chandrababu: అందుకే రాజకీయాల్లోకి వచ్చా.. రాజశేఖర్‌రెడ్డి మంచి మిత్రుడు: చంద్రబాబు

తెదేపా అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ‘అన్‌స్టాపబుల్‌ 2’ అనే చిట్‌ చాట్‌ షోలో సందడి చేశారు. కార్యక్రమ వ్యాఖ్యాత, తన బావమరిది నందమూరి బాలకృష్ణ అడిగిన ప్రశ్నలకు సమాధానమిచ్చారు.

Updated : 15 Oct 2022 13:02 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: మాజీ ముఖ్యమంత్రి దివంగత రాజశేఖర్‌రెడ్డి (YS Rajasekhara Reddy) తనకు మంచి స్నేహితుడని తెదేపా అధినేత చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అన్నారు. నందమూరి బాలకృష్ణ (Nandamuri Balakrishna) వ్యాఖ్యాతగా వ్యహరిస్తోన్న ‘అన్‌స్టాపబుల్‌ 2’ (Unstoppable 2) కార్యక్రమ వేదికపై ఆయన మనసులో మాట ప్రేక్షకులతో పంచుకున్నారు. రాజకీయ రంగ ప్రవేశం, హెల్త్‌ యూనివర్సిటీ పేరు మార్పు తదితర విషయాలపై స్పందించారు.

అలా చేయటం దారుణం..

‘‘తెలుగు దేశం పార్టీ వారుకాకపోయినా కొన్ని పార్క్‌లకు కృష్ణకాంత్‌ తదితర రాజకీయ నాయకుల పేర్లు పెట్టాం. వారిని గౌరవించాలనే ఉద్దేశంతోనే అలా చేశాం. ఓ నాయకుడికి ఇవ్వాల్సిన గౌరవం ఇవ్వాలి. ఒకవేళ ఇవ్వలేకపోయినా ఇష్టమొచ్చినట్టు చేయటం హుందాతనం కాదు. రెండు సందర్బాల్లో పేరు మార్పు జరిగింది. హైదరాబాద్‌లోని ఇంటర్నేషనల్‌ ఎయిర్‌పోర్ట్‌కు రాజీవ్‌ గాంధీ, డొమస్టిక్‌ ఎయిర్‌పోర్ట్‌కు ఎన్టీఆర్‌ పేర్లు పెట్టాం. రాజశేఖర్‌రెడ్డి రెండింటికీ రాజీవ్‌ గాంధీ పేరు పెట్టాడు. దానిపైన పోరాడాం. ఇప్పుడు హెల్త్‌ యూనివర్సిటీ పేరు మార్చారు.’’

‘‘ఎన్టీఆర్‌ గారు సిద్దార్థ మెడికల్‌ కాలేజీని అభివృద్ధి చేసి, యూనివర్సిటీగా మలిచారు. తొలిసారి దేశంలో మెడికల్‌ యూనివర్సిటీ ఏర్పాటు చేసిన ఘనత ఎన్టీఆర్‌ది. నేను ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు బాగా ఆలోచించి ఆ యూనివర్సిటీకి ఎన్టీఆర్‌ పేరు పెట్టా. అలాంటి యూనివర్సిటీ పేరు మార్చటం చాలా దారుణం. ఆ సంప్రదాయం మంచిది కాదు. ఎన్టీఆర్‌ అనే పేరు తెలుగువారి ఆత్మగౌరవానికి ప్రతీక. ఆ పేరును మార్చటం తెలుగు జాతిని అవమానించినట్టే. నేను సీఎంగా ఉన్న సమయంలో.. రాజశేఖర్‌రెడ్డి పేరుమీద ఉన్నవి మార్చాలంటే నాకు ఒక్క నిమిషం పని. కానీ, నేను మార్చలేదు. అది నా సంస్కారం. పేరు మార్పునకు నేను చేయాల్సిన ప్రయత్నాలన్నీ చేస్తా. ఒకవేళ అప్పటికీ మార్చకపోతే.. మళ్లీ ఒకరోజు వస్తుంది. ఏడాదిన్నరలో తప్పకుండా ఎన్టీఆర్‌ పేరు యూనివర్సిటీకి పెడతాం’’ అని చంద్రబాబు స్పష్టం చేశారు.

స్నేహితుల గురించి వివరిస్తూ.. పాఠశాల, కళాశాల దశలో చాలామంది ఉన్నారని చెప్పారు. రాజకీయాల్లోకి వచ్చాక రాజశేఖర్‌డ్డితో ఎక్కువగా ప్రయాణించానన్నారు. 1978- 83 మధ్యకాలంలో ఎమ్మెల్యే, మంత్రులుగా పలుమార్లు దిల్లీ వెళ్లి, న్యాయ పోరాటం చేశామని తెలిపారు. తాను తెలుగు దేశం పార్టీలో చేరాక తమ మధ్య రాజకీయంగా మాత్రమే శత్రుత్వం పెరిగిందన్నారు. ఏ విషయాన్నీ వ్యక్తిగతంగా తీసుకోలేదని, రాజశేఖర్‌రెడ్డి మంచి మిత్రుడని తెలిపారు.

రాజకీయరంగ ప్రవేశం గురించి చెబుతూ.. సివిల్‌ సర్వీసెస్‌ పరీక్షలు రాసేందుకు తగిన శ్రమ చేయలేనని, అందుకే అటువైపు వెళ్లలేదని తెలిపారు. తాను చదువుకున్నయూనివర్సిటీలోని వైస్‌ ఛాన్సలర్‌ ఉద్యోగం ఇస్తానంటే వద్దన్నానని, ఎమ్మెల్యేగా పోటీ చేసి గెలుస్తాను అని బదులిచ్చినట్టు చెప్పారు. ‘‘నేను ఐఏఎస్‌ అయితే కొంతమేరకే సమాజం కోసం పనిచేయగలుగుతా. రాజకీయాల్లో రాణిస్తే ఐఏఎస్‌ లు మన వద్ద పనిచేస్తారు’ అని అనుకునేవాణ్ని. నేను ఎమ్మెల్యేగా పోటీచేస్తున్నానని మా నాన్నను డబ్బులు అడిగా. ఆయన ఆశ్చర్యపడ్డారు. రిస్క్‌ చేస్తున్నావ్‌ అంటూనే ఎన్ని సమస్యలున్నా నాకోసం రూ. లక్ష ఇచ్చారు. విద్యార్థులు ప్రతి గ్రామానికి వెళ్లి, కష్టపడి పనిచేసి నన్ను గెలిపించారు’’ అని చంద్రబాబు నాటి సంగతులు గుర్తు చేసుకున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని