CCL: తుది సమరంలో ‘సీసీఎల్‌’.. విశాఖపట్నంలో తారల సందడి

విశాఖపట్నం వేదికగా ‘సెలబ్రిటీ క్రికెట్‌ లీగ్’ ఆసక్తి సాగుతోంది. శనివారం ఫైనల్‌ మ్యాచ్‌ జరగనుంది.

Published : 24 Mar 2023 20:46 IST

విశాఖపట్నం: ఇటు సినీ ప్రియుల్ని, అటు క్రీడాభిమానుల్ని అలరించే ‘సెలబ్రిటీ క్రికెట్‌ లీగ్‌’ (celebrity cricket league) తుది అంకానికి చేరుకుంది. విశాఖపట్నంలోని వై. ఎస్‌. రాజశేఖర్‌రెడ్డి స్టేడియంలో శుక్రవారం సెమీఫైనల్స్‌ జరగ్గా, శనివారం ఫైనల్‌ మ్యాచ్ జరగనుంది. ‘సెమీ ఫైనల్‌ 1’లోకి అడుగుపెట్టిన ముంబయి హీరోస్‌ జట్టుతో తలపడిన భోజ్‌పురి దబాంగ్స్‌ (bhojpuri dabanggs) జట్టు విజయం సాధించింది. ‘సెమీ ఫైనల్‌ 2’లో భాగంగా తెలుగు వారియర్స్‌ (telugu warriors), కర్ణాటక బుల్డోజర్స్‌ (karnataka bulldozers) జట్ల మధ్య మ్యాచ్‌ ఇంకా కొనసాగుతోంది. సెమీ ఫైనల్‌ 1లో గెలిచిన జట్టు.. సెమీ ఫైనల్‌ 2లో విజయం సాధించిన జట్టుతో శనివారం పోటీ పడనుంది. ఆయా చిత్ర పరిశ్రమలకు చెందిన పలువురు కథానాయికలు విచ్చేసి, క్రీడాకారుల్లో జోష్‌ నింపారు.

ఈ సందర్భంగా సీసీఎల్‌ స్థాపకుడు, మేనేజింగ్ డైరెక్టర్ విష్ణు వర్ధన్ ఇందూరి మాట్లాడుతూ.. “సెలబ్రిటీ క్రికెట్ లీగ్ -2023కి వచ్చిన స్పందన పట్ల చాలా సంతోషంగా ఉన్నా. ఈ సీజన్‌లో ప్రతి జట్టుకు 10 ఓవర్ల చొప్పున 2 ఇన్నింగ్స్‌తో కూడిన T20 ఫార్మాట్‌ నిర్వహించాం. దాంతో వారు మరింత వినోదాన్ని అందించారు. ఫైనల్స్‌లో అంతకు మించిన ఫన్‌ ఉంటుంది’’ అని అన్నారు. కొవిడ్‌ కారణంగా మూడేళ్లు వాయిదా పడిన సీసీఎల్‌.. రీలోడెడ్‌ పేరుతో ఈ ఏడాది సందడి చేస్తోంది. తెలుగు వారియర్స్‌, ముంబయి హీరోస్‌, చెన్నై రైనోస్‌, కర్ణాటక బుల్డోజర్స్‌, కేరళ స్ట్రైకర్స్‌, బెంగాల్‌ టైగర్స్‌, భోజ్‌పురి దబాంగ్స్‌, పంజాబ్‌ దే షేర్స్‌.. ఇలా ఎనిమిది టీమ్‌లతో సెలబ్రిటీ లీగ్‌ ఫిబ్రవరి 18న ప్రారంభమైంది. తెలుగు వారియర్స్‌ టీమ్‌కు అఖిల్‌ అక్కినేని కెప్టెన్‌గా వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే. మరి, ఈసారి విజేత ఎవరో తెలియాలంటే కొన్ని గంటలు వేచి చూడాల్సిందే.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని