Chiranjeevi To Prabhas: తగ్గేదేలే.. స్టార్‌ హీరోలు.. ట్రిపుల్‌, డబుల్‌ ధమాకాలు

చిత్రపరిశ్రమలో కరోనా ఎన్నో మార్పులు తీసుకువచ్చింది. అప్పటివరకూ ఏడాదికి ఒక ప్రాజెక్ట్‌ని ప్రకటిస్తూ ఒకదాని తర్వాత ఒకటి పట్టాలెక్కించిన స్టార్‌హీరోలు ఇప్పుడు రూటు మార్చారు. వరుస సినిమాలు ఓకే చేస్తూ....

Published : 21 Jun 2022 09:49 IST

Telugu Heros: చిత్రపరిశ్రమలో కరోనా ఎన్నో మార్పులు తీసుకు వచ్చింది. అగ్ర కథానాయకుడి సినిమా చూడాలంటే కనీసం ఏడాది వేచి చూడాల్సిందే. ఆ పరిస్థితులను దాటుకుని ఇప్పుడు వరుస సినిమాలు ప్రకటిస్తూ స్పీడ్‌ పెంచారు మన హీరోలు. ఒకటి నిర్మాణంలో ఉండగానే మరొక దాన్నీ షూటింగ్స్‌లోకి తీసుకువెళ్తున్నారు. ఇంతకీ ఆ స్టార్‌హీరోలు.. వారి క్రేజీ ప్రాజెక్ట్స్‌పై ఓ లుక్కేద్దాం..!

పెద్దన్న @ 3..!

తెలుగు చిత్రపరిశ్రమకు పెద్దన్నగా చెప్పుకునే అగ్ర కథానాయకుడు చిరంజీవి (Chiranjeevi).. ఆరు పదుల వయసులోనూ తన నటనతో అదరగొడుతున్నారు. వరుస సినిమాలు చేస్తూ యువ హీరోలకు గట్టి పోటీనిస్తున్నారు. ఓ వైపు మోహన్‌రాజాతో ‘గాడ్‌ఫాదర్‌’ (GOD FATHER) చేస్తున్న ఆయన.. మరోవైపు మెహర్‌ రమేశ్‌తో ‘భోళాశంకర్‌’ (Bhola Shankar), బాబీ దర్శకత్వంలో ‘వాల్తేరు వీరయ్య’గా (Waltair Veerayya)లలో నటిస్తూ త్రిశూల వ్యూహం అమలు చేస్తున్నారు. ‘గాడ్‌ఫాదర్‌’ (మలయాళ రీమేక్‌ లూసిఫర్‌), బాబీ ‘వాల్తేరు వీరయ్య’లు పూర్తి మాస్‌ యాక్షన్‌ చిత్రాలు కాగా, భోళాశంకర్‌(వేదాళం రీమేక్‌)తో అన్నాచెల్లెళ్ల అనుబంధాన్ని తనదైన స్టైల్‌లో చూపించేందుకు సిద్ధమవుతున్నారు.


అన్నయ్య దారిలోనే తమ్ముడు..!

తమ్ముడు పవన్‌కల్యాణ్‌ కూడా వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు. ఆయన చేతిలో ప్రస్తుతం మూడు ప్రాజెక్ట్‌లున్నాయి. వాటిల్లో ఒకటి క్రిష్‌తో చేస్తున్న ‘హరిహర వీరమల్లు’ (Harihara Veeramallu). చారిత్రక నేపథ్యంలో తెరకెక్కుతోన్న ఈ సినిమాలో పవన్‌ గజదొంగగా కనిపించనున్నారు. ఈ సినిమా చిత్రీకరణ పూర్తయిన వెంటనే తమిళంలో మంచి విజయాన్ని అందుకున్న ‘వినోదయ సిత్తం’ (Vinodhaya Sitham) రీమేక్‌లో భాగం కానున్నారు. సముద్రఖని ఈ సినిమాను తెరకెక్కించనున్నారు. మరోవైపు హరీశ్‌ శంకర్‌తో ‘భవదీయుడు భగత్‌సింగ్‌’ (Bhavadeeyudu Bhagath Singh) పట్టాలెక్కించనున్నారు.


పాన్‌ ఇండియా స్టార్‌ అకౌంట్‌లో మరికొన్ని..!

‘బాహుబలి’, ‘బాహుబలి-2’ చిత్రాల తర్వాత ప్రభాస్‌ క్రేజ్‌ ఎంతగా పెరిగిందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు.  అభిమానుల్ని అలరించేందుకు ఆయన కూడా వరుస ప్రాజెక్ట్‌లు చేస్తున్నారు. ప్రస్తుతం ఆయన చేతిలో మూడు భారీ ప్రాజెక్ట్‌లున్నాయి. అందులో ఒకటి బాలీవుడ్‌ దర్శకుడు ఓంరౌత్‌ తెరకెక్కిస్తున్న ‘ఆదిపురుష్‌’ (Adipurush). ఇప్పటికే చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ సినిమా వచ్చే ఏడాదిలో విడుదల కానుంది. ఇక, ప్రశాంత్‌నీల్‌తో చేస్తున్న ‘సలార్‌’ (SALAAR) చిత్రీకరణ శరవేగంగా జరుగుతుంది. ఈ పవర్‌ఫుల్‌ యాక్షన్‌ డ్రామా పట్టాలపై ఉండగానే ఆయన ‘ప్రాజెక్ట్‌ కె’ (Project K) షూట్‌ ప్రారంభించేశారు. నాగ్‌ అశ్విన్‌ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా కీలక షెడ్యూల్‌ ఇటీవల హైదరాబాద్‌లో జరిగింది. ఈ ప్రాజెక్ట్‌లన్నీ పూర్తయ్యాక సందీప్‌ రెడ్డి వంగాతో ప్రభాస్‌ ‘స్పిరిట్‌’ (Spirit) చేయనున్నారు.


మాస్‌ మహారాజ్‌ ఖాతాలో ఎన్నంటే..!

‘క్రాక్’తో తిరిగి ఫామ్‌లోకి వచ్చారు రవితేజ. ఆ సినిమా ఇచ్చిన కిక్‌తో ఆయన ఇప్పుడు కెరీర్‌లో దూసుకెళ్తున్నారు. ప్రస్తుతం ఆయన చేతిలో ‘టైగర్‌ నాగేశ్వరరావు’ (Tiger Nageswara Rao), ‘ధమాకా’ (Dhamaka), ‘రామారావు ఆన్‌ డ్యూటీ’ (Ramarao On Duty), ‘రావణాసుర’ (Ravanasura) సినిమాలున్నాయి. వీటి షూటింగ్స్‌లోనూ ఆయన పాల్గొంటున్నారు. ఇక, ఇటీవల ‘టైగర్‌ నాగేశ్వరరావు’ సెట్‌లో రవితేజకు స్వల్ప గాయాలయ్యాయి. దీంతో ఆయన షూట్స్‌ నుంచి కాస్త విరామం తీసుకున్నారు.


వాళ్లు ఓకే మరి వీళ్ల సంగతేంటి..?

* మహేశ్‌బాబు (MaheshBabu) చేతిలో ఇప్పుడు రెండు సినిమాలున్నాయి. అందులో ఒకటి త్రివిక్రమ్‌ శ్రీనివాస్‌ డైరెక్షన్‌లో రానుంది. ఈ ఏడాది మొత్తం మహేశ్‌ ఆ ప్రాజెక్ట్‌కే కాల్షీట్లు ఇచ్చారు. ఇది పూర్తయ్యాక ఆయన రాజమౌళి సెట్‌లోకి అడుగుపెట్టనున్నారు.

* రామ్‌చరణ్‌ (RamCharan) ప్రస్తుతం శంకర్‌తో ప్రాజెక్ట్‌ చేస్తున్నారు. RC15గా ప్రచారంలో ఉన్న ఈ సినిమా పూర్తయ్యాక చెర్రీ.. గౌతమ్‌ తిన్ననూరితో చేతులు కలపనున్నారు. స్పోర్ట్స్‌ డ్రామాగా ఇది సిద్ధం కానున్నందని టాక్‌.

* విజయ్‌ దేవరకొండ (Vijay Devarakonda).. పూరీ జగన్నాథ్‌తో ‘జనగణమన’ అనౌన్స్‌ చేసిన ఆయన అది పట్టాలెక్కక ముందే శివ నిర్వాణతో బ్యూటీఫుల్‌ లవ్‌ స్టోరీ షురూ చేశారు. ‘ఖుషి’ పేరుతో రానున్న ఈసినిమాలో సమంత కథానాయిక. ఈ సినిమా ఫస్ట్‌ షెడ్యూల్‌ ఇటీవల పూర్తైంది.

* ప్రస్తుతం తారక్‌ (NTR) చేతిలో రెండు ప్రాజెక్ట్‌లున్నాయి. కొరటాల శివతో చేయనున్న సినిమా పూర్తైన వెంటనే ఆయన ప్రశాంత్‌నీల్‌తో హైఓల్టేజ్‌ యాక్షన్‌ ఎంటర్‌ టైనర్‌ షురూ చేయనున్నారు.

* ఐకాన్‌ స్టార్‌ అల్లుఅర్జున్‌ (AlluArjun) ఫోకస్‌ మొత్తం ‘పుష్ప-2’ పైనే ఉంది. ‘పుష్ప’ విజయంతో అందరి దృష్టి ఇప్పుడు ఈ సీక్వెల్‌పైనే పడింది. దీన్ని బన్నీ.. తన తదుపరి ప్రాజెక్ట్‌లన్నింటినీ పక్కన పెట్టి ఇప్పుడు దీని కోసమే సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. ఇది పూర్తయ్యాక కొరటాల శివ, ప్రశాంత్‌నీల్‌, వేణు శ్రీరామ్‌లతో ఆయన సినిమాలు చేసే అవకాశం ఉన్నట్లు సమాచారం.

ఇక, నాని (NANI) ప్రస్తుతం ‘దసరా’ చేస్తున్నారు. బాలయ్య సైతం ప్రస్తుతం గోపీచంద్‌ మలినేనితో ఓ సినిమా చేస్తున్నారు. అది పూర్తయ్యాక ఆయన అనిల్‌ రావిపూడితో ఓ పవర్‌ఫుల్‌ యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌ చేయనున్నారు.Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు