Captain Review: రివ్యూ: కెప్టెన్‌

 ఆర్య హీరోగా దర్శకుడు శక్తి సౌందర్‌ రాజన్‌ తెరకెక్కించిన ‘కెప్టెన్‌’ సినిమా ఎలా ఉందంటే..

Published : 08 Sep 2022 16:32 IST

Captain Review చిత్రం: కెప్టెన్‌; తారాగణం: ఆర్య, ఐశ్వర్య లక్ష్మి, సిమ్రన్‌, హరీశ్ ఉత్తమన్‌, కావ్య శెట్టి, భరత్‌రాజ్‌ తదితరులు; సంగీతం: డి. ఇమ్మాన్‌; ఛాయాగ్రహ‌ణం: ఎస్‌. యువ; కూర్పు: ప్రదీప్‌ ఇ. రాఘవ్‌; దర్శకత్వం: శక్తి సౌందర్‌ రాజన్‌; నిర్మాణ సంస్థ‌: థింక్‌ స్టూడియోస్; విడుద‌ల తేదీ: 08-09-2022

భార‌తీయ తెర‌పై.. ఆర్మీ నేప‌థ్యం అన‌గానే స‌రిహ‌ద్దులు, త్యాగాలు, పోరాటాలు, దేశ‌భ‌క్తి వంటి విష‌యాలే గుర్తొస్తాయి. అందుకు భిన్నంగా రూపొందిన చిత్ర‌మే ‘కెప్టెన్‌’ (Captain). హాలీవుడ్ సినిమాల ప్ర‌భావం బ‌లంగా ఉన్న దర్శకుడు శ‌క్తి సౌంద‌ర్ రాజ‌న్‌.. మ‌రోసారి త‌న పంథాని కొన‌సాగిస్తూ ‘ప్రిడేట‌ర్‌’ స్ఫూర్తితో  ఈ సినిమాని రూపొందించారు. ఆర్య (Arya) క‌థానాయ‌కుడిగా న‌టించ‌డంతోపాటు, ఈ సినిమా నిర్మాణంలోనూ భాగం కావ‌డంతో మ‌రిన్ని అంచ‌నాలు నెల‌కొన్నాయి. తెలుగులో శ్రేష్ఠ్ మూవీస్ విడుద‌ల చేసిన ఈ సినిమా ఎలా ఉందో తెలుసుకునే ముందు క‌థేమిటో చూద్దాం... (Captain Review)

క‌థేంటంటే?

మూడు దేశాల స‌రిహ‌ద్దుల్లో ఉన్న ఓ అట‌వీ ప్రాంతం అది. భార‌తీయ సైన్యం ఆధీనంలో ఉన్న సెక్టార్ 42 జోన్ అంటే అంద‌రికీ హ‌డ‌ల్‌. లోప‌లికి వెళ్లిన ఆర్మీ బృందాలు అంతు చిక్క‌ని రీతిలో మృత్యువు పాల‌వుతుంటాయి. బృంద స‌భ్యుల్లోనే ఒక‌రు అంద‌రినీ అంతం చేసి,  ఆ త‌ర్వాత త‌న‌ని తాను కాల్చుకుని ఆత్మ‌హ‌త్య చేసుకుంటుంటాడు. దాని వెన‌క ర‌హ‌స్యాన్ని ఛేదించ‌డం కోసం కెప్టెన్  విజ‌య్ కుమార్ (ఆర్య‌)ని, అత‌ని బృందాన్ని ఆప‌రేష‌న్‌కి పంపుతారు అధికారులు. క్లిష్ట‌త‌ర‌మైన ఆ ఆప‌రేష‌న్‌కి వెళ్లిన విజ‌య్, అత‌ని బృందం తిరిగొచ్చిందా?  లేదా? ఇంత‌కీ అక్క‌డికి వెళ్లిన‌ వాళ్ల‌ని అంతం చేస్తున్న‌దెవ‌రనేది మిగ‌తా క‌థ‌.

ఎలా ఉందంటే?

హాలీవుడ్ సినిమాల్ని గుర్తు చేస్తూ ప్ర‌తిసారీ ఓ విభిన్న‌మైన కాన్సెప్ట్‌ని స్పృశిస్తున్న ద‌ర్శ‌కుడు శ‌క్తి సౌంద‌ర్ రాజ‌న్‌. జాంబీ, సైన్స్ ఫిక్ష‌న్ నేప‌థ్యంలో ఆయ‌న ఇదివ‌ర‌కు త‌మిళంలో తీసిన చిత్రాలు తెలుగులోనూ ప్రేక్ష‌కుల ముందుకొచ్చాయి. ఈసారి కూడా హాలీవుడ్‌లో వ‌చ్చిన  సినిమాల స్ఫూర్తితో ఓ వింత జీవి చుట్టూ అల్లిన క‌థ‌తో ‘కెప్టెన్‌’ని తెర‌కెక్కించారు. ప్ర‌ధానంగా ఈ సినిమాకి ‘ప్రిడేట‌ర్’ స్ఫూర్తి. అడ‌విలోకి ఎవ్వ‌రినీ రానివ్వ‌కుండా అడ్డుకుంటున్న ఓ ర‌హ‌స్య శ‌క్తిగా క‌నిపించే ఆ జీవి ఎలా పుట్టింది?  అది ఎవ‌రి నియంత్ర‌ణ‌లో ప‌నిచేస్తుంటుందనే విష‌యాలు ఆస‌క్తిక‌రం. శ‌త్రువు ఎవ‌రో తెలియ‌కుండానే మొద‌లయ్యే పోరాటమే ఈ క‌థ‌. కాన్సెప్ట్ వ‌ర‌కు ఆక‌ట్టుకున్నా.. దాన్ని ఆస‌క్తిక‌రంగా మ‌ల‌చ‌డంలో మాత్రం ద‌ర్శ‌కుడు విఫ‌ల‌మ‌య్యారు.

క‌థానాయ‌కుడు స‌హా ఏ పాత్ర‌లోనూ బ‌లం లేక‌పోవ‌డం సినిమాకి మైన‌స్‌గా మారింది. మ‌న‌సుల్ని క‌ట్టిప‌డేసేలా క‌థ‌ని మ‌ల‌చ‌లేక‌పోయారు. సంఘ‌ర్ష‌ణ, భావోద్వేగాలకి చోటే లేని రీతిలో క‌థ‌ని అల్లారు. వింత జీవితో సాగే పోరాటంలోనూ థ్రిల్లింగ్‌గా అనిపించ‌దు. వింత జీవి రూపం భ‌య‌పెట్టేలా ఉన్న‌ప్ప‌టికీ అవి నేరుగా మ‌నుషుల్ని అంతం చేయ‌క‌పోవ‌డంతో  హీరోకి, అత‌ని బృందానికి పెద్ద‌గా స‌వాళ్లు ఎదురు కావు. త‌న బృందంలోని స‌భ్యుడిపై ప‌డిన మ‌చ్చ తొలగించ‌డం కోసం హీరో చేసే ప్ర‌య‌త్నాలు,  హీరోపై మ‌న‌సుప‌డ్డ అమ్మాయి  క‌థ‌... ప‌ర్వాలేద‌నిపిస్తాయంతే. చివ‌ర్లో కొన్ని మ‌లుపులు ఉన్న‌ప్ప‌టికీ అవి ప్రేక్ష‌కుల‌పై పెద్ద‌గా ప్ర‌భావం చూపించ‌వు. ఏ ద‌శ‌లోనూ సినిమా ఆస‌క్తిని రేకెత్తించ‌కుండా స్త‌బ్దుగా ముగిసిన‌ట్టు అనిపిస్తుంది. 

ఎవ‌రెలా చేశారంటే?

బ‌ల‌మైన పాత్ర‌ల్లో క‌నిపిస్తూ త‌న‌దైన ప్ర‌భావం చూపించే ఆర్యకి ఇందులో న‌టించేందుకు పెద్ద‌గా ఆస్కారం ల‌భించలేదు. సినిమా మొత్తం గ‌న్ ప‌ట్టుకుని అలా క‌నిపిస్తారంతే. ఐశ్వ‌ర్య ల‌క్ష్మి, కావ్య‌శెట్టి ఇద్ద‌రు హీరోయిన్లు ఉన్నా వాళ్ల పాత్ర‌ల్లో బ‌లం లేదు. సీనియ‌ర్ న‌టి సిమ్ర‌న్ కీల‌క‌మైన పాత్ర‌లో క‌నిపిస్తుంది.  ఆమె పాత్ర నేప‌థ్యం ఆక‌ట్టుకునేలా ఉన్న‌ప్ప‌టికీ దానిపై కూడా పైపైనే క‌స‌ర‌త్తులు చేశారు ద‌ర్శ‌కుడు. దాంతో ఓ మంచి పాత్ర నీరుగారిపోయిన‌ట్టైంది.  సాంకేతికంగా సినిమా ఫర్వాలేద‌నిపిస్తుంది. ఇమ్మాన్‌ సంగీతం,యువ.. కెమెరా ప‌నిత‌నం మెప్పిస్తుంది. క‌థ‌, క‌థ‌నాల ప‌రంగా తేలిపోయారు ద‌ర్శ‌కుడు. విజువ‌ల్ ఎఫెక్ట్స్‌కి ప్రాధాన్యం ఉన్న ఈ సినిమా నిర్మాణంలో అక్క‌డ‌క్క‌డా లోపాలు క‌నిపిస్తాయి.

బ‌లాలు

కాన్సెప్ట్‌

కొన్ని పోరాట ఘ‌ట్టాలు.. మ‌లుపులు

బ‌ల‌హీన‌త‌లు

- క‌థ‌నం

థ్రిల్లింగ్ అంశాలు కొర‌వ‌డ‌టం

చివ‌రిగా:  కెప్టెన్... అంత‌గా ఆక‌ట్టుకోడు

గమనిక: ఈ సమీక్ష సమీక్షకుడి దృష్టి కోణానికి సంబంధించింది. ఇది సమీక్షకుడి వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే!


Read latest Movies News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts