Ari: మంగ్లీ నోట కృష్ణుడి పాట.. అలరిస్తోన్న ‘అరి’ ఫస్ట్‌ సింగిల్‌

ఇప్పటికే పలు భక్తి గీతాలను ఆలపించి ప్రేక్షకుల్లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు గాయని మంగ్లీ. తాజాగా ఆమె కృష్ణుడిపై ఓ పాట పాడారు. ఆ విశేషాలివీ..

Published : 07 Mar 2023 16:33 IST

హైదరాబాద్‌: సాయికుమార్‌, అనుసూయ భరద్వాజ్‌, శుభలేఖ సుధాకర్‌, ఆమని, వైవా హర్ష తదితరులు ప్రధాన పాత్ర పోషించిన చిత్రం ‘అరి’ (Ari). మై నేమ్‌ ఈజ్‌ నో బడీ అనేది ఉపశీర్షిక. ‘పేపర్‌ బాయ్‌’ ఫేం జయశంకర్‌ దర్శకత్వం వహించారు. వైవిధ్యభరితమైన కాన్సెప్ట్‌తో రూపొందిన ఈ సినిమాలోని తొలి గీతాన్ని హరేకృష్ణ గోల్డెన్‌ టెంపుల్‌ ప్రెసిడెంట్‌ సత్యగౌరవ్‌ చంద్రహాస్‌ ఇటీవల విడుదల చేశారు. ‘చిన్నారి కిట్టయ్య’ (Chinnari Kittayya) అంటూ కృష్ణుడిపై సాగే భక్తి గీతాన్ని కాసర్ల శ్యామ్‌ రచించారు. అనూప్‌ రూబెన్స్‌ స్వరాలు సమకూర్చగా మంగ్లీ ఆలపించారు. అత్యధిక వీక్షణలు సొంతం చేసుకుంటూ ఈ పాట యూట్యూబ్‌లో దూసుకెళ్తోంది. చిత్రీకరణ పూర్తయిన ఈ సినిమా త్వరలోనే ప్రేక్షకుల ముందుకురానుంది.

పాట విడుదల సందర్భంగా సాయికుమార్‌ మాట్లాడుతూ.. ‘‘మంగ్లీ పాడిన దేవుడి పాటలన్నీ మంచి విజయం సాధిస్తున్నాయి. అరిషడ్వర్గాల నేపథ్యంలో తీసిన చిత్రమిది’’ అని అన్నారు. కాసర్ల శ్యామ్ మాట్లాడుతూ.. ‘‘అరి’ చిత్రంలో కృష్ణ తత్వాన్ని చిన్న చిన్న పదాలతో చెప్పే అద్భుతమైన అవకాశం వచ్చింది. దాన్ని దేవుడే ఇచ్చాడని భావిస్తున్నా. భగవద్గీత చదివితే కృష్ణ తత్వంలో మనకు తెలియని ఎన్నో విషయాలు తెలుస్తాయి. నా దృష్టిలో కృష్ణుడుని మించిన మేనేజ్‌మెంట్‌ గురువు లేడు’’ అని పేర్కొన్నారు.

‘‘కథానుగుణంగా కృష్ణుడి గురించి అందరికీ అర్థమయ్యేలా ఓ పాట కావాలని శ్యామ్‌ వద్దకు వెళ్లాను. వారంలోనే అద్భుతంగా రాసి ఇచ్చారు. దానికి మంగ్లీ గానం, అనూప్‌ సంగీతం తోడవడంతో పాట మరోస్థాయికి వెళ్లింది. ఇంత గొప్ప పాట ఎక్కువ మంది ప్రేక్షకులకు చేరువకావాలనే ఉద్దేశంతో ఇస్కాన్ వారి సాయం తీసుకుని సత్య గౌరవ్ గారిని సంప్రదించా’’ అని దర్శకుడు జయశంకర్‌ తెలిపారు. ‘‘పాలసీ ప్రకారం మేం ఇలాంటి వాటిల్లో పాల్గొనం. సినిమాలకు దూరమై పాతికేళ్లు దాటింది. కానీ, ఈ పాట లిరిక్స్ పంపించినప్పుడు చూడగానే ఆకట్టుకున్నాయి. దాంతో, విడుదల చేయాలనిపించింది’’ అని సత్యగౌరవ్‌ వివరించారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని