Chalapathi Rao: ‘‘ఎప్పటికప్పుడు కష్టం వచ్చేది కానీ.. కన్నీళ్లు రాలేదు’’

సుమారు 1500 చిత్రాల్లో నటించి సినీ ప్రియులను అలరించిన ప్రముఖ నటుడు చలపతిరావు గుండెపోటుతో తుదిశ్వాస విడిచారు. ఈనేపథ్యంలో ఆయనకు సంబంధించిన పలు ఆసక్తికర విశేషాలు.

Updated : 25 Dec 2022 10:27 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: దాదాపు 1500 చిత్రాల్లో నటించి తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్న సీనియర్‌ నటుడు చలపతిరావు (Chalapathi Rao). మధ్య తరగతి కుటుంబంలో పుట్టిన ఆయన నటనపై ఉన్న ఆసక్తితో ఎన్నో నాటకాలు వేసి.. ఎన్టీఆర్‌ చొరవతో సినీ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టారు. ‘కథానాయకుడు’తో మొదలైన ఆయన నట ప్రస్థానం.. ఎన్టీఆర్‌, ఏయన్నార్‌, కృష్ణ, చిరంజీవి, వెంకటేశ్‌, నాగార్జున వంటి స్టార్‌హీరోల సినిమాలతో సుదీర్ఘంగా కొనసాగింది. తన కెరీర్‌కు సంబంధించిన ఎన్నో విషయాలను గతంలో ‘ఆలీతో సరదాగా’ కార్యక్రమంలో ఆయన పంచుకున్నారు. శనివారం రాత్రి ఆయన హఠాన్మరణంతో చిత్రపరిశ్రమలో విషాదం నెలకొంది. ఈ నేపథ్యంలో ఆయన గతంలో పంచుకున్న విశేషాలు ఓ సారి చూద్దాం.

ఎన్టీఆర్‌తో పరిచయం.. సినీ ప్రయాణం ఇలా మొదలైంది..!

‘‘నటనపై ఉన్న ఆసక్తితో చదువుకునే రోజుల్లోనే ఎన్నో నాటకాలు వేసేవాడిని. నటుడి కావాలనే ఉద్దేశంతో మద్రాసు వెళ్లాను. ఏ స్టూడియోకు వెళ్లినా లోపలికి రానిచ్చేవాళ్లు కాదు. దాంతో ఎన్టీఆర్‌గారిని కలవాలని అనుకున్నా. అంత పెద్ద నటుడి దగ్గరకు నన్ను వెళ్లనిస్తారా? అప్పట్లో వజిల్లా రోడ్డులో నాలుగైదు బస్సులు వచ్చి ఆగేవి. అందరూ గుళ్లు కొట్టించుకున్న వాళ్లే. వెళ్లి ఎన్టీఆర్‌ను కలిసి హారతులు ఇచ్చి.. కొబ్బరికాయలు కొట్టి దండలు వేసేవాళ్లు. అప్పుడు ఆయన అందరినీ పలకరించేవారు. తిరుపతి సహా ఎన్ని పుణ్యక్షేత్రాలు తిరిగి వచ్చినా రాని ఆనందం ఎన్టీఆర్‌ పలకరించగానే పులకించిపోయేవాళ్లు. ఇంతకన్నా మంచిదారి లేదని వాళ్లతోపాటు నేనూ వెళ్లా. ఎన్టీఆర్‌ను చూడటానికి వచ్చిన వాళ్లందరినీ పంపించేశారు. నేను ఉండిపోయా. ‘నీ సంగతి ఏంటి’ అని ఎన్టీఆర్‌ అడిగారు. ‘నేను పీయూసీ వరకూ చదువుకున్నా. సినిమాల్లో వేషం కోసమని చదువు మానేసి వచ్చాను’ అని చెప్పా. ‘పిచ్చివాడా.. వెళ్లి చదువుకుని ఉద్యోగం చేసుకో. ఇక్కడ వేషాలు రావడం కష్టం’ అని అన్నారు. ‘లేదన్నయ్యా.. నేను ఫ్యామిలీతో సహా వచ్చేశాను. మళ్లీ వెళ్లడం కుదరదు’ అని చెబితే.. ‘మొండివాడిలా ఉన్నావే. వారం రోజుల తర్వాత కనపడు’ అన్నారు. అలాగే వారం తర్వాత వెళ్లా. ‘ఏంటి నువ్వు ఇంకా ఊరికి వెళ్లలేదా?’ అని అడిగారు. ‘నేను వెళ్లను’ అని చెప్పా. అప్పుడే హేమాంభరధరరావు దర్శకత్వంలో ‘కథానాయకుడు’ తీస్తున్నారు. ఆయన్ను పిలిచి ‘వీడు ఎవడో మొండివాడిలా ఉన్నాడు. వీడికో వేషం ఇవ్వండి’ అన్నారు.

హేమాంబరధరరావుగారు తన ఆఫీస్‌కు రమ్మన్నారు. మరుసటి రోజు అక్కడి వెళ్తే రెండు రోజుల తర్వాత షూటింగ్‌కు రావాలని చెప్పారు. కొద్దిసేపు నాకు ఏమీ అర్థం కాలేదు. కారు వచ్చి నన్ను తీసుకెళ్లింది. 14మంది ఆర్టిస్టుల కాంబినేషన్‌ అది. అదే నా తొలి చిత్రం. నేను అప్పటికే స్టేజ్‌ ఆర్టిస్ట్‌ను కావడంతో నాకు భయం వేయలేదు. తొలిరోజు షూటింగ్‌ అయిన తర్వాత ‘మనవాడు బాగానే చెప్పాడు’ అని అన్నారు. ఆయనకు నమస్కారం పెట్టి, బయటకు వచ్చేశా. ఆ చిత్రానికి గోపాలకృష్ణగారు నిర్మాత. ‘మనవాడు బాగా చేస్తున్నాడు. నాలుగైదు క్లోజప్‌ షాట్‌లు తీసి పెట్టు.. పనికొస్తాడు’ అని కెమెరామెన్‌ వీఎస్‌ఆర్‌ స్వామికి చెప్పారు. ఎందుకంటే నన్ను హీరోగా పెట్టి ఓ సినిమా తీయాలని అనుకున్నారట. ఈలోగా ఆర్థిక ఇబ్బందులు రావడంతో ‘కథానాయకుడు’ ఆగిపోయింది. మళ్లీ ఆర్నెల్ల తర్వాత సినిమా మొదలు పెట్టి, పూర్తి చేశారు. బాగా ఆడింది. డబ్బులు వచ్చాయి. ఆ తర్వాత గోపాలకృష్ణగారు సినిమాలు తీయనని చెప్పి వెళ్లిపోయారు. ‘చేతి దాకా వచ్చిన అవకాశం పోయింది’ అని బాధపడ్డా. ఎప్పటికప్పుడు కష్టం వచ్చేది. దాని వెనకాలో కర్తవ్యం ఉండేది. దాంతో ఏడుపు వచ్చేది కాదు. హీరోగా ప్రయత్నిద్దామంటే అప్పటికే చాలా మంది ఉన్నారు. పోనీలే విలన్‌గా చేద్దామంటే.. సత్యనారాయణ, త్యాగరాజు, ప్రభాకర్‌రెడ్డి ఇలా అనేకమంది ఉన్నారు. ఏం చేయాలో నాకు తెలియలేదు. దాంతో క్యారెక్టర్‌ ఆర్టిస్ట్‌గా ఉండిపోదామని అనుకున్నా. ఇదే విషయం రామారావుగారికి కూడా చెప్పా. అప్పటి నుంచి చిన్నదైనా, పెద్దదైనా ఏ వేషమైనా వేయడానికి సిద్ధపడ్డా’’

ఎన్టీఆర్‌తో అనుబంధం..!

‘‘ఎన్టీఆర్‌తో నా ప్రయాణం చాలా బాగుండేది. ఆయనకు చదువుకున్న వాళ్లు ఎవరైనా కనపడితే, ‘గురువుగారు’ అని పిలిచేవారు. అంత మర్యాదగా మాట్లాడేవారు. సాధారణంగా ఏదైనా సినిమాలో ఒకసారి తండ్రిగా వేషం వేస్తే ‘మొన్ననే కదండీ వేశారు.. వద్దు’ అని అంటారు. కానీ, ‘దాన వీర శూర కర్ణ’లో ఆయన మూడు పాత్రలు చేస్తే.. నేను అయిదు పాత్రలు చేశా. నటుడు, దర్శకుడిలో దమ్ముంటే ఎన్ని పాత్రలు అయినా చేయొచ్చని ఆయన చెప్పేవారు. అంత గొప్ప దర్శకుడాయన. ముందు సూతుడి పాత్ర చేశా. దానికి మూడు గెటప్‌లు. ఆ తర్వాత ఇంద్రుడి పాత్ర కూడా నేనే చేశా. ఒకరోజు సడెన్‌గా ఎన్టీఆర్‌ కబురు చేశారు. ‘ఏంటి అన్నయ్యా.. పిలిచారట’ అని అంటే, ‘ఆ 14వ ర్యాక్‌లో గడ్డం ఉంటుంది. 12 ర్యాక్‌లో విగ్గు ఉంటుంది. 22వ ర్యాక్‌లో మీసాలు ఉంటాయి. పెట్టుకుని వచ్చేయ్‌’ అన్నారు. నేను ఆశ్చర్యంతో అలాగే నిలబడి చూస్తూ ఉండిపోయా. ‘ఏంటీ.. ఏమైంది?’ అన్నారు. ‘నేను ఇప్పటికే మూడు వేషాలు.. నాలుగు గెటప్‌లు వేశా. ఇప్పుడు ఇది కూడా వేస్తే జనం నవ్వుతారు’ అని అన్నా. ఒక్కసారిగా పెద్దగా నవ్వారు. ‘ఒరేయ్‌ పిచ్చివాడా.. ఇప్పటికీ పల్లెటూళ్లలో ఎన్టీఆర్‌ ఎవరో తెలియదు.. నిన్ను ఎవడు పట్టించుకుంటాడు.. వెళ్లు’ అని అన్నారు. వెళ్లి గెటప్‌ వేసుకుని వస్తే.. బొట్టు పెడుతూ ‘నువ్వు జరాసంధుడివి. వెళ్లి ఆ పాత్ర డైలాగ్‌లు చదువుకో’ అన్నారు. ఆయనకు ప్రతి విషయమూ గుర్తే. చెన్నైలో నేను ఇల్లు కట్టుకున్నప్పుడు దాని గృహప్రవేశానికి ముహూర్తం పెట్టింది ఆయనే. గృహ ప్రవేశం నాడు ఉదయం పూట ఇంటికి కూడా వచ్చారు. ఆయనకు ఇష్టమని గోధుమరవ్వ ఉప్మా, మీగడ పెరుగు చేసి పెడితే తిని వెళ్లారు’’

ప్రేమ కథ..!

‘‘పీయూసీ చదువుకునేందుకు కొన్నాళ్లు బందరులో ఉన్నాను. అక్కడ నా లవ్‌స్టోరీ మొదలైంది. తను నా క్లాస్‌మేట్‌. చాలా మంచి అమ్మాయి. నాలో ఏం చూసిందో తెలియదు కానీ, ఒక రోజు నా దగ్గరకు వచ్చి, ‘పెళ్లి చేసుకుంటావా’ అని అడిగింది. అప్పటికి నాకు 19ఏళ్లు. ‘నీకు ఇష్టమా’ అని అడిగా. ‘సరే’నంది. వెళ్లి పెళ్లి చేసుకున్నాం. ఇంట్లో తెలియదు. ఎందుకంటే నాకు అన్నయ్య ఉన్నాడు. సాధారణంగా పల్లెటూళ్లలో పెద్దవాళ్లకు చేయకుండా చిన్నవాళ్లకు ముందు పెళ్లి చేయరు. అలాంటిది నాకు పెళ్లయిందని తెలిసి మా అన్నయ్య ఏడవటం మొదలు పెట్టాడు. ‘తమ్ముడికి పెళ్లయింది. నాకు ఇక పిల్లను ఎవరు ఇస్తారు’ అని అంటుండేవాడు. దాంతో నేనే వాడికి సంబంధం చూసి పెళ్లి చేశా. ఆ తర్వాత మేము బెజవాడలో కాపురం పెట్టాం. అప్పటికి నేను ఇంకా చదువుతూనే ఉన్నా. అయితే నాటకాలు వేసేవాడిని. ‘తస్మాత్‌ జాగ్రత్త’ అనే నాటకం వేస్తుంటే హీరోయిన్‌గా చేయడానికి ఎవరూ ముందుకు రాలేదు. దాంతో మా ఆవిడినే హీరోయిన్‌గా చేయించా. ఏకంగా ఉత్తమనటిగా అవార్డు దక్కించుకుంది. ఆ తర్వాత ఇద్దరం కలిసి మద్రాసు వెళ్లిపోయాం. ఈవీవీ సత్యనారాయణతో నాకు మంచి అనుబంధం ఉంది. నా జీవితంలో జరిగిన సంఘటనలను రెండు, మూడు సినిమాలు తీశారు. ఆయన తెరకెక్కించిన ‘మానాన్నకు పెళ్లి’ నా కథే’’

మళ్లీ పెళ్లి చేసుకోమన్నారు..!

‘‘నా భార్య అనారోగ్యంతో చనిపోయింది. అప్పటికి రవికి ఏడేళ్లు. పెద్దపాపకు నాలుగు, చిన్న పాపకు మూడేళ్లు. ఆ వయసులో ఏం చేయాలో నాకు అర్థం కాలేదు. ‘మళ్లీ పెళ్లి చేసుకోవాలా? చేసుకుంటే ఏమవుతుంది. వచ్చే ఆవిడ చూస్తుందో?లేదో?’ ఇవే ఆలోచనలు. మళ్లీ పెళ్లి చేసుకోమని ఎన్టీఆర్‌-తారకమ్మ కూడా చెప్పారు. ‘ఇప్పుడు బాగానే ఉంటుంది. పెద్ద వయసులో నీకు అండగా ఎవరూ ఉండరు’ అని అన్నారు. అప్పుడు బాగా ఆలోచించి ఒకటే నిర్ణయం తీసుకున్నా. ‘ఉంటే పిల్లలు నాతో ఉంటారు. లేకపోతే నాతో చచ్చిపోతారు. అయితే వీళ్లను బాగా చదివించాలి’ అనుకున్నా. చదువు విషయంలో నేనెప్పుడూ మా పిల్లలను ఒత్తిడి చేయలేదు. ముగ్గురూ చదువుకున్నారు. గోల్డ్‌ మెడల్స్‌ కూడా వచ్చాయి. చిన్నప్పటి నుంచి వాళ్లకు ధైర్యం చెప్పేవాడిని. అమరచిత్ర కథలు చదివించేవాడిని. ఆడపిల్లలు ఇద్దరూ అమెరికాలో ఉంటున్నారు. అలాగే రవికి పెళ్లి చేసి పంపించేశా. స్వతంత్రంగా ఎలా బతకాలో వాళ్లకు తెలిసొచ్చింది’’ 

ఆ ప్రమాదాన్ని మర్చిపోలేను..!

‘‘భీమనేని శ్రీనివాసరావు దర్శకత్వంలో సినిమా చేస్తున్నప్పుడు చిన్న ప్రమాదం జరిగింది. షూట్‌లో భాగంగా కేరళ బస్సులో సీన్స్‌ చిత్రీకరిస్తున్నప్పుడు.. సామాన్లు అన్నీ పైన బస్సు టాప్‌పై పెట్టారు. వాటి మధ్యలో నేను, సునీల్‌, హీరోయిన్‌ కూర్చోవాలి. పైకి ఎక్కి కూర్చున్నా కానీ మనసులో మాత్రం ఏదో తెలియని వెలితి. మధ్యలో వెళ్లిపోదాం అనుకున్నా. సర్లే ఒప్పుకొన్నాం కదా అని ఉండిపోయా. షాట్‌ అయిపోయిన తర్వాత బస్సు పైనుంచి దిగుతుంటే జారి పడిపోయా. అంతవరకే తెలుసు. మూడు రోజుల తర్వాత అపోలో ఆస్పత్రిలో ఉన్నానని చెప్పారు. పక్కటెముకలు విరిగాయి. వెన్నెముకకు దెబ్బ తగిలింది. కాలు విరిగింది. అంతా మంచంలోనే. దాదాపు ఆరు నెలలు బెడ్‌ పైనే ఉన్నా. ‘ఎందుకీ బతుకు చచ్చిపోదామా’ అనిపించింది. ఒక కన్ను కూడా కనిపించడం మానేసింది. బస్సు పైనుంచి పడటంతో కంటిలో నుంచి రక్తం కారిందని చెప్పారు. డాక్టర్‌ మల్లికా బేగం అని ఆవిడ నా కన్ను చూసి, తప్పకుండా చూపు వస్తుందని చెప్పారు. మూడు ఆపరేషన్లు చేశారు. పెద్ద వయసు కదా! కాలు సెట్‌ కావడానికి ఎనిమిది నెలలు పట్టింది. ఇప్పటికీ నొప్పిగా ఉంది. ప్రమాదం గురించి తెలియగానే నా కూతుళ్లు పరిగెత్తుకుంటూ వచ్చేశారు.

ఆ ప్రమాదం తర్వాత కూడా ‘వినయ విధేయ రామా’ చేశా. బోయపాటి ఎంతో మంచి వ్యక్తి. కష్టాల్లో ఉంటే వచ్చి పలకరిస్తాడు. ‘బాబాయ్‌ ఎన్నాళ్లు ఆస్పత్రిలో ఉంటాడు. ఎలా తీసుకొస్తారో నాకు తెలియదు. షూటింగ్‌కు తీసుకురండి. బాధలు మర్చిపోతాడు’ అని చెప్పాడట. చిత్ర యూనిట్‌ నా దగ్గరకు వచ్చి, ‘షూటింగ్‌కు బ్యాంకాక్‌కు రావాలి’ అని చెప్పారు. ‘ఇలాంటి పరిస్థితుల్లో నేను ఎలా రాగలను’ అని అడిగితే ‘దర్శకుడు మిమ్మల్ని తీసుకురమన్నారు’ అని అన్నారు. ‘అయితే పదండి’ అని వీల్‌ఛైర్‌లో ఎయిర్‌పోర్ట్‌కు వెళ్లా. నా కోసమని విమానం ఎత్తులో ఉండే వెహికల్‌లో లిఫ్ట్‌ చేసి అక్కడి పైలెట్‌ దగ్గరకు ఆ తర్వాత  బిజినెస్‌ క్లాస్‌లో పడుకోబెట్టారు. బ్యాంకాక్‌లో కూడా ఎయిర్‌లిఫ్ట్‌ ఉండటంతో మాకు కలిసొచ్చింది. రామ్‌చరణ్‌, మిగిలిన వాళ్లను నిలబెట్టి, నన్ను కూర్చోబెట్టి షూటింగ్‌ పూర్తి చేశారు. ఆ ప్రమాదం నుంచి నేను కోలువడానికి సంవత్సరం పట్టేది కానీ, బోయపాటి వల్ల ఆర్నెల్లలో కోలుకున్నా’’ అని చలపతిరావు గతంలో ఇచ్చిన ఇంటర్వ్యూలో పేర్కొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు