Acharya: అలా చేసుంటే ‘ఆచార్య’ ఇప్పటికీ పూర్తయ్యేది కాదు: చిరంజీవి

‘ఆచార్య’ సినిమా సెట్‌ గురించి చిరంజీవి పంచుకున్న విశేషాలివీ.. కొరటాల శివ దర్శకత్వం వహించిన ఈ చిత్రం శుక్రవారం ప్రేక్షకుల ముందుకురానుంది.

Published : 28 Apr 2022 01:39 IST

ఇంటర్నెట్‌ డెస్క్: ఒక్కో సినిమా షూటింగ్‌ ఒక్కో విధంగా సాగుతుంది. కథ డిమాండ్‌ మేరకు కొన్ని సినిమాలు సంబంధిత ప్రాంతాల్లో (తాజ్‌మహల్‌, చార్మినార్‌ వంటివి) చిత్రీకరణ జరుపుకొంటే.. మరికొన్నింటికి అది సాధ్యమవదు. అందుకే ఆయా లొకేషన్లను తలపించే సెట్స్‌ తెరపైకొస్తుంటాయి. అలా ‘ఆచార్య’ కోసం ధర్మస్థలి అనే ఊరి సెట్‌ రూపొంది, ప్రేక్షకుల్లో ఆసక్తి రేకెత్తిస్తోంది. 20 ఎకరాల్లో కొన్ని కోట్ల రూపాయలతో రూపొందించిన ఈ టెంపుల్‌ టౌన్‌ గురించి చిత్ర దర్శకుడు కొరటాల శివ, కళా దర్శకుడు సురేశ్‌ సెల్వరాజన్‌ వివరించిన సంగతి తెలిసిందే. ఇప్పుడు కథానాయకుడు చిరంజీవి ఓ వీడియో ద్వారా ఆ సెట్ గురించి వివరించారు.

ఓ పురాతన దేవాలయం, చుట్టూ కొండలు, నదులు, గూడేలు.. ఇవన్నీ కలిసుండే ప్రాంతాన్ని వెతకడం కష్టమని, అందుకే కోకాపేటలో సెట్‌ను నిర్మించామని చిరంజీవి తెలిపారు. ఒకవేళ అసలైన లొకేషన్‌లో చిత్రీకరించాల్సి వస్తే ‘ఆచార్య’ ఇప్పటికీ నిర్మాణ దశలోనే ఉండేదన్నారు. సెట్‌ను అద్భుతంగా తీర్చిదిద్దారంటూ ఆర్ట్‌ డైరెక్టర్‌ సురేశ్‌ను కొనియాడారు. భారతీయ చిత్ర పరిశ్రమలో ఓ సెట్‌ను 20 ఎకరాల విస్తీర్ణంలో క్రియేట్‌ చేయడం ఇదే తొలిసారి అని పేర్కొన్నారు.

ధర్మస్థలి చుట్టూ తిరిగే ఈ  సినిమాలో చిరంజీవి తనయుడు, రామ్‌చరణ్‌ కీలక పాత్ర పోషించారు. ఆయన సరసన పూజాహెగ్డే నటించింది. మణిశర్మ స్వరాలందించారు. కొణిదెల ప్రొడక్షన్‌ కంపెనీ, మ్యాట్నీ ఎంటర్‌టైన్‌మెంట్‌ సంస్థలు సంయుక్తంగా నిర్మించిన ఈ సినిమా ఏప్రిల్‌ 29న విడుదలకానుంది.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని