K Viswanath: సంస్కృతిని.. సినిమాని ఒకచోట అందంగా చేర్చిన మేధావి

‘‘పితృ సమానులు, కళాతపస్వి కె.విశ్వనాథ్‌ (K Viswanath) ఇక లేరన్న వార్త దిగ్భ్రాంతికి గురి చేసింది. పండితుల్ని, పామరుల్నీ ఒకేలా మురిపించే ఆయన చిత్రాల శైలి విశిష్టమైంది. తెలుగు జాతి ఖ్యాతిని తన సినిమాల ద్వారా ప్రపంచ స్థాయికి తీసుకెళ్లిన మహా దర్శకుడు.

Updated : 04 Feb 2023 06:44 IST

‘‘పితృ సమానులు, కళాతపస్వి కె.విశ్వనాథ్‌ (K Viswanath) ఇక లేరన్న వార్త దిగ్భ్రాంతికి గురి చేసింది. పండితుల్ని, పామరుల్నీ ఒకేలా మురిపించే ఆయన చిత్రాల శైలి విశిష్టమైంది. తెలుగు జాతి ఖ్యాతిని తన సినిమాల ద్వారా ప్రపంచ స్థాయికి తీసుకెళ్లిన మహా దర్శకుడు. ఆయన దర్శకత్వంలో ‘శుభలేఖ’, ‘స్వయంకృషి’, ‘ఆపద్బాంధవుడు’ చిత్రాల్లో నటించే అవకాశం లభించింది. నాకు వ్యక్తిగతంగా ఆయనతో ఉన్నది గురు శిష్యుల సంబంధం. అంతకుమించి తండ్రీకొడుకుల అనుబంధం. షూటింగ్‌ సమయంలో ఆయన చేతితో స్వయంగా అన్నం కలిపి పెట్టిన సందర్భాలు చాలా ఉన్నాయి. ‘ఇంద్ర’ చిత్రీకరణ జరుగుతున్నప్పుడు ఎందుకో విశ్వనాథ్‌ దంపతుల్ని వారణాసి తీసుకెళ్లాలని అనిపించింది. ఫోన్‌ చేస్తే.. ‘ఇది చిరంజీవి పిలుపులా లేదు. శివుడే శివ శంకర వరప్రసాద్‌ రూపంలో పిలిచాడనిపిస్తోంది’ అని బయలు దేరి వచ్చారు. ఆ మహనీయుడి చిత్రం ‘శంకరాభరణం’ విడుదలైన రోజునే ఆ శంకరుడికి ఆభరణంగా, ఆయన కైలాసానికి ఏతెంచారు. కళాతపస్వి విశ్వనాథ్‌ లేని లోటు భారతీయ చిత్ర పరిశ్రమకు, తెలుగు వారికి ఎప్పటికీ తీరనిది’’.

 చిరంజీవి


* ‘‘కళ సజీవమైనది.. అజరామమైనదని పూర్తిగా అర్థం చేసుకున్న గొప్ప వ్యక్తి కళాతపస్వి కె.విశ్వనాథ్‌. ఆయన చేసిన కళాసేవ ఎప్పటికీ నిలిచి ఉంటుంది. ఆయన తదనంతరం కూడా అది బతికే ఉంటుంది. నేను ఎప్పటికీ ఆయన అభిమానినే’’.

కమల్‌హాసన్‌


* ‘‘కళాతపస్వి కె.విశ్వనాథ్‌ కన్నుమూయడం తెలుగు చలన చిత్ర పరిశ్రమకు తీరని లోటు. భారతీయ సంస్కృతీ సంప్రదాయాలు మరీ ముఖ్యంగా మన తెలుగుదనాన్ని అణువణువున ప్రతిబింబించేలా ఆయన తీసిన అత్యద్భుత చిత్రాలు తెలుగు సినిమాకే గర్వ కారణం. తెలుగు చిత్రసీమ ఖ్యాతిని ఖండాంతరాలు వ్యాపింపజేసి.. ప్రతి తెలుగు వాడు గర్వించేలా చేసిన దిగ్గజ దర్శకుడి మరణం తీవ్ర విచారానికి గురి చేసింది’’.

బాలకృష్ణ


* ‘‘ప్రపంచంలో ఎవరైనా మీ తెలుగు సినిమా గొప్పదనం ఏంటని అడిగితే మాకు కె.విశ్వనాథ్‌ ఉన్నారని రొమ్ము విరిచి.. గర్వంగా చెప్పుకుంటాం. తెలుగు సినిమా, కళపై మీ సంతకం ఎప్పటికీ ప్రకాశవంతంగా తళుకులీనుతుంటుంది. సినిమా గ్రామర్‌లో మీరు నేర్పిన పాత్రలకు ఆజన్మాన్తం రుణపడి ఉంటాం’’. 

ఎస్‌.ఎస్‌.రాజమౌళి


* ‘‘కె.విశ్వనాథ్‌ కన్నుమూయడం విచారకరం. ఆయన దర్శకత్వంలో ‘స్వాతికిరణం’ చేసినందుకు గర్వపడుతున్నా’’.

మమ్ముట్టి


* ‘‘మనం మరో దిగ్గజాన్ని కోల్పోయాం. కె.విశ్వనాథ్‌ తన చిరస్మరణీయమైన చిత్రాలు, పాత్రలతో శాశ్వత ప్రభావాన్ని చూపారు. ఆయన వారసత్వం భవిష్యత్‌ తరాలకు స్ఫూర్తి’’.

నాగార్జున


* ‘‘కళామ్మతల్లి తన ముద్దు బిడ్డను కోల్పోయింది. తెలుగు చిత్రాల స్థాయిని ఖండాంతరాలకు వ్యాపింపజేయడంలో కళాతపస్వి విశ్వనాథ్‌ది ప్రథమ స్థానం. వారు లేని లోటు ఎప్పటికీ తీరనిది’’.

కె.రాఘవేంద్రరావు


* ‘‘కె.విశ్వనాథ్‌ గారు మీరు నాకు చాలా నేర్పించారు. ‘ఈశ్వర్‌’ సమయంలో మీతో సెట్‌లో ఉండటం దేవాలయంలో ఉన్నట్లుగా ఉండేది’’.

అనిల్‌ కపూర్‌


* ‘‘తెలుగు సినిమా ఖ్యాతిని ఖండాంతరాలుగా వ్యాపింపజేసిన వారిలో విశ్వనాథ్‌ గారిది ఉన్నతమైన స్థానం. ‘సాగరసంగమం’ లాంటి  అపురూపమైన చిత్రాల్ని అందించారు. ఆయన లేని లోటు ఎన్నటికీ తీరనిది’’.

ఎన్టీఆర్‌


* ‘‘సంస్కృతిని, సినిమాని చాలా అందంగా ఒకేచోట చేర్చిన మేధావి కె.విశ్వనాథ్‌. మిమ్మల్ని మేము చాలా మిస్‌ అవుతున్నాం’’.

మహేష్‌బాబు


* ‘‘మేము ఒక దిగ్గజాన్ని కోల్పోయాము. కె.విశ్వనాథ్‌ గారూ.. మీరు మా అందరి హృదయాలలో, కళలో ఎప్పటికీ చిరస్థాయిగా నిలిచి ఉంటారు’’.

రామ్‌చరణ్‌


* ‘‘భారతీయ సినీ చరిత్రలో గొప్ప దర్శకుడిగా కీర్తి పొందిన కె.విశ్వనాథ్‌ కన్నుమూశారన్న వార్త నన్ను ఎంతో బాధించింది. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తున్నా’’.

ఇళయరాజా


* ‘‘నరుడి బ్రతుకు నటన, ఈశ్వరుడి తలపు ఘటన. ఆ రెంటి నట్టనడుమ తన తపన సాగించి, తపస్సు కావించి, తనువు చాలించిన రుషి. వెండితెరకు ఇకపై దొరకునా ఇటువంటి సేవ’’.

ఎం.ఎం.కీరవాణి


* ‘‘విశ్వనాథ్‌ గురించి నా మనసులో ఉన్నది చెప్పాలంటే ‘విశ్వ దర్శకుడికి వినోదమందించ, విశ్వనాథుడేగే విశ్వపురికి’ అనిపిస్తోంది. ‘శంకరాభరణం’ విడుదలైన ఫిబ్రవరి 2నే ఆయన శివుడి దగ్గరకు వెళ్లారు’’.  

కోట శ్రీనివాసరావు


* ‘‘పుట్టిన ప్రతి వాడూ చనిపోకతప్పదు. కానీ, అద్భుతమైన మరణాన్ని పొందిన కె.విశ్వనాథ్‌ కళ బతికున్నంత కాలం, కళాకారులు బతికున్నంత కాలం మనతోనే ఉంటారు. భారతీయ చలన చిత్ర చరిత్రలో విరబూసిన స్వర్ణకమలం ఆయన’’.

బ్రహ్మానందం


* ‘‘సినిమా విషయంలో ఆయన ఏం నమ్మారో.. చివరి వరకూ దానికే కట్టుబడి ఉన్నారు. కొన్నేళ్లుగా తెలుగు సినిమా ఖ్యాతి ప్రపంచవ్యాప్తమైంది. దానికి పునాదులు వేసిన దర్శకుడు విశ్వనాథ్‌’’.

రాధిక


* ‘‘స్వర్ణకమలం’ చిత్ర సమయంలో ఎన్నో విలువైన విషయాలు నేర్పారు. భవిష్యత్‌ తరాలూ ఆయన సినిమాని గుర్తు పెట్టుకుంటాయి’’.

వెంకటేష్‌


* ‘‘నా గురువు, గొప్ప దర్శకుడు కె.విశ్వనాథ్‌ ఇక లేరు. మీరు నాకు చాలా నేర్పించారు. నన్నెల్లప్పుడూ నడిపించారు. ‘సిరి సిరి మువ్వ’, ‘సర్గం’ నుంచి ‘సంజోగ్‌’ వరకు చాలా చిత్రాల్లో మీతో కలిసి పని చేసే అవకాశం వచ్చింది. మీరెప్పుడూ మా జ్ఞాపకాల్లో జీవించే ఉంటారు’’.

జయప్రదTags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు