Chinmayi: స్టాలిన్‌ సార్‌.. వైరముత్తుపై చర్యలు తీసుకోండి: గాయని చిన్మయి

వైరాముత్తుని ఉద్దేశిస్తూ తాజాగా ట్వీట్స్‌ చేశారు గాయని చిన్మయి (Chinmayi). మహిళలను వేధించిన అతడిని శిక్షించాలని ఆమె కోరారు.

Updated : 30 May 2023 07:16 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: కోలీవుడ్‌ సినీ గేయ రచయిత వైరముత్తు (Vairamuthu)ను ఉద్దేశిస్తూ ట్విటర్‌ వేదికగా మరోసారి ఆగ్రహం వ్యక్తం చేశారు ప్రముఖ గాయని చిన్మయి (Chinmayi). గతంలో వైరముత్తు పలువురు మహిళలను వేధించారని ఆరోపిస్తూ ఆయనపై తగిన చర్యలు తీసుకోవాలని తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్‌ను కోరారు. ఈ మేరకు ఆమె వరుస ట్వీట్స్‌ చేశారు. 

‘‘బ్రిజ్‌ భూషణ్‌కైనా, వైరముత్తుకైనా రూల్స్‌ ఒకేలా ఉండాలి. ఒకరికి ఒక రకంగా, మరొకరికి మరోలా ఉండకూడదు. (రెజ్లర్లకు స్టాలిన్‌ మద్దతునివ్వడాన్ని ఉద్దేశిస్తూ..) బ్రిజ్‌భూషణ్‌ తమని వేధించాడంటూ మన దేశం గర్వించే ఛాంపియన్స్‌తోపాటు ఒక మైనర్‌ సైతం వ్యాఖ్యలు చేసింది. మీ పార్టీతో సత్సంబంధాలు ఉన్న వైరముత్తు వేధించాడంటూ గతంలో నాతోపాటు 17 మంది మహిళలు బహిరంగంగా వెల్లడించాం. దాంతో, ఆ వ్యక్తి మా కెరీర్‌ను నాశనం చేశాడు. మాకున్న కలలతో పోలిస్తే అతడి టాలెంట్‌ ఏమీ గొప్పది కాదు. దయచేసి, వైరముత్తు లాంటి వ్యక్తులపై తగిన చర్యలు తీసుకోండి. దాంతో తమిళనాడులోని పనిప్రదేశాలు సేఫ్‌గా ఉంటాయి. సొంత ఇండస్ట్రీ (కోలీవుడ్‌ను ఉద్దేశిస్తూ) నుంచే బహిష్కరణకు గురైన ఒక మహిళగా నేను ఈరోజు మాట్లాడుతున్నా. ఎందుకంటే వైరముత్తుకు ఉన్న రాజకీయ సంబంధాలను దృష్టిలో ఉంచుకుని ఆయనకు వ్యతిరేకంగా నాకు సపోర్ట్‌ చేయడానికి ఎవరూ ముందుకు రాలేదు’’ అని ఆమె రాసుకొచ్చారు.

తమను మానసికంగా, లైంగికంగా వేధించిన రెజ్లింగ్‌ ఫెడరేషన్‌ మాజీ అధ్యక్షుడు బ్రిజ్‌ భూషణ్‌ శరణ్‌ సింగ్‌పై చర్యలు తీసుకోవాలని కోరుతూ ఏప్రిల్‌ 23 నుంచి అగ్రశ్రేణి రెజ్లర్లు జంతర్‌మంతర్‌ వద్ద ఆందోళన చేస్తున్న విషయం తెలిసిందే. కేంద్ర ప్రభుత్వం స్పందించకపోవడంతో పార్లమెంటు భవన ప్రారంభోత్సవం వద్ద ఆందోళన నిర్వహించాలని వారు నిర్ణయించారు. దీంతో రెజ్లర్లకు పోలీసులకు మధ్య తీవ్ర తోపులాట చోటుచేసుకుంది. దీనిని ఉద్దేశిస్తూ తమిళనాడు సీఎం స్టాలిన్‌ ఒక ట్వీట్‌ చేశారు. రెజ్లర్లకు మద్దతు ప్రకటించిన ఆయన పోలీసుల తీరును తప్పుబట్టారు. ఈ నేపథ్యంలో చిన్మయి స్పందిస్తూ తమిళనాడు సినీ పరిశ్రమకు చెందిన వైరముత్తు మంచి వాడు కాదని, అతడిపై చర్యలు తీసుకోవాలంటూ ఈ ట్వీట్‌ చేశారు. చట్టానికి ఎవరూ అతీతులు కారని, రెజ్లర్ల ఆవేదన అర్థం చేసుకున్నట్టుగానే తమ ఆవేదన సైతం అర్థం చేసుకుని వైరాముత్తుని శిక్షించాలని కోరారు.

ఇక, కోలీవుడ్‌ పరిశ్రమకు చెందిన చిన్మయి మీటూ ఉద్యమంలో వైరముత్తుకి వ్యతిరేకంగా తన గళాన్ని వినిపించారు. ఆయన తనని వేధించాడని పేర్కొన్నారు. చిన్మయితోపాటు పలువురు సింగర్స్‌ సైతం అతడిపై ఆరోపణలు చేశారు. ఈ క్రమంలోనే ఆ పరిశ్రమ చిన్మయిని బ్యాన్‌ చేసింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని