Published : 28 Apr 2022 01:26 IST

Celebrities: రూ. కోట్లు ఇస్తామన్నా.. అందుకు నో చెప్పారు!

ఇంటర్నెట్‌ డెస్క్‌: వారంతా అగ్ర నటులు, గొప్ప క్రీడాకారులు. వృత్తిపరంగా ఎంత పారితోషికం పుచ్చుకుంటారో.. వాణిజ్య ప్రకటనలకు అదే స్థాయిలో అందుకుంటుంటారు. అలా అని ‘దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలి’ అన్న చందంగా అన్ని బ్రాండ్‌లకు ప్రచారం చేయరు. తమ అభిమానుల్ని, సామాజిక బాధ్యతలను దృష్టిలో పెట్టుకుని, హాని చేస్తాయనిపించే ఉత్పత్తుల యాడ్‌ సెకను నిడివే ఉన్నా, కోట్లకు కోట్లు ఇస్తామన్నా నిర్మొహమాటంగా ‘నో’ చెప్పేస్తారు. ఇప్పటికే కొన్నింటికి చెప్పేశారు. వారెవరు? తిరస్కరించిన యాడ్స్‌ ఏంటి? అసలు ఎలాంటి ప్రకటనల్లోనూ కనిపించని స్టార్‌లు ఎవరు?

అమితాబ్‌ బచ్చన్‌

యాడ్స్‌కు పెట్టింది పేరు బాలీవుడ్‌ ప్రముఖ నటుడు అమితాబ్‌ బచ్చన్‌. మ్యాగీ, టాటా స్కై, నవరత్న ఆయిల్‌, గుజరాత్‌ టూరిజం, జస్ట్‌ డయల్‌, టీవీఎస్‌ జ్యూపిటర్‌, ఫ్లిప్‌కార్ట్‌, క్యాడ్బెరీ డైరీ మిల్క్‌, ఫస్ట్‌ క్రై, తనిష్క్‌ వంటి ఎన్నో ప్రముఖ బ్రాండ్‌లకు ప్రచారకర్తగా వ్యవహరించిన బిగ్‌బీ ఓ శీతల పానీయం బ్రాండ్‌ విషయంలో బాధపడ్డారట. దాని గురించి ఓ సారి ఇలా చెప్పుకొచ్చారు. ‘‘శీతల పానీయం విషంలాంటిదని మా టీచర్‌ చెప్పింది కదా. దాన్నెలా ప్రచారం చేస్తారు? అంటూ సందేహిస్తున్న ఓ అమ్మాయి నాకు ఎదురైంది. ఇదే అనుమానం ప్రజలందరిలోనూ ఉంటుందని భావించి.. ఆ బ్రాండ్‌ ప్రకటనల్లో కనిపించడాన్ని ఆపేశా. అప్పటి నుంచీ ఏ బ్రాండ్‌కైనా ప్రచారం చేయాలనుకుంటే.. ముందుగా దాని గురించి లోతైన పరిశోధన చేస్తున్నా. క్లయింట్‌ను సంప్రదించి తగిన వివరాలు తెలుసుకుంటున్నా. ధూమపానం, మద్యపానానికి సంబంధించి ఉత్పత్తుల యాడ్స్‌లో నటించేందుకు నేనెప్పటికీ అంగీకరించను. హానికారకాలైన వాటిని నేను వినియోగించనపుడు ప్రజలను వాడాలని ఎలా చెబుతా?’’ అని అమితాబ్‌ పేర్కొన్నారు. పాన్‌ మసాలా బ్రాండ్‌ ప్రమోషన్‌ నుంచి బిగ్‌బీ గతేడాది వైదొలిగిన సంగతి తెలిసిందే. ఇందుకోసం తీసుకున్న డబ్బును ఆయన వెనక్కి ఇచ్చేశారు.


సుశాంత్‌సింగ్‌ రాజ్‌పుత్‌

తన నటన, వ్యక్తిత్వంతో కోట్లమంది హృదయాల్లో సుస్థిర స్థానాన్ని సంపాదించుకున్నాడు దివంగత సుశాంత్‌సింగ్‌ రాజ్‌పుత్‌. సౌందర్య ఉత్పత్తుల వల్లే అందం పెరుగుతుందనే మాటతో సుశాంత్‌ ఏకీభవించేవాడు కాదు. తాను అవగాహన కల్పించడం వల్ల చాలామంది ఆయా ఉత్పత్తులు వినియోగిస్తారని, ఎలాంటి పరిస్థితులు ఎదురైనా పూర్తి బాధ్యత వహించాలని.. దానికి కట్టుబడి ఉంటేనే ప్రచారం చేయాలనుకునేవాడట. తన మనసు అంగీకరించకపోవడంతో 2018లో ఓ ఫెయిర్‌నెస్‌ క్రీమ్‌ బ్రాండ్‌లో నటించలేదు. దాని విలువ అక్షరాల పదిహేను కోట్లు అని అప్పట్లో ప్రచారం సాగింది.


బాలకృష్ణ

యాడ్స్‌లో నటించని కొద్దిమంది నటుల్లో నందమూరి బాలకృష్ణ ఒకరు. టీవీ, పత్రికా ప్రకటనల్లో ఆయన ఇప్పటి వరకూ కనిపించలేదు. సోషల్‌ మీడియా వేదికగానూ ఆయన ఎలాంటి బ్రాండ్‌కూ మద్దతివ్వలేదు. ఇదే విషయంపై ఓ సందర్భంలో ఆయన మాట్లాడుతూ ‘‘నేను ప్రకటనలు చేయకపోవడానికి కారణం మా నాన్న (ఎన్టీఆర్‌) గారే. ఆయన తన నట ప్రస్థానంలో ఎలాంటి ప్రకటనల్లో కనిపించలేదు. నేనూ అదే బాటలో నడుస్తున్నా. నాపై అభిమానం చూపిస్తున్న వారిని మభ్యపెట్టి సొమ్ముచేసుకోలేను. సినిమాల ద్వారా ప్రేక్షకులను అలరించడం ఓ నటుడిగా నా బాధ్యత. జీవితాంతం అదే చేస్తుంటా’’ అని బాలకృష్ణ వివరించారు.


అల్లు అర్జున్‌

వ్యక్తిగతంగా తాను పొగాకు ఉత్పత్తులను వాడని కారణంగా అల్లు అర్జున్‌ అలాంటి యాడ్‌ను తిరస్కరించాడని ఇటీవల వార్తలొచ్చిన సంగతి తెలిసిందే. సంబంధిత ప్రకటనలో కనిపించేందుకుగానూ ఓ సంస్థ ఆయనకు భారీ మొత్తంలో ఆఫర్‌ ఇచ్చిందని టాక్‌. అలాంటి ప్రకటనలు చేస్తే, అభిమానులు కూడా తనని చూసి పొగాకు ఉత్పత్తులకు అలవాటు పడతారని, అందుకే తాను ఆ ప్రకటన చేయనని సన్నిహితులతో చెప్పినట్టు సమాచారం.


సాయి పల్లవి

ఎలాంటి వాణిజ్య ప్రకటన అయినా సరే సాయి పల్లవి ఆసక్తి చూపదనే విషయం తెలిసిందే. స్వచ్ఛంద సంస్థల కార్యక్రమాలైతే పారితోషికం తీసుకోకుండానే ప్రచారం చేస్తుంటుంది. అలాంటి ఆమెకు ఓ ఫెయిర్‌నెస్‌ క్రీమ్‌ సంస్థ రూ.2 కోట్లు ఇస్తామని, తమ బ్రాండ్‌ను ప్రమోట్‌ చేయాలని అడగ్గా ఒక్క క్షణం ఆలోచించకుండా నో చెప్పేసింది. ‘‘నటిగా నా పనిని నేను సక్రమంగా పూర్తి చేసుకుని ఇంటికెళ్లి మూడు చపాతీలో, కొద్దిగా అన్నమో తింటే చాలు. అంతకు మించి నాకు ఎలాంటి అవసరాలు లేవు. యాడ్స్‌ వల్ల వచ్చే డబ్బుతో నేను చేసేదేముంది? విదేశీయులను మీరెందుకు తెల్లగా ఉంటారని మనం ఎందుకు ప్రశ్నించం? వారి చర్మం రంగు వారిది.. మన రంగు మనది. అలాంటప్పుడు సౌందర్య ఉత్పత్తులు ఎలా మార్చగలవు’’ అని ఓ ఇంటర్వ్యూలో తన అభిప్రాయం వెలిబుచ్చింది.


ఆమిర్‌ఖాన్‌

బాలీవుడ్‌ పర్‌ఫెక్షనిస్ట్‌ ఆమిర్‌ఖాన్ సామాజిక సేవా కార్యక్రమ ప్రచారాల్లోనే చురుకుగా ఉంటాడు. అందుకే ఓసారి ప్రముఖ కార్ల కంపెనీ ఒకటి ఆమిర్‌ను సంప్రదించగా తిరస్కరించాడట. ‘సత్యమేవ జయతే’ అనే కార్యక్రమం ద్వారా ఆయన దేశంలోని వివిధ సమస్యలను తెరపైకి తీసుకొచ్చిన విషయం తెలిసిందే. ఆ షోకి హోస్ట్‌గా మారడంతో అప్పటికే సంతకం చేసిన కొన్ని బ్రాండ్‌ల యాడ్స్‌ను రద్దుచేసుకున్నాడు.


రణ్‌బీర్‌ కపూర్‌

బాలీవుడ్‌ యువ నటుడు రణ్‌బీర్‌ కపూర్‌ తరచూ యాడ్స్‌లో దర్శనమిస్తూనే ఉంటాడు. టీవీ, శీతల పానీయం, బిస్కెట్‌.. తదితర ఉత్పత్తుల ప్రచారంలో నటించిన రణ్‌బీర్‌ ఓ ఫెయిర్‌నెస్‌ క్రీమ్‌ బ్రాండ్‌ను ప్రమోట్‌ చేయనన్నాడని ఇటీవల వార్తలొచ్చాయి. చర్మం రంగు మారుతుందని చూపించే ఆ ప్రకటన జాత్యాహంకారం కిందకి వస్తుందనే కారణంతో వద్దన్నాడట. సంబంధిత సంస్థ, రణ్‌బీర్‌ మధ్య జరిగిన ఈ డీల్‌ ఒప్పందం రూ. 9 కోట్లు.


స్వరా భాస్కర్‌

రణ్‌బీర్‌లానే నటి స్వరా భాస్కర్‌కు సౌందర్య ఉత్పత్తులకు సంబంధించిన యాడ్‌లో నటించే అవకాశం వచ్చింది. వాటికి ప్రచారం చేయడం ద్వారా వర్ణ వివక్ష, జాత్యహంకారాలను ప్రోత్సహించినట్టవుతుందని యాక్ట్‌ చేయలేదు.


అనుష్క శర్మ.. కంగనా

‘సౌందర్యోత్పత్తుల బ్రాండ్‌ ప్రకటనలను నేను చేయను’ అని అనుష్క శర్మ ఓ ప్రెస్‌మీట్‌లో స్పష్టం చేసింది. ‘‘జాత్యాహంకార భావాన్ని కలిగించే ఫెయిర్‌నెస్ క్రీమ్‌లకు సంబంధించిన ఎలాంటి యాడ్స్‌నూ నేను ఇష్టపడను’’ అని తెలిపింది. ఇదే అభిప్రాయంతో తనకు వచ్చిన ఓ అవకాశాన్ని వద్దనుకుంది కంగనా రనౌత్‌. ఫెయిర్‌నెస్‌ క్రీమ్‌కు సంబంధించిన పలు బ్రాండ్‌లు ఆమెకు భారీ మొత్తంలో నగదు ఇస్తామన్నా చేయనని చెప్పేసిందట.


జాన్‌ అబ్రహం

ఫిట్‌నెస్‌కు అధిక ప్రాధాన్యతనిచ్చే జాన్‌ అబ్రహం ధూమపానం, మద్యపానం వల్ల కలిగే నష్టాల్ని తనదైన శైలిలో వివరించేవాడు. ఏ ఒక్కరూ వీటికి బానిసలుగా మారకూడదని ఎన్నో సందర్భాల్లో  గళం విప్పాడు. ఆల్కాహాల్‌, టొబాకో ప్రొడక్ట్‌లకు ప్రచారం చేయాలంటూ పలువురు భారీ మొత్తంలో ఆయనకు ఆఫర్‌ ఇచ్చినా నో అనేశాడు.


ఇమ్రాన్‌ హష్మి

ఇమ్రాన్‌ హష్మికి యువతలో విశేషమైన క్రేజ్‌ ఉంది. ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకునే అతను 2013లో ఓ లిక్కర్‌ బ్రాండ్‌ యాడ్‌లో నటించేందుకు విముఖత చూపాడు. ‘‘నన్ను ఆరాధించే వారిని మద్యపానం చేయమని ఎలా చెప్తా’’ అంటూ రూ. 4 కోట్ల ఒప్పందాన్ని తిరస్కరించాడు.


రణ్‌దీప్‌ హుడా

ఫెయిర్‌నెస్‌ క్రీమ్‌ల గురించి రణ్‌దీప్‌ హుడా ఓసారి మీడియా వేదికగా ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ‘‘మగవారు.. పొడవు, డార్క్‌, హ్యాండ్‌సమ్‌గా ఉండాలనుకుంటారు.. కానీ పొడవు, ఫెయిర్‌, హ్యాండ్‌సమ్‌గా కాదు’’ అని బల్ల గుద్దినట్టు చెప్పాడు.


సన్నీ లియోనీ.. తాప్సీ

ఎంత డబ్బిచ్చినా సరే పొగాకు ఉత్పత్తి కంపెనీలకు ప్రచార కర్తగా ఉండనని ఓ సందర్భంలో సన్నీ లియోనీ వెల్లడించింది. ఓ ఏడాది.. ఫెయిర్‌నెస్‌ క్రీమ్‌ ఉత్పత్తులు, వాటి ప్రచారాన్ని నిలిపివేయాలనే భారత ప్రభుత్వ ప్రతిపాదనలకు తాప్సీ తన మద్దతు ప్రకటించింది.


అక్షయ్‌ కుమార్‌

ఇటీవల.. అక్షయ్‌ కుమార్‌ ఓ పొగాకు బ్రాండ్‌ వాణిజ్య ప్రకటన నుంచి తప్పుకొంటున్నట్టు ప్రకటించిన సంగతి తెలిసిందే. అజయ్‌దేవ్‌గణ్‌, షారుఖ్‌ఖాన్‌తో కలిసి ఆయన నటించిన ఆ యాడ్‌ కోసం లభించిన మొత్తాన్ని సమాజానికి ఉపయోగపడే పనికి ఖర్చుచేయనున్నట్టు వెల్లడించాడు. ‘‘కాంట్రాక్ట్‌ ఉన్న కారణంగా న్యాయపరమైన ప్రక్రియ పూర్తయ్యే వరకూ ఈ యాడ్‌ ప్రసారం అవుతూనే ఉంటుంది. ఇక భవిష్యత్తులో ప్రతి విషయంపై ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటానని మీకు మాటిస్తున్నా’’ అని అక్షయ్‌ వివరించాడు.


సచిన్‌ తెందూల్కర్‌

క్రికెట్‌ దిగ్గజం సచిన్‌ తెందూల్కర్‌ యాడ్స్‌పైనే ఏడాదికి సుమారు రూ. 20 కోట్లు సంపాదించగలడు. కానీ, అవి సమాజంపై చెడు ప్రభావాన్ని చూపుతాయనుకుంటే ప్రచారకర్తగా ఆయా ప్రకటనలకు సంతకం చేయడు. ఓ లిక్కర్‌ బ్రాండ్‌ను ప్రమోట్‌ చేయాలంటూ కొందరు ఈ మాస్టర్‌ బ్లాస్టర్‌ను సంప్రదించగా వెంటనే తిరస్కరించాడు.


విరాట్‌ కోహ్లీ

వ్యక్తిగతంగా తాను కూల్‌ డ్రింక్స్‌ తాగకపోవడంతో ఓ శీతల పానీయ బ్రాండ్‌లో కనిపించేందుకు ఒప్పుకోలేదు టీమిండియా మాజీ సారథి విరాట్‌ కోహ్లీ. డబ్బు కోసం తాను చేయని పనిని ఇతరులతో చేయించడం భావ్యంకాదనుకుని కొన్ని కోట్ల డీల్‌ను తిరస్కరించాడు.


పుల్లెల గోపీచంద్‌

జాతీయ బ్యాడ్మింటన్‌ చీఫ్‌ కోచ్‌ పుల్లెల గోపీచంద్‌ ఓ శీతల పానీయ బ్రాండ్‌లో కనిపించేందుకు నో చెప్పాడు.

Read latest Movies News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని

సుఖీభవ

మరిన్ని