Updated : 25 Dec 2020 11:22 IST

లాక్‌డౌన్‌లో లగ్నం.. కరోనాలో కల్యాణం

ఇంటర్నెట్‌డెస్క్‌: సామాన్యుడు నుంచి సెలబ్రిటీ వరకూ ప్రతి ఒక్కరి జీవితంలో వివాహం ఒక మధుర జ్ఞాపకం. కుటుంబ సభ్యులు, బంధువులు, స్నేహితులతో అంగరంగ వైభవంగా ఆ వేడుకను చేసుకోవాలని అందరూ ఆశిస్తారు. అయితే, 2020 ఆ సంబరాలను, మధుర జ్ఞాపకాలను ఆస్వాదించనీయకుండా చేసింది. అందుకు కారణం ‘కరోనా’ అని ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆడంబరంగా జరగాల్సిన వివాహాలన్నీ అతి కొద్దిమంది సన్నిహితులతో సాదాసీదాగా చేసుకోవాల్సి వచ్చింది. ఇందుకు సెలబ్రిటీలు కూడా మినహాయింపు కాదు. అలా కరోనా నిబంధనలు పాటిస్తూనే ఈ ఏడాది మూడు ముళ్ల బంధంతో ఒక్కటైన ఆ సెలబ్రిటీలు ఎవరో చూసేయండి.

మిహికతో భల్లాల ప్రణయం

మోస్ట్‌ ఎలిజబుల్‌ బ్యాచిలర్స్‌లో దగ్గుబాటి రానా ఒకరు. తన తోటి కుర్రహీరోలంతా ఒక్క  ఒక్కొరుగా పెళ్లి పీటలు ఎక్కుతుండటంతో ఈ భల్లాలదేవుడి పెళ్లెప్పుడు అనే చర్చ టాలీవుడ్‌లో చాన్నాళ్లపాటు జోరుగా సాగింది. అందరినీ ఆశ్చర్యంలో ముంచెత్తుతూ రానా తన పెళ్లి వార్తలకు కట్‌ చెప్పాడు.తన స్నేహితురాలు మిహికతో రాసుకున్న ప్రేమ స్క్రిప్ట్‌ను కొవిడ్‌ సమయంలో పెళ్లి వరకు తీసుకొచ్చాడు. రామానాయుడు స్టూడియోలో ఆగస్టు8న మిహికా బజాజ్‌ను మనువాడి కొత్త వెలుగులు తెచ్చాడు. అతికొద్ది మంది అతిథుల మధ్య తెలుగు, మరాఠీ ఇలా రెండు సంప్రదాయ పద్ధతుల్లో పెళ్లి చేసుకున్నారు రానా. ప్రస్తుతం వేణు ఊడుగల దర్శకత్వంలో ‘విరాట పర్వం’ చేస్తున్నారు. తమిళంలో తాను చేసిన ‘అరణ్య’ చిత్రం విడుదలకు సిద్ధంగా ఉంది.

హల్లో డాక్టర్‌.. అంటూ నిఖిల్‌

ఈ ఏడాది పలుమార్లు వాయిదా పడిన యువహీరో నిఖిల్‌ పెళ్లి ఎట్టకేలకు కొవిడ్‌ నిబంధనలతో సన్నిహితులమధ్య జరిగింది. ‘మా పెళ్లిని ఏ శక్తి ఆపలేద’ని ప్రకటించిన నిఖిల్‌ అన్నట్లుగానే లాక్‌డౌన్‌ కాలంలోనే పెళ్లి బాజాలు మోగించారు. తన ప్రేయసి డాక్టర్‌ పల్లవి వర్మను మే14న తన    వ్యవసాయ క్షేత్రంలో మనువాడారు. నిఖిల్‌ ప్రస్తుతం ‘కార్తికేయ2’ లోనూ నటిస్తున్నాడు. సుకుమార్‌ నిర్మిస్తున్న ‘18పేజెస్‌’ చిత్రీకరణ హైదరాబాద్‌లో జరుగుతోంది.

నితిన్‌ ‘దిల్‌’ దోచిన శాలిని

తెలుగు యువ హీరో నితిన్‌ ఈ ఏడాది పెళ్లి చేసుకుని తన అభిమానుల్ని సంతోషాల్లో ముంచారు. చాలా కాలంగా శాలినితో ప్రేమలో ఉన్న నితిన్‌కు ఎట్టకేలకు మూడు ముళ్లేసి సరికొత్త బంధంలోకి అడుగుపెట్టారు.ఈ ఏడాది జులైలో హైదరాబాద్‌లోని ఫలక్‌నూమా ప్యాలెస్‌లో శాలినితో ఒక్కటయ్యారు. పవన్‌  కల్యాణ్, త్రివిక్రమ్‌తోపాటు పలువురు సినీ ప్రముఖులు ఆ వేడుకకు హాజరై వధూవరులను ఆశీర్వదించారు. ప్రస్తుతం ‘అంధాధున్‌’ రీమేక్‌తోపాటు, ‘రంగ్‌దే’ చిత్రంలోనూ నటిస్తున్నారు.

చందమామ.. జత కలిసింది

తెలుగు ప్రేక్షకుల హృదయాల్లో ఇన్నాళ్లు వెన్నెల్లు  కురిపించిన చందమామ కాజల్‌. కుర్రకారు గుండెలకు గాయం చేస్తూ ఓ ఇంటి కోడలైంది. ఈమె చెల్లెలు నిషా అగర్వాల్‌ వివాహం కొన్నేళ్ల కిందటే జరిగింది. టాలీవుడ్, కోలీవుడ్‌లో భారీ సినిమాలు, ఆఫర్లతో బిజీగా ఉండటంతో కాజల్‌ పెళ్లి ఆలోచన చేయలేదు. కొంతకాలంగా పారిశ్రామికవేత్త గౌతమ్‌ కిచ్లుతో ప్రేమలో విహరిస్తున్న ఈ చక్కనమ్మ ఎట్టకేలకు పెళ్లి బాజాలు మోగించింది. అక్టోబర్‌ 30న ముంబయిలోని తాజ్‌ హోటల్‌లో పెళ్లి పీటలెక్కింది. మాల్దీవుల్లో విహరించిన ఈ జంట ఫొటోలు నెట్టింట వైరల్‌ అయ్యాయి. ప్రస్తుతం హైదరాబాద్‌లో జరుగుతున్న ఆచార్య చిత్రీకరణలో కాజల్‌ పాల్గొంటుంది

అట్టహాసంగా నిహారిక వివాహ వేడుక

నాగబాబు గారాలపట్టి నిహారిక కల్యాణ వేడుకతో టాలీవుడ్‌లో సందడి నెలకొంది. లాక్‌డౌన్‌ సడలింపులు జరిగాక టాలీవుడ్‌లో జరిగిన పెళ్లి నిహారికదే.డిసెంబర్‌ 9న చైతన్యతో ఏడడుగులు వేసింది. ఉదయ్‌పుర్‌లోని ఓ ప్యాలెస్‌లో డెస్టినేషన్‌ వెడ్డింగ్‌ చేసుకుంది ఈ అమ్మాయి. కొద్దిమంది అతిథులు, స్నేహితుల మధ్య చైతన్యను వివాహమాడింది. సంగీత్, మెహందీ, రిసెప్షన్‌లలో మెగా హీరోలతో పాటు టాలీవుడ్‌ కథానాయకులు హాజరవడం, ఆ  ఫొటోలు నెట్టింట్లో వైరల్‌గా మారడంతో మెగాఅభిమానుల ఆనందానికి అవధులు లేకుండా పోయాయి.

వీరే కాదు, యువ దర్శకుడు సుజీత్‌-ప్రవల్లిక, నటుడు రాజా-హిమ బిందు, వివేక్‌ ఆత్రేయ-శ్రీజ, కన్నడ నటుడు నిఖిల్‌గౌడ-రేవతిలతో పాటు నటి సనా ఖాన్‌ కూడా వివాహం చేసుకున్నారు.

ఇవీ చదవండి

సోహైల్‌ ‘కథ వేరే ఉంటది’.. లిఫ్ట్‌లో అనసూయ!

సుమ ఆరోగ్య చిట్కా.. అనుపమతో ఉన్నదెవరు.? 

Read latest Movies News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat, and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

మరిన్ని