Chalapathi Rao: చలపతిరావు మరణం పరిశ్రమకే కాదు నాకూ తీరని లోటు: మోహన్‌బాబు

సీనియర్‌ నటుడు చలపతిరావు మరణంతో చిత్రపరిశ్రమలో తీవ్ర విషాదం నెలికొంది. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని కోరుతూ పలువురు ప్రముఖులు సంతాపం ప్రకటించారు. 

Updated : 25 Dec 2022 15:53 IST

‘‘నేను మద్రాసులో ఉద్యోగం చేస్తున్న రోజుల్లో.. చలపతిరావు గారు అప్పుడప్పుడే పైకి వస్తున్న నటుడు. మేం కుటుంబసభ్యుల్లా ఉండేవాళ్లం. ప్రతి పండగకు నన్ను ఆహ్వానించి ఆప్యాయంగా భోజనం పెట్టేవారు. మా బ్యానర్‌లో ఎన్నో సినిమాల్లో ఆయన నటించారు. అతను సెట్‌లో ఉంటే కోలాహలంగా ఉంటుంది. మంచి మనసున్నవాడు. అజాతశత్రువు. అటువంటి మంచి వ్యక్తి మరణం సినిమా పరిశ్రమకే కాదు, నాక్కూడా తీరని లోటు. ఆయన ఆత్మకు శాంతి, ఆ కుటుంబానికి మనశ్శాంతి కలగాలని కోరుకుంటున్నా’’

- మంచు మోహన్‌బాబు


‘‘ప్రముఖ సినీ నటుడు చలపతి రావు మృతి దిగ్భ్రాంతికి గురిచేసింది. సాంఘిక, పౌరాణిక, చారిత్రక పాత్రల పోషణలో దిట్ట.. ప్రతినాయకుడిగా, సహాయనటుడిగా తనదైన ముద్రవేశారు. ఎన్టీఆర్‌కు ఏకలవ్య శిష్యుడు. తెలుగు సినీ పరిశ్రమ గొప్ప నటుడిని కోల్పోయింది. ఆయన కుటుంబసభ్యులకు నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నా’’

- కంభంపాటి రామమోహన్‌రావు


‘‘పాత్ర ఏదైనా సరే ఆయన అందులో ఒదిగిపోయేవారు. ఆయన అకాల మరణం సినీ పరిశ్రమకు తీరని లోటు’’

-ఎస్వీ కృష్ణారెడ్డి


చలపతిరావుకు నటుడు చిరంజీవి నివాళులర్పించారు. రవిబాబు నివాసానికి చేరుకున్న ఆయన చలపతిరావు పార్థివదేహం వద్ద శ్రద్ధాంజలి ఘటించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. ‘‘ఈ డిసెంబర్ తీరని వేదన కలిగించింది. విలక్షణమైన నటుడు, తనదైన శైలిలో తెలుగు ప్రేక్షకుల అభిమానాన్ని చూరగొన్న చలపతిరావు అకాల మరణ వార్త నన్ను కలచివేసింది. మద్రాసులో ఉన్నప్పటి నుంచే మాకు అనుబంధం ఉంది. ఎన్నో చిత్రాల్లో ఆయనతో కలిసి నేను నటించాను. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటున్నా. రవిబాబుతోపాటు ఆయన కుటుంబ సభ్యులందరికీ నా ప్రగాఢ సానుభూతి’’ 

- చిరంజీవి


‘‘చలపతిరావు గారి అకాల మరణం నన్ను ఎంతగానో కలచివేసింది. నందమూరి కుటుంబం ఇవాళ ఒక కుటుంబ సభ్యుడిని కోల్పోయింది. తాత గారి రోజుల నుండి మా కుటుంబానికి అత్యంత ఆప్తుడైన ఆయన మృతి మా అందరికీ తీరని లోటు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని నా ప్రార్థన’’

- ఎన్టీఆర్‌ 

 

 


‘‘ప్రముఖ నటులు చలపతిరావు గారి మృతి దిగ్భ్రాంతి కలిగించింది. రోజుల వ్యవధిలో ఇద్దరు సినీ ప్రముఖులను కోల్పోవడం విషాదకరం. 1000కి పైగా సినిమాల్లో నటించిన ఆయన ఎన్టీఆర్‌కు ఎంతో ఆప్తుడు. చలపతిరావు ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తున్నా’’

- తెదేపా అధినేత చంద్రబాబు నాయుడు


‘‘సీనియర్ నటుడు, నిర్మాత చలపతిరావు మృతి ఎంతో కలచివేసింది. ఎన్నో సినిమాల్లో నటించి ప్రజల మనసులో ఆయన చెరగని ముద్ర వేశారు. ఆయన ఆత్మకు శాంతి కలగాలని ఆ దేవుడిని ప్రార్ధిస్తున్నాను. వారి కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నా’’

- నారా లోకేశ్‌


‘‘చలపతిరావు గారి హఠాన్మరణం తీవ్రంగా కలిచివేసింది. తన విలక్షణమైన నటనతో తెలుగు ప్రేక్షకులను అలరించారు. నిర్మాతగా మంచి చిత్రాలని నిర్మించారు. ఈ రోజు తెలుగు చిత్ర పరిశ్రమ మంచి నటుడిని కోల్పోయింది. మా కుటుంబంతో ఆయనకు ఆత్మీయ బంధం ఉంది. నాన్నగారితో కలసి ఎన్నో చిత్రాల్లో నటించారు. నా చిత్రాల్లోనూ మంచి పాత్రలు పోషించారు. ఆయన మా కుటుంబ సభ్యుడు. ఆయన ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటూ.. కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను’’

- నందమూరి బాలకృష్ణ


‘‘చలపతిరావు ఎంతో మంచి వ్యక్తి. ఎప్పుడూ సరదాగా ఉండేవారు. ప్రమాదం తర్వాత నుంచి ఆయన ఎక్కువగా బయటకు రాలేదు. ఇండస్ట్రీలో అందరితో స్నేహంగా ఉండేవారు. జోకులు వేస్తూ అందర్నీ నవ్వించేవారు. ఆయన మాకెంతో ఆప్తుడు. మూడు రోజుల క్రితం కూడా షూట్‌లో పాల్గొన్నారు. ఇండస్ట్రీకి చెందిన ప్రముఖులు వరుసగా మృతి చెందడం దురదృష్టకరం. వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నా’’

- దగ్గుబాటి సురేశ్‌


‘‘నటుడు చలపతిరావు మృతి ఇండస్ట్రీకి తీరని లోటు. ఆయనతో అసిస్టెంట్ డైరెక్టర్ నుంచి నటుడి వరకు ఎంతోకాలం కలిసి పనిచేశా. ఆయన్ని మేమంతా బాబాయ్ అని పిలుచుకునే వాళ్లం. అలాంటి బాబాయ్ చనిపోవడం బాధాకరం. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటున్నా’’

- కాశీవిశ్వనాథ్‌ 


‘‘చలపతి రావు నాకు ఆప్త మిత్రుడు. నేను తెరకెక్కించిన ఎన్నో చిత్రాల్లో ఆయన నటించారు. ఎప్పుడూ నవ్వుతూ, నవ్విస్తూ ఉండేవారు. ఈ రోజు ఇండస్ట్రీ ఒక మంచి వ్యక్తిని కోల్పోయింది’’

- ముత్యాల సుబ్బయ్య 


‘‘ఆయన నాకొక ఆప్తమిత్రుడు. మంచి మనిషి. ఆయనతో ఎన్నో సినిమాలు చేశాను. ఈ మధ్యే ఆయనతో మాట్లాడాను. త్వరలోనే కలుద్దాం అనుకున్నాం. ఇంతలోనే ఇలా జరగడం నాకెంతో బాధగా ఉంది. లెజెండ్స్‌ అందరూ ఇలా వెళ్లిపోతున్నారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటున్నా’’

- దిల్లీ రాజేశ్వరీ 


‘‘ప్రముఖ నటుడు చలపతిరావు మృతి చెందడం బాధాకరం. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని దేవుడిని ప్రార్థిస్తున్నాను. ప్రతినాయకుడిగానే కాకుండా సహాయనటుడిగానూ తనదైన శైలిలో ఆయన ప్రేక్షకుల్ని అలరించారు. నిర్మాతగా ఎన్నో మంచి చిత్రాలు నిర్మించారు. ఆయన కుమారుడు, నటుడు, దర్శకుడు రవిబాబు, ఇతర కుటుంబసభ్యులకు నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నా. తెలుగు సినీ పరిశ్రమలో ఒక తరానికి ప్రతినిధులుగా ఉన్న సీనియర్‌ నటులు ఒక్కొక్కరుగా ఇలా కాలం చేయడం దురదృష్టకరం’’ 

- పవన్‌కల్యాణ్‌

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని