chinmayi sripaada: సరోగసిపై చిన్మయి స్ట్రాంగ్‌ రిప్లై.. అలా అనుకుంటే నాకే సమస్యా లేదు!

సరోగసి ద్వారా చిన్మయి దంపతులు బిడ్డలకు జన్మనిచ్చారంటూ సోషల్‌మీడియాలో ట్రోలింగ్‌ మొదలైంది. ఈ క్రమంలో చిన్మయి శ్రీపాద ఇన్‌స్టా వేదికగా ఓ వీడియోను పంచుకుని, అసత్య ప్రచారాలకు చెక్‌ పెట్టారు.

Published : 19 Oct 2022 01:41 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: సోషల్‌మీడియాలో ఎప్పుడూ యాక్టివ్‌గా ఉంటూ తన అభిప్రాయాలను సూటిగా పంచుకుంటారు గాయని చిన్మయి శ్రీపాద. ఇటీవల రాహుల్‌ రవీంద్రన్‌-చిన్మయి దంపతులకు కవలలు జన్మించిన సంగతి తెలిసిందే. అన్ని విషయాలను పంచుకునే ఆమె తల్లి అయిన విషయం మాత్రం ఎవరితోనూ చెప్పలేదు. దీంతో సరోగసి ద్వారా చిన్మయి దంపతులు బిడ్డలకు జన్మనిచ్చారంటూ సోషల్‌మీడియాలో ట్రోలింగ్‌ మొదలైంది. ఈ క్రమంలో చిన్మయి శ్రీపాద ఇన్‌స్టా వేదికగా ఓ వీడియోను పంచుకుని, అసత్య ప్రచారాలకు చెక్‌ పెట్టారు. గతంలో ఒకసారి గర్భస్రావం కావటం వల్లే ఈసారి ఎలాంటి విషయాలను బయటకు పంచుకోలేదని తెలిపారు.

‘‘32 వారాల తర్వాత నా ఫొటోను ఇప్పుడే మీతో పంచుకుంటున్నా. వీలైనన్ని ఎక్కువ ఫొటోలు తీసుకోలేనందుకు నాకు బాధగా ఉంది. అయితే, దీని వెనుకున్న కారణాన్ని మీకు ఇంతకు ముందే యూట్యూబ్‌ వేదికగా చెప్పాను. మొదటిసారి గర్భస్రావం అయిన తర్వాత చాలా జాగ్రత్తగా ఉన్నాను. ఆ సంఘటన తలుచుకుంటే ఇప్పటికీ భయంగానే ఉంటుంది. కడుపుతో ఉన్నా కూడా నా వృత్తి జీవితాన్ని కొనసాగించా. అయితే, దయచేసి ఎవరూ ఫొటోలు తీయవద్దని, నా వ్యక్తిగత విషయాలకు భంగం కలిగించవద్దని మాత్రం విజ్ఞప్తి చేసేదాన్ని. అయితే, సరోగసిపై వస్తున్న ప్రశ్నలకు ఇదే సమాధానం. సరోగసి, ఐవీఎఫ్‌, లేదా సహజ గర్భం ఇలా ఏ రూపంలోనైనా పిల్లలు కావాలనుకోవడం నా వరకూ పెద్ద విషయం కాదు. అమ్మ అంటే అమ్మే.. అది మనుషులైనా జంతువులైనా. నాకు సరోగసి ద్వారా పిల్లలు పుట్టారని ఎవరైనా అనుకుంటే నేనేమీ లెక్కచేయను. ఎవరు ఏదైనా అనుకోనీయండి. వాళ్ల అభిప్రాయం అది. నాకు ఎలాంటి సమస్యలేదు’’ అంటూ విమర్శకులకు కాస్త గట్టిగానే సమాధానం చెప్పారు. అలాగే తన పిల్లలకు పాలు పడుతున్న ఫొటోను కూడా పంచుకుంటూ ‘ప్రపంచంలోనే గొప్ప  విషయం’ అంటూ పేర్కొన్నారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని