Adipurush: ఆ ప్రయత్నం ప్రభాస్‌ చేస్తున్నాడు.. ఇంతకంటే మహోపకారం ఉండదు: చినజీయర్‌ స్వామి

ప్రభాస్‌ హీరోగా తెరకెక్కిన భారీ బడ్జెట్‌ చిత్రం ‘ఆదిపురుష్‌’. ఈ సినిమా ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌కు ప్రముఖ ఆధ్యాత్మిక వేత్త చినజీయర్‌ స్వామి ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు.

Published : 07 Jun 2023 01:28 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: మనుషుల గుండెల్లో ఉన్న రాముడిని పైకి తీసుకొచ్చే ప్రయత్నాన్ని ప్రముఖ హీరో ప్రభాస్‌ చేస్తున్నాడని, ఇంతకంటే లోకానికి మహోపకారం ఉండదని ప్రముఖ ఆధ్యాత్మికవేత్త చినజీయర్‌ స్వామి (Chinna Jeeyar Swamy) అన్నారు. ‘ఆదిపురుష్‌’ (adipurush) ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌కు ముఖ్య అతిథిగా విచ్చేసిన ఆయన మాట్లాడారు. ప్రభాస్‌ (prabhas) కథానాయకుడిగా దర్శకుడు ఓంరౌత్‌ తెరకెక్కించిన మైథాలాజికల్‌ చిత్రమిది. రామాయణాన్ని ఆధారంగా చేసుకుని రూపొందిన ఈ సినిమాలో ప్రభాస్‌ రాముడిగా నటించారు. ఈ చిత్రం ఈ నెల 16న విడుదలకానున్న సందర్భంగా చిత్ర బృందం తిరుపతిలో ప్రీ-రిలీజ్‌ వేడుక నిర్వహించింది. వేల సంఖ్యలో అభిమానులు హాజరై, సందడి చేశారు.

వేడుకనుద్దేశించి చినజీయర్‌ స్వామి ప్రసంగిస్తూ.. ‘‘ప్రియ భగవత్‌ బంధువుల్లారా.. సినిమా రంగంలో చరిత్ర సృష్టించిన మహనీయులు ఉండే ఇలాంటి కార్యక్రమాల్లో మాలాంటి వాళ్లు పాల్గొనడం ఇదే మొదటిసారి. దానికి కారణం.. నిజమైన ‘బాహుబలి’ రాముడు అని నిరూపించడానికే ఈ సినిమా వచ్చింది. ప్రతిఒక్కరి గుండెల్లో రాముడు ఉన్నాడు. అలా ప్రభాస్‌ తనలోని రాముడిని తెరపైకి తీసుకొస్తున్నారు. మానవ జాతికి మార్గాన్ని చూపిస్తున్న మహనీయుడు శ్రీరాముడే. ఆయన గురించి ఎవరు ఏం చెప్పినా, ఈ మట్టిపైన నడిచి పావనం చేసిన ఆదర్శ పురుషుడు. చాలామంది రాముడిని దేవుడిగా కొలుస్తారు. కానీ, రామాయణంలో దేవతలంతా వచ్చి ‘రామా..! నువ్వు సాక్షాత్తూ నారాయణుడివయ్యా.. సీతాదేవి శ్రీమహాలక్ష్మి’ అని చెబితే, ‘నేను మానవుడిని. నన్ను మనిషిగా చూడాలనుకుంటున్నా. ఎందుకంటే రాముడు దేవుడు అనగానే ‘దేవుడికి ఏముంది ఏమైనా చేస్తాడులే’ అని జనులు అనుకుంటారు. అందుకే నేను మనిషిగా ఉండాలనుకుంటున్నా’ అని చెప్పి రాముడు మానవుడు అయ్యాడు.’’

‘‘ఒక మనిషి మనిషిగా ఉండగలిగితే దేవతలు కూడా అతని వెంట నడుస్తారు. అలాంటి వ్యక్తికి ఈ సమాజం ఆలయాలు కట్టి కొలుస్తుంది. ఆ విషయాన్నే రామాయణం నిరూపించింది. రాముడంటే మంచి ఆచరణకు నిలువెత్తు రూపమని రాక్షసుడైన మారీచుడే చెప్పాడు. రాముడిని మనుషులు, రుషులు, దేవతలు, చెట్లు, పశువులు, పక్షులు ప్రేమించాయి. ఆఖరికి ముక్కూ చెవులు కోసిన సూర్పణఖ సైతం ప్రేమించింది. అందుకే రాముడికి ఆలయాలు నిర్మించి ఆరాధిస్తున్నాం. మనలోని రాముడిని తెచ్చే ప్రయత్నం చేయాలి. ఆ ప్రయత్నమే ప్రభాస్‌ ఇప్పుడు చేస్తున్నారు. ఇంతకంటే లోకానికి మహోపకారం ఉండదు. అలాంటి మంచి పనిచేసే మహనీయులకు ఆ వెంకటేశ్వరస్వామి అనుగ్రహం ఉండాలని కోరుకుంటున్నా. ఇలాంటి సినిమాను అందిస్తున్న ఓం రౌత్‌కు అభినందనలు. అలాగే చిత్ర బృందం మొత్తానికి నా దీవెనలతో పాటు, ప్రేక్షకులైన మీ దీవెనలు కూడా కావాలి’’ అని చినజీయర్‌ స్వామి అన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు