‘చెక్‌’ ఒక ట్రెండ్‌సెట్టర్‌ అవుతుంది

చంద్రశేఖర్‌ యేలేటి దర్శకత్వంలో నితిన్‌ హీరోగా వస్తున్న చిత్రం ‘చెక్‌’. ప్రియా ప్రకాశ్‌వారియర్‌, రకుల్‌ ప్రీత్‌సింగ్‌, సాయిచంద్‌ కీలక పాత్రలు పోషించారు. భవ్యక్రియేషన్స్‌ పతాకంపై ఆనంద్‌ప్రసాద్‌ నిర్మించారు. కల్యాణి మాలిక్‌ సంగీతం అందించారు.

Updated : 26 Feb 2021 16:07 IST

చిత్రబృందంతో ఈటీవీ చిట్‌చాట్‌

ఇంటర్నెట్‌ డెస్క్‌: చంద్రశేఖర్‌ యేలేటి దర్శకత్వంలో నితిన్‌ హీరోగా వస్తున్న చిత్రం ‘చెక్‌’. ప్రియా ప్రకాశ్‌వారియర్‌, రకుల్‌ ప్రీత్‌సింగ్‌, సాయిచంద్‌ కీలక పాత్రలు పోషించారు. భవ్యక్రియేషన్స్‌ పతాకంపై ఆనంద్‌ప్రసాద్‌ నిర్మించారు. కల్యాణి మాలిక్‌ సంగీతం అందించారు. ఫిబ్రవరి 26న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో చిత్రబృందంతో ఈటీవీ ముచ్చటించింది. ఈ సందర్భంగా నితిన్‌, ప్రియాప్రకాశ్‌, సాయిచంద్‌, హర్ష.. సినిమా గురించి పలు ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. అవేంటో చదివేయండి మరి.

ఈ సినిమా ఒప్పుకోవడానికి ప్రధాన కారణం..?

నితిన్‌: ఈ సినిమా ఒప్పుకోవడానికి ముందే ఒక భిన్నమైన సినిమా చేయాలని నాలో ఆలోచన ఉంది. ఆ సమయంలోనే డైరెక్టర్‌ చంద్రశేఖర్‌ యేలేటి ఈ లైన్‌ తీసుకొని నా దగ్గరికి వచ్చారు. దాదాపు 20 నిమిషాల్లో కథ చెప్పేశారు. ఒక ఖైదీ చెస్‌ నేర్చుకొని గ్రాండ్‌ మాస్టర్‌ అవుతాడు.. ఆ తర్వాత క్లైమాక్స్‌. ఆయన చెప్పిన కథ చాలా కొత్తగా అనిపించింది. నేను చేసిన సినిమాల్లో ఇది చాలా కొత్తగా ఉండబోతోందని అనిపించింది. అందుకే వెంటనే నేను సినిమాకు ఓకే చెప్పాను. 

సినిమా ఔట్‌పుట్‌తో సంతోషంగా ఉన్నారా..?

నితిన్‌: మేము ఎలా రావాలని కోరుకున్నామో ఔట్‌పుట్‌ సినిమా అలాగే వచ్చింది. సినిమాపై ఎంతో నమ్మకంగా ఉన్నాను. ప్రేక్షకులకు కూడా కచ్చితంగా నచ్చుతుంది. అందరూ ఒక కొత్త నితిన్‌ను చూడబోతున్నారు. సినిమా కూడా చాలా కొత్తగా అనిపిస్తుంది.

నితిన్‌తో కలిసి పనిచేయడం ఎలా ఉంది..?

సాయిచంద్‌: చంద్రశేఖర్‌ యేలేటి గారు తీసిన ‘అనుకోకుండా ఒకరోజు’ సినిమా చూశాను. ఎంతో థ్రిల్‌కు గురయ్యాను. డైరెక్టర్‌ ఇలా.. ఎలా.. ఆలోచించగలిగాడా..? అని ఆశ్చర్యానికి గురయ్యాను. నితిన్‌ గురించి చెప్పాలంటే. ఎన్నో సినిమాలు చేసిన అంత పెద్ద హీరో మాతో అంత అణుకువగా ఉంటాడని అనుకోలేదు. మాతో కలిసి చెస్‌ ఆడటం.. నేర్చుకోవడం.. ఇలా మా ఇద్దరి మధ్య తెలియకుండానే ఆత్మీయ అనుబంధం ఏర్పడింది. 

నితిన్‌: మామూలుగా సినిమాల్లో హీరోహీరోయిన్ల మధ్య కెమిస్ట్రీ ఉంటుంది. ఈ సినిమాలో మాత్రం మా ఇద్దరి మధ్య ఉంటుంది(నవ్వుతూ) ఇద్దరం గొడవపడుతూ.. కొట్లాడుతూ ఉంటాం.

మీకు అవకాశం వచ్చినప్పుడు ఎలా అనిపించింది..?

ప్రియావారియర్‌: ఈ అవకాశం వచ్చినప్పుడు నాకు చాలా సంతోషం కలిగింది. ‘మనమంత’ సినిమా చూశాను. నా పాత్ర విన్నతర్వాత ఈ సినిమా చేస్తానని వెంటనే చెప్పాను. నితిన్‌, రకుల్‌ లాంటి పెద్ద స్టార్లున్న సినిమాలో అవకాశం రావడం నా అదృష్టం.

నితిన్‌ను సీరియస్‌ పాత్రలో చూడటం ఎలా ఉంది..?

హర్ష: ఈ పాత్రలో నితిన్‌ చేయడం నాకు చాలా ఆనందం కలిగించింది. సినిమాపై నితిన్‌కు ఉన్న తపన నాకు తెలుసు. ‘గుండెజారి గల్లంతయ్యింది’ నుంచి నేను నితిన్‌తో చెప్తూ వస్తున్నాను. ఒక్కోసారి చంద్రశేఖర్‌ యేలేటి గారితో సినిమా చెయాలని అంటూ ఉండేవాడిని. ఈ సినిమా చేస్తున్నట్లు వార్త విన్న తర్వాత చాలా సంతోషం వేసింది. వాళ్ల కాంబినేషన్‌లో సినిమా వస్తే కచ్చితంగా బాగుంటుందని నా నమ్మకం. ఖైదీ పాత్రలో నితిన్‌ కచ్చితంగా అలరిస్తాడు.

సినిమా షూటింగ్‌ వ్యక్తిగతంగా మీకు ఎలాంటి అనుభవాలిచ్చింది..?

నితిన్‌: ఈ సినిమా వ్యక్తిగతంగా నాకు ఎన్నో పాఠాలు నేర్పింది. షూటింగ్‌ జరిగినన్ని రోజులు నేను దిగాలుగా ఉండేవాడిని. ఎందుకంటే నా పాత్ర అలాంటిది. ఇంటికెళ్లిన తర్వాత కూడా అదే మూడ్‌లో ఉండిపోయేవాడిని. ఇంట్లో వాళ్లపై చిన్నచిన్నవాటికే చిరాకుపడ్డ సందర్భాలు కూడా ఉన్నాయి. ఒకానొక సందర్భంలో షూటింగ్‌ ఎప్పుడు అయిపోతుందా అనిపిస్తుంది. ఒకరోజు షూట్‌కు వెళ్లడం ఇష్టంలేక కడుపునొప్పి వస్తుందని చెప్పి తప్పించుకున్నాను. ఈ సినిమా నాపై వ్యక్తిగతంగా ఎంతో ప్రభావం చూపించింది.

సినిమాలో రకుల్‌ కూడా ఉంది. మీ పాత్ర ప్రాధాన్యతపై ఏమైనా సందేహం వచ్చిందా..?

ప్రియ: అలాంటిదేం లేదు. ఈ సినిమాలో అవకాశం రావడమే నా అదృష్టం. ఒకవేళ మల్టీస్టారర్‌లో అవకాశం వచ్చినా అదేవిధంగా భావిస్తా.

పచ్చబొట్టులకు అర్థం ఏంటి..?

నితిన్‌: మనం పుట్టినప్పుడు ఎలాంటి మచ్చలేకుండా పుడతాం. పోయేలోపు మనకు నచ్చినట్లు బతకాలనేదే హీరో క్యారెక్టర్‌. అందుకే ఒంటినిండా పచ్చబొట్టులతో హీరో కనిపిస్తాడు.

ఒకే ఒక పాట ఉంది కదా..!

ప్రియ: ఉన్న ఒక్కపాటైనా నాకు ఎక్కువే. పాట కూడా బాగా వచ్చింది.

నితిన్‌: సినిమా చూసేటప్పుడు పాటలు లేవనే ఆలోచన రానేరాదు. 

మీరు చేసిన ‘ఉప్పెన’ మంచి హిట్‌ అయింది. ఈ సినిమా నుంచి ఏం కోరుకుంటున్నారు..?

సాయిచంద్‌: ఈ సినిమా ‘తెలుగు లగాన్‌’ అవుందని నా నమ్మకం. నేను నటించానని చెప్పడం కాదు.. తెలుగు సినిమాల్లో ఇదొక ‘ట్రెండ్‌ సెట్టర్‌’ అవుతుందని అనుకుంటున్నా.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని