Chiranjeevi: ఆయన చిత్రాల్ని నేను రీమేక్‌ చేస్తే ఎదురుదెబ్బే: చిరంజీవి

బాలీవుడ్‌ హీరో ఆమిర్‌ ఖాన్‌ సినిమాల్ని రీమేక్‌ చేసే ప్రయత్నం చేస్తే తనకి ఎదురుదెబ్బ తలుగుతుందన్నారు చిరంజీవి. ఆమిర్‌ హీరోగా నటించిన చిత్రం ‘లాల్‌సింగ్‌ చడ్డా’. టాలీవుడ్‌ హీరో నాగ చైతన్య కీలక పాత్ర పోషించారు. అద్వైత్‌ చందన్‌ దర్శకత్వం వహించిన ఈ సినిమాని తెలుగులో చిరంజీవి సమర్పిస్తున్నారు

Published : 09 Aug 2022 16:31 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: బాలీవుడ్‌ హీరో ఆమిర్‌ ఖాన్‌ (Aamir Khan) సినిమాల్ని రీమేక్‌ చేసే ప్రయత్నం చేస్తే తనకి ఎదురుదెబ్బ తగులుతుందన్నారు చిరంజీవి (Chiranjeevi). ఆమిర్‌ హీరోగా నటించిన చిత్రం ‘లాల్‌సింగ్‌ చడ్డా’ (Lal Singh Chaddha). టాలీవుడ్‌ హీరో నాగ చైతన్య (Naga Chaitanya) కీలక పాత్ర పోషించారు. అద్వైత్‌ చందన్‌ దర్శకత్వం వహించిన ఈ సినిమాని తెలుగులో చిరంజీవి సమర్పిస్తున్నారు. ఈ చిత్రం ఆగస్టు 11న విడుదలకానున్న నేపథ్యంలో ఆమిర్‌, నాగ చైతన్య, చిరంజీవిని నాగార్జున ఇంటర్వ్యూ చేశారు. ఆ విశేషాలివీ..

నాగార్జున: ఈ చిత్రాన్ని ఎందుకు సమర్పిస్తున్నారు?

చిరంజీవి: ‘లాల్‌సింగ్‌ చడ్డా’ కథకి, నా జీవితానికి కనెక్షన్ ఉంది. 2019లో నేనూ నా భార్య సురేఖ జపాన్‌ వెళ్లాం. అక్కడి ఎయిర్‌పోర్ట్‌లో ఆమిర్‌ కలిశారు. ఎన్నో విశేషాల గురించి మాట్లాడుకున్నాం. అప్పుడే.. హాలీవుడ్‌ సినిమా ‘ఫారెస్ట్‌ గంప్‌’ రీమేక్‌ హక్కులు కొన్నట్టు తెలిపారు. అంత అద్భుత చిత్రానికి ఆమిర్‌ మాత్రమే న్యాయం చేయగలరని భావించా. అనుకున్నట్టుగానే ఈ సినిమా రీమేకైన ‘లాల్‌సింగ్‌ చడ్డా’లో తన మార్క్‌ నటన చూపించారు. అలా ఈ సినిమాని సమర్పించేందుకు ముందుకొచ్చా.

నాగార్జున: ఈ చిత్రంలో విభిన్న పాత్రలు పోషించారు కదా. దానికి ఎలాంటి కసరత్తులు చేశారు?

ఆమిర్‌: కొన్ని పాత్రల కోసం వర్కౌట్స్‌ చేసి బరువు తగ్గా. ఈ సినిమాలోని నా క్యారెక్టర్‌ శారీరకంగా కాదు మానసికంగా సవాలు విసిరింది. అమాయకంతో కూడిన పాత్ర అది. హావభావాలకే అధిక ప్రాధాన్యత ఉంటుంది.

నాగార్జున: తొలిసారి హిందీ సినిమాలో నటించటం ఎలా అనిపించింది?

నాగ చైతన్య: నాకు హిందీ తెలుసు. కానీ, ఓ నటుడిగా ఆ భాషలో నటించాలంటే ముందుగా కాస్త భయమేసింది. తెలుగు నేటివిటీలో సాగే పాత్ర కావడంతో కంఫర్ట్‌గా ఫీలయ్యా. నేనీ సినిమాలో గుంటూరు కుర్రాడిగా సుమారు 20నిమిషాలు కనిపిస్తా.

నాగార్జున: ఈ సినిమా ప్రయాణం ఎన్నాళ్లు సాగింది?

ఆమిర్‌: 14 ఏళ్ల క్రితమే ఈ సినిమా చేయాలనే ఆలోచన వచ్చింది. 8 సంవత్సరాల క్రితం రీమేక్‌ హక్కులు దక్కించుకున్నాం. త్వరలోనే మీ ముందుకు రాబోతున్నాం.

నాగార్జున: ఆమిర్‌ నటించిన సినిమాల్లో ఏదైనా మీకు రీమేక్‌ చేయాలనిపించిందా?

చిరంజీవి: నా విషయంలో.. ఆమిర్‌ ఖాన్‌ చిత్రాలను రీమేక్‌ చేస్తే ఎదురుదెబ్బే. ఆయన సినిమాలని టచ్‌ చేయకుండా ఉండటమే మంచిది. చాలామంది నటులు కొన్ని విషయాల్లో కాంప్రమైజ్‌ అవుతారు. ఆమిర్‌ ఖాన్‌ ఎట్టి పరిస్థితుల్లోనూ కాంప్రమైజ్‌ కారు. తాను అనుకున్న ఔట్‌పుట్‌ వచ్చేంత వరకూ ఆమిర్‌ నటిస్తూనే ఉంటారు.

మరిన్ని సంగతుల కోసం ఈ కింది వీడియో క్లిక్‌ చేయండి...

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని