‘ఆ సినిమాలు తీస్తే ఎన్‌కౌంటర్‌ చేస్తా’ అన్నారు

జనానికి ఆయన ఓ సినిమా హీరో. నిజానికి ఆయనో రైతు బిడ్డ. ఆయన మాట్లాడితే విప్లవం. కానీ ఆయన జీవన విధానం అతి సామాన్యం. ఆడంబరత అధికంగా కనిపించే సినిమా రంగంలో ఉంటూనే నిరాడంబరతకి ఆయన నిదర్శనంగా మారారు.

Updated : 12 Jul 2021 15:12 IST

జనానికి ఆయన ఓ సినిమా హీరో.. నిజానికి ఆయనో రైతు బిడ్డ.. ఆయన మాట్లాడితే విప్లవం.. కానీ, ఆయన జీవన విధానం అతి సామాన్యం. ఆడంబరానికి అధిక ప్రాధాన్యమిచ్చే సినిమా రంగంలో ఉంటూనే నిరాడంబరతకి నిలువెత్తు నిదర్శనం. ఆయన ఓ ఆదర్శమూర్తి. ఆయనే ఆర్‌. నారాయణమూర్తి. ‘నేరము- శిక్ష’ సినిమాతో సినీ రంగ ప్రవేశం చేసి, ‘నీడ’ సినిమాతో హీరోగా ఎదిగి ఆ తర్వాత ‘చీమలదండు’, ‘ఎర్రసైన్యం’ వంటి ఎన్నో సూపర్‌ హిట్‌ చిత్రాలకు నిర్మాతగా, దర్శకుడిగా, రచయితగా, సంగీత దర్శకుడిగా మాత్రమే కాకుండా సినిమా పరిశ్రమకి ఆయన మార్గదర్శకుడయ్యారు. ‘సెల్యులాయిడ్‌ లాల్‌ జెండా’గా పేరొందిన నారాయణ మూర్తి.. ఈటీవీలో ప్రసారమయ్యే ‘చెప్పాలని ఉంది’ కార్యక్రమాకి విచ్చేసి, ఎన్నో ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. ఆ విశేషాలవీ..

నాలుగు దశాబ్దాలుగా మీరు నమ్ముతున్న సిద్ధాంతాలని, ఆదర్శాలని ఆయుధంగా చేసుకుని ఒక విప్లవ సైనికుడిగా సినిమా రంగంలో మీకంటూ ప్రత్యేక స్థానం సంపాదించుకున్నారు. పెట్టుబడి ప్రధానంగా ఉండే ఈ రంగంలో ప్రేక్షకుల తరఫున విప్లవాత్మక సినిమాలు తీయాలన్న స్పందన/స్ఫురణ/ శక్తి మీకెలా కలిగింది?

నారాయణమూర్తి: ఈ స్పందన/ శక్తి నాకే కాదు ఎంతో మందికి ఉంది. దీనికి నేనే ఆద్యుడ్ని కాను. నేనే అంతం కాదు. ‘మాలపిల్ల’, ‘రైతుబిడ్డ’ రూపొందించిన మహానుభావుడు గూడవల్లి రామబ్రహ్మం గారు దీనికి ఆద్యుడు. వై.వి.రావు, ఎల్వీ ప్రసాద్‌, బి.ఎన్‌.రెడ్డి, దాసరి నారాయణ రావు, సింగీతం శ్రీనివాసరావు, కె.విశ్వనాథ్‌, వి.మధుసూదన్‌ రావు, ఆదుర్తి సుబ్బారావు, మాదాల రంగారావు, టి.కృష్ణ, పరుచూరి బ్రదర్స్‌.. ఒకరా ఇద్దరా ఎందరో మహామహులు ఇలాంటి సినిమాలు తీస్తూనే ఉన్నారు. ఆ బాటలో చిన్న పిల్లాడిగా నేనూ గెంతుతూ వస్తున్నా.

ఎన్నో మార్గాలుండగా మీరు సినిమా రంగాన్నే ఎందుకు ఎంచుకున్నారు?

నారాయణమూర్తి:  ‘హాలీవుడ్‌ని నా చేతిలో ఆర్నెల్లు పెడితే ఈ ప్రపంచ చరిత్రనే మార్చేస్తా’ అని లెనిన్‌ అనే గొప్ప వ్యక్తి సినిమా గురించి ఇలా పేర్కొన్నాడు. అదీ సినిమా పవర్‌. నేను సినిమా పిచ్చోడ్ని. నేనీ స్థాయికి వచ్చానంటే కారణం సినిమానే. కళామతల్లి చాలా గొప్పది.

మీ చిన్నతనంలో ఏ హీరో చిత్రాలు ఎక్కువగా చూసేవారు? ఎలాంటి కార్యక్రమాల్లో పాల్గొనేవారు? ముఖ్యంగా కమ్యునిస్టు సిద్ధాంతాల పట్ల ఎప్పుడు ఆకర్షితులయ్యారు?

నారాయణ మూర్తి: నేను పుట్టి పెరిగిందంతా ఆంధ్రప్రదేశ్‌లోని రౌతులపూడిలోనే. అక్కడో సినిమా థియేటర్‌ ఉంది. అందులోంచి వచ్చే ఘంటసాల గారి పాటలు వినడం.. సినిమాలకి వెళ్లడం.. అలా సినిమాపై పిచ్చి మొదలైంది. ఎన్టీఆర్‌, ఏఎన్నార్‌, కాంతారావు తదితర నటుల హావభావాల్ని స్నేహితులతో కలిసి ఇమిటేట్‌ చేసేవాణ్ని. అప్పుడు పశువులు, పక్షులు, ప్రకృతే నా ప్రేక్షకులు. సమాజహితంగా ఉండటం నా తల్లిదండ్రుల పెంపకం ద్వారా అలవడింది. 1977లో బి.ఎ. పాసయ్యాను. 1975 ఎమర్జెన్సీ సమయంలో పోలీసుతో ఢీ అంటే ఢీ అని దెబ్బలు తిన్నాను. అయినా నా డిగ్రీ పూర్తయ్యాక రాజకీయాలవైపు వెళ్లకుండా మహాతల్లి (సినిమా) దయ వల్ల ఇటు వచ్చా. నా అభిమాన నటుడు అక్కినేని నాగేశ్వరరావు, నటి సావిత్రి. వీళ్లేకాదు ఎన్టీఆర్‌, ఎస్వీ రంగారావు, సూర్యకాంతం, రేలంగి నటించిన అన్ని సినిమాలు చూశాను.

‘36 సంవత్సరాలుగా సినిమాలు చేస్తున్నా’ అన్నారు. తొలి 20 ఏళ్లలో చిత్ర పరిశ్రమని మీ వైపునకు తిప్పుకున్నారు. అలాంటిది గత 16 ఏళ్లుగా మీ సినిమాలు సరైన విజయం అందుకోలేకపోతున్నాయి. దీని గురించి ఏం అనుకుంటున్నారు?

నారాయణ మూర్తి: అవును. 20 ఏళ్లు నా సినిమాలు బ్రహ్మాండంగా ఆడాయి. ఇదే పంథాలో ఇతర దర్శకులూ సినిమాలు తీయడంతో ప్రేక్షకుల్లో ఒక రకమైన భావన కలిగింది. దాంతో ఆ దర్శకులు అలాంటి చిత్రాలు తీయడం మానేశారు. నేను ఇంకా అలాంటి సినిమాల్నే తీయడం వల్ల జనం పట్టించుకోవడం లేదు. అయితే ‘ప్రతి సినిమాకీ ఏదో మంచి పాయింట్‌ చెప్తాడు’ అని ఎదురు చూసే కొద్దిశాతం మంది ప్రేక్షకుల వల్ల ఈ సముద్రాన్ని ఈదుకుంటూ వస్తున్నా. ఉద్యమం నేపథ్యంలోని సినిమాలు ఆడాలంటే చాలా బాగా తీయాలి. అదే స్థాయిలో ప్రచారం చేయాలి.

ఓటీటీల్లో అడుగుపెట్టి ఈ తరానికి అర్థమయ్యే విధంగా మీ భావాల్ని పంచుకునే అవకాశాలు ఏమైనా ఉన్నాయా?

నారాయణ మూర్తి: ఓటీటీనో, మరొక ఫార్మేట్‌నో నేను చిన్నచూపు చూడట్లేదు. ఓటీటీ, టీవీ, సినిమా.. దేని పాత్ర అది పోషిస్తుంది. కానీ సినిమా.. సినిమానే అనేది నా అభిప్రాయం.

‘ఆకాశంలో పయనిస్తున్న సినిమా రంగాన్ని ఆర్‌.నారాయణ మూర్తి భూమార్గాన్ని పట్టించారు’ అని ఎస్పీబీ అన్నారు. దాన్నెలా స్వీకరించారు?

నారాయణ మూర్తి: అంతకన్నా గొప్ప కాంప్లిమెంట్‌ ఏముంటుంది. ఆ మహానుభావుడి సంస్కారానికి పాదాభివందనం చేస్తున్నా.

మీ దర్శకత్వంలో ఇతర హీరోలని పెట్టి ఎందుకు సినిమాలు చేయలేదు? ప్రత్యేక కారణం ఏమైనా ఉందా?

నారాయణ మూర్తి: నేను సినిమా పిచ్చితో మద్రాసు వెళ్లాను. ‘నేను హీరో అవ్వాలి. నా పోస్టర్‌ చూసి, సినిమాల్లో నన్ను చూసి, పేపర్‌లో నా పేరు చూసి జనం ఆనందపడాలి. నా నటనకి విజిల్‌ వేయాలి, చప్పట్లు కొట్టాలి’ అనే కాంక్షతో అక్కడికి చేరుకున్నాను. నా అదృష్టమో, జనం ఆశీర్వాదమో, దేవుడి దయో ఈ స్థాయికి వచ్చా. ఏ ఇమిటేషన్‌ కార్యక్రమంలోనైనా సరే రామారావు గారి శైలితో మొదలుపెట్టి చివరగా నా హావభావాలతో ఆ షోని ముగిస్తారు. దేవుడి దయ వల్ల అలాంటి స్థాయిలో ఉన్నప్పుడు ఇంకో హీరోని నేను ఎందుకు పెట్టుకుంటానండి.

విప్లవాత్మక సినిమాల వల్ల ఎప్పుడైనా సమస్యలు ఎదురయ్యాయా?

నారాయణ మూర్తి: వీటికి ప్రధాన సమస్య సెన్సార్‌. ముఖ్యంగా ‘లాల్‌ సలామ్‌’ చిత్రానికి సెన్సార్‌తోపాటు పోలీసుల నుంచి ఇబ్బందులు ఎదురయ్యాయి. ‘ ఏయ్‌.. నారాయణ మూర్తి నువ్వు ఇలాంటి సినిమాలు తీస్తే ఎన్‌కౌంటర్‌ చేస్తాం’ అని అప్పటి ఇంటిలిజెన్స్‌ ఐ.జి. నన్ను ఇంటరాగేషన్‌ చేశారు. తర్వాత నా ఉద్దేశం తెలుసుకుని వదిలేశారు.

మీ సినిమాల ద్వారా ఏదైనా సమస్యకి పరిష్కారం లభించిందా?

నారాయణ మూర్తి: చాలా ఉన్నాయి. వాటిల్లో చెప్పుకోవాల్సింది ‘దండోరా’ చిత్రం గురించి. సారాకి వ్యతిరేకంగా తీసిన చిత్రమిది. ఈ సినిమా చూసి స్త్రీ మూర్తులు సారా దుకాణాల్ని ధ్వంసం చేశారు. నా ఇతర సినిమాలు చూసి కొందరు  భూపోరాటాలు చేశారు. ఎప్పటికీ మర్చిపోలేని జ్ఞాపకం ఏంటంటే.. రామోజీరావు గారు ఆలింగనం చేసుకుని ‘దండోరా’ చిత్రం విషయంలో మెచ్చుకోవడం. సారాకి వ్యతిరేకంగా జరుగుతున్న పోరాట సమయంలో దీనిపై ఆయన ఓ సినిమా చేయాలనుకున్నారు. కానీ, కొన్ని కారణాల వల్ల చేయలేదు. అయినా సరే పట్టు వదలకుండా సారాకి వ్యతిరేకంగా  ‘శంఖారావం’ అనే క్యాసెట్‌ని (పాటల ఆల్బమ్‌) తీసుకొచ్చారు. మిగతా దర్శకులు ఇదే నేపథ్యంలో సినిమాలు తీసినా అవి అంతగా ఆడలేదు. రామోజీ రావు గారు నా చిత్రం చూశాక ‘నారాయణ మూర్తి.. నేను చేయలేని సాహసం నువ్వు చేశావయ్యా’ అని ఆలింగనం చేసుకున్నారు.

సంగీతంపై ఆసక్తి ఎలా కలిగింది?

నారాయణ మూర్తి: సంగీతం అంటే ఓంకార నాదం. ప్రకృతిలో ఉందది. ఆకాశంలో మెరుపులు వచ్చినా, నెమలి ఆడినా, లేడి పరిగెట్టినా అన్నింటా ఏదో రిథమ్‌ ఉంటుంది. వీటన్నింటికీ ఎవరు నేర్పారు. అలానే ప్రతి మనిషిలోనూ సంగీతం దాగుంటుంది. నాకూ ఉంది. బిజీగా ఉన్న సంగీత దర్శకుల్ని నా సినిమాకి తీసుకోవడం నాకు ముందు నుంచీ అలవాటు లేదు. కొత్తవారిలో ప్రతిభని గుర్తించి  తీసుకునేవాణ్ని. తర్వాతర్వాత సంగీతంపై కొంచెం అవగాహన రావడంతో నేనే ఆ బాధ్యతల్ని తీసుకున్నా.

‘సోలో బ్రతుకే సో బెటర్‌’లో కథానాయకుడు మీ అభిమాని. కథలో భాగంగా మీ సలహా తీసుకుని పెళ్లి చేసుకుంటాడు. నిజ జీవితంలో మీరు పెళ్లి చేసుకోలేదు. కారణం తెలుసుకోవచ్చా?

నారాయణ మూర్తి: పెళ్లి చేసుకోకపోవడానికి.. నేను చాలా దురదృష్టవంతుణ్ని. అంతేకానీ సిద్ధాంతాలు అంటూ ఏం లేవు. ఎవర్నో పెళ్లి చేసుకోవాలనుకున్నా. అమ్మానాన్న అంగీకరించలేదు. ఈ విషయంలో నేను రాజీపడాలనుకోలేదు. తల్లిదండ్రుల్ని బాధ పెట్టాలనుకోలేదు. పెళ్లి చేసుకోకపోవడం ఎంత తప్పో ఈ రోజు అనుభవిస్తున్నా. అయితే ‘సోలో బ్రతుకే’ చిత్ర దర్శకుడు సినిమాలో నాకు ఎంతో విలువ ఇచ్చాడు.

‘జన నాట్య మండలి గజ్జె కొనసాగింపే ఆర్‌. నారాయణ మూర్తి సినిమాలు’ అని గద్దర్‌ ప్రశంసించారు కదా?

నారాయణ మూర్తి: అవును. మరిచిపోలేని కాంప్లిమెంట్‌ అది. ఆయనకు ధన్యవాదాలు తెలుపుతున్నాను.

‘ఇండస్ట్రీలో ఎంత వెతికినా మనకు దొరకని అరుదైన మనిషి ఆర్‌. నారాయణ మూర్తి’ అని చిరంజీవి అన్నారు. దీని గురించి..

నారాయణ మూర్తి: నా గురించి అంత బాగా చెప్పడం ఆయన సంస్కారానికి నిదర్శనం.

మీ నుంచి త్వరలో రానున్న ‘రైతన్న’ చిత్రంలో ఏ అంశాన్ని ఆవిష్కరించనున్నారు?

నారాయణ మూర్తి: ఈ సినిమా సెన్సార్‌ పూర్తయింది. త్వరలోనే విడుదల చేస్తా. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన నూతన వ్యవసాయ చట్టాల్ని రైతులు ఎందుకు వ్యతిరేకిస్తున్నారో ఇందులో చూపించా.

మీరు చేసిన సేవల గురించి ఎప్పుడూ ఎక్కడా ప్రస్తావించరు. మీ ఊరికి చేసిన సేవ గురించి కొంచెం చెప్తారా?

నారాయణ మూర్తి: విద్య, వైద్యానికి సంబంధించి నా వంతు సాయం చేశా. ఊరు, పేరు వివరాలు ప్రస్తావించడం నాకు ఇష్టం లేదు. జనం దయ వల్ల నేను డబ్బు సంపాదించా. వాళ్ల కోసమే మంచి పనులు చేశా. చాలామంది చేస్తున్నారు. వాళ్లతోపాటు నేనూ చేస్తున్నా. చిన్నప్పుడు నా జీవన విధానం ఎలా ఉండేదో ఇప్పటికీ అలానే ఉంది. నా పనులు నేనే చేసుకుంటా.

ఆదివాసీ, సోంపేట ధర్మల్ ప్రాజెక్టు‌, తెలంగాణ, విశాఖ ఉక్కు- ఆంధ్రుల హక్కు తదితర ఉద్యమాల్లో పాల్గొంటూనే సినిమాలూ తీయడం ఎలా సాధ్యమైంది? దర్శకులు టి. కృష్ణ, దాసరి నారాయణ రావుతో ఉన్న అనుబంధం గురించి నారాయణ మూర్తి మాటల్లో వింటేనే బాగుంటుంది.


Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు