Chhello Show: ఆస్కార్‌ బరిలో నిలిచిన సినిమా ఏ ఓటీటీలోకి అంటే..

తొమ్మిదేళ్ల వయసులో సినిమాతో ప్రేమలో పడిన కుర్రాడి కథగా తెరకెక్కిన చిత్రం ‘ఛెల్లో షో’. సినీ ప్రియుల హృదయాల్ని హత్తుకున్న ఈ సినిమా ఓటీటీలోకి వచ్చేస్తోంది. 

Published : 21 Nov 2022 17:25 IST

హైదరాబాద్‌: ‘ఛెల్లో షో’(Chhello Show) ఈ సినిమా ఎంతటి సంచలనం సృష్టించిందో తెలిసిన విషయమే. దర్శకుడు నలిన్‌ బాల్య జ్ఞాపకాల ఆధారంగా తెరకెక్కిన ఈ సినిమా ఆస్కార్‌- 2023లో పోటీపడే అవకాశం దక్కించుకుంది. ‘లాస్ట్‌ ఫిల్మ్‌ షో’ (ఆంగ్లంలో) (Last Film Show) అనే ఈ గుజరాతీ సినిమా ఓటీటీలోకి వచ్చేందుకు సిద్ధమైంది. నెట్‌ఫ్లిక్స్‌( Netflix) వేదికగా నవంబర్‌ 25 నుంచి ఈ సినిమా డిజిటల్‌ ప్రేక్షకులను అలరించనుంది. ఈ సందర్భంగా చిత్ర దర్శకుడు నలిన్‌ మాట్లాడుతూ ‘‘లాస్ట్‌ ఫిల్మ్‌ షో అనేది సినిమా కాదు.. ఒక వేడుక ఇప్పుడు ఈ వేడుకను భారతదేశంలోని ప్రజలందరూ చేసుకోనున్నారు’’ అంటూ నెట్‌ఫ్లిక్స్‌కు ధన్యవాదాలు తెలిపారు. ‘ఈ సినిమా ఎక్కువ మంది వ్యక్తులకు చేరువవ్వాలని నేను కలలకంటున్నాను. లాస్ట్‌ ఫిల్మ్‌ షో కేవలం ఒక క్లిక్‌ దూరంలో ఉంది’ అని నిర్మాత అన్నారు.

ఇదీ కథ..: ‘బెస్ట్‌ ఇంటర్నేషనల్‌ ఫీచర్‌ ఫిల్మ్‌’ కేటగిరీలో ఆస్కార్‌కు ఎంపికైన ఈ సినిమా దర్శకుడు నలిన్‌ బాల్య జ్ఞాపకాల ఆధారంగా తెరకెక్కింది. చిన్న తనంలో ఆయన సినిమాలకు ఎలా ఆకర్షితులయ్యారు? వెండితెర, సినిమా పై ఎంత మమకారం పెంచుకున్నారు? తదితర హృదయాలను హత్తుకునే కథాంశంతో ఈ చిత్రం రూపొందింది. గుజరాత్‌ రాష్ట్రంలోని గ్రామీణ వాతావరణం అప్పట్లో ఎలా ఉండేదో ఈ సినిమా ద్వారా నలిన్‌ కళ్లకు కట్టినట్టు చూపించారు. తొమ్మిదేళ్ల బాలుడి కథగా తెరకెక్కిన ఈ చిత్రంలో భవిన్‌ రాబరి, భవేశ్‌ శ్రీమాలి,  రిచా మీనా, దిపెన్‌ రావల్‌, పరేశ్‌ మెహతా ప్రధాన పాత్రలు పోషించారు. ‘లాస్ట్‌ ఫిల్మ్‌ షో’ (ఆంగ్లంలో) (Last Film Show) పేరుతో ఈ సినిమా గతేడాది జూన్‌లో ‘ట్రిబెకా ఫిల్మ్‌ ఫెస్టివల్‌’లో ప్రదర్శితమై, వీక్షకుల హృదయాల్ని బరువెక్కించింది. పలు అంతర్జాతీయ వేడుకల్లోనూ సత్తా చాటింది.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని