్పినప్పుడు ఆయన సినిమా చూసి కథనం గురించే మాట్లాడారు. సినిమాలో నాకూ, ఆయనకీ ఒకే విషయం నచ్చడంతో నాకు మరింత ధైర్యం కలిగింది. ఇందులో కొన్ని మార్పులు చేశాం. అవి చూస్తే మాతృక దర్శకుడు సైతం ఈ ఆలోచన నాకూ వస్తే బాగుండేది అనుకునేలా ఉంటాయి. మన ‘బుట్టబొమ్మ’ ప్రత్యేకత అదే. దర్శకుడు త్రివిక్రమ్‌ సినిమా చూసి బాగుందని మెచ్చుకున్నారు’’.

‘‘సినిమా చేస్తున్నప్పుడు మనలో ఒకవైపు రచయిత.. మరోవైపు దర్శకుడు ఉంటాడు. రచయిత ఎక్కడ ఆగితే, అక్కడి నుంచి దర్శకుడు బాధ్యతని తీసుకోవాలనే విషయాన్ని నేను నమ్ముతా. ఆ పద్ధతిలోనే చేశా. ప్రేక్షకుల్ని కట్టిపడేసేలా కథ, కథనాలుంటే ఏ జోనర్‌ అయినా మెప్పు పొందుతుంది. తర్వాత యాక్షన్‌ జోనర్‌లో సినిమా చేయాలని ఉంది’’.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని