
Acharya review: రివ్యూ: ఆచార్య
చిత్రం: ఆచార్య; నటీనటులు: చిరంజీవి, రామ్‌చరణ్, తనికెళ్ల భరణి, పూజా హెగ్డే, అజయ్, సోనూసూద్, సంగీత, జిషు సేన్గుప్త తదితరులు; సంగీతం: మణిశర్మ; సినిమాటోగ్రఫీ: తిరు; ఎడిటింగ్: నవీన్ నూలి; నిర్మాత: నిరంజన్‌రెడ్డి, అన్వేష్‌రెడ్డి, రామ్‌చరణ్; రచన, దర్శకత్వం: కొరటాల శివ; విడుదల: 29-04-2022
తండ్రీ తనయులు చిరంజీవి - రామ్‌చరణ్ కలిసి నటించిన సినిమాగా... వరుస విజయాలతో తక్కువ సమయంలోనే స్టార్ దర్శకుడు అనిపించుకున్న కొరటాల శివ సినిమాగా... మొదట్నుంచీ ప్రేక్షకుల్లో ప్రత్యేకమైన ఆసక్తిని రేకెత్తించింది ‘ఆచార్య’(Acharya). ఇక అభిమానులనైతే మరింతగా ఊరించిన కలయిక ఇది. కొబ్బరికాయ కొట్టినప్పట్నుంచే సినిమాపై అంచనాలు పెరిగిపోయాయి. కానీ, కరోనా కష్టాలతో చాలా రోజులు సెట్స్‌పైనే మగ్గిందీ చిత్రం. అయినా సరే, ప్రేక్షకుల్లో ఈ సినిమాపై ఏమాత్రం క్రేజ్ తగ్గలేదు. ఆకాశాన్ని తాకే అంచనాల మధ్య ఎట్టకేలకి ఈ వారం ప్రేక్షకుల ముందుకొచ్చింది. మరి చిత్రం అందుకు తగ్గట్టే ఉందా? చిరు-చరణ్ తెరపై చేసిన సందడి ఏంటి? ‘ఆచార్య’తో కొరటాల చెప్పించిన గుణపాఠాలు ఏంటి?
కథేంటంటే: 800 యేళ్ల చరిత్ర ఉన్న టెంపుల్ టౌన్ ధర్మస్థలి. ధర్మానికి... ఆయుర్వేద వైద్యానికి ప్రసిద్ధి. అక్కడ అధర్మం చోటు చేసుకున్నప్పుడు అమ్మవారే ఏదో రూపంలో వచ్చి ధర్మాన్ని నిలబెడుతుంటుంది. అమ్మవారి పాదాల చెంత ధర్మమే పరమావధిగా నివసిస్తున్న ఓ చిన్న తండాకి పాదఘట్టం అని పేరు. ఆ పాదఘట్టం, దానిపక్కన ఉన్న సిద్ధవనంపై కొంతమంది అక్రమార్కుల కన్ను పడుతుంది. టెంపుల్ టౌన్ ధర్మస్థలిపై కూడా బసవ (సోనూసూద్) పాగా వేస్తాడు. ఎదురొచ్చినవాళ్లని అంతం చేస్తూ అక్రమాలు కొనసాగిస్తుంటాడు. పాదఘట్టం జనాల్ని, ధర్మస్థలిని కాపాడేవారే లేరా అనుకునే సమయంలో కామ్రేడ్ ఆచార్య (చిరంజీవి)(Chiranjeevi) వస్తాడు. ఇంతకీ ఆచార్య ఎవరు?ఆయన్ని ఎవరు పంపించారు? ధర్మస్థలిలోనే పెరిగిన సిద్ధ (రామ్‌చరణ్)(Ram charan)కీ, ఆచార్యకీ సంబంధమేమైనా ఉందా? (Acharya Review)తదితర విషయాల్ని తెరపై చూడాల్సిందే.
ఎలా ఉందంటే?: తీసింది తక్కువ సినిమాలే అయినా, తన మార్క్ రచనతో ప్రేక్షకులపై బలమైన ప్రభావం కనిపించేలా చేశారు కొరటాల శివ(Koratala siva). ఆయన్నుంచి సినిమా.. అదీ కూడా చిరంజీవి(Chiranjeevi)లాంటి అగ్ర కథానాయకుడు తోడయ్యాడు కాబట్టి ఓ కొత్త కథో, లేదంటే ఇంకేదైనా బలమైన అంశమో ఊహిస్తారు ప్రేక్షకులు. కానీ కొరటాల మాత్రం ఈసారి తన రచనలోని బలం కంటే కూడా... చిరంజీవి, రామ్‌చరణ్‌ల స్టార్ వ్యాల్యూనే ఎక్కువగా నమ్ముకున్నట్టున్నారు. వాళ్ల ఇమేజ్‌కి తగ్గ కమర్షియల్ అంశాల్ని మాత్రమే జోడించి ‘ఆచార్య’(Acharya Review)ని తీర్చిదిద్దారు. ఇందులో కాలం చెల్లిన కథ, కథనాలు తప్ప కొరటాల మార్క్ అంశాలు ఎక్కడా కనిపించవు. కాకపోతే టెంపుల్ టౌన్ అంటూ ప్రేక్షకుల్ని ధర్మస్థలి ప్రపంచంలోకి తీసుకెళ్లి కూర్చోబెట్టారు. అదొక్కటే కొత్త నేపథ్యాన్ని ఆవిష్కరించినట్టు అనిపిస్తుంది. కానీ, కథంతా దాని చుట్టూనే తిప్పడంతో ఒక దశ దాటిన తర్వాత ధర్మస్థలి కూడా పాతబడిపోతుంది.
పాదఘట్టం పరిచయం తర్వాత, ఆచార్య (Acharya Review) ధర్మస్థలిలోకి అడుగు పెట్టడంతో అసలు కథ మొదలవుతుంది. ధర్మస్థలిలో అధర్మానికి కారణమవుతున్న బసవ ముఠా ఆగడాల్ని ఆచార్య అడ్డుకోవడమే ప్రథమార్ధమంతా. పోరాట ఘట్టాలు, పాటలతో సినిమా ముందుకు సాగుతుంది. కథలో మాత్రం ఎక్కడా ఆసక్తి రేకెత్తదు. విరామానికి ముందు సిద్ధ పాత్ర పరిచయం కావడంతో ద్వితీయార్ధంపై కాసిన్ని ఆశలు రేకెత్తుతాయి. సిద్ధగా రామ్‌చరణ్(Ram charan) కాసేపు ప్రేక్షకుల దృష్టిని ఆకర్షిస్తాడు. కానీ, కాసేపటి తర్వాత తొలి భాగంలో చూసినట్టుగానే మళ్లీ అదే పాదఘట్టం, అక్రమార్కుల ఆగడాలే ఆవిష్కృతమవుతాయి. రామ్‌చరణ్ - పూజాహెగ్డేల మధ్య సన్నివేశాలైనా కొత్తదనాన్ని పంచుతాయనుకుంటే వాటిలోనూ బలం లేదు. సిద్ధ ఎవరు? తను ఎలా ధర్మస్థలిలోకి వచ్చాడనే విషయాలు కాసిన్ని భావోద్వేగాల్ని పంచుతాయి.(Acharya Review) సిద్ధపై బసవ గ్యాంగ్ దాడి తర్వాత కథ అడవుల్లోకి మారుతుంది. ధర్మస్థలికి ముప్పు పొంచి ఉందని అర్థమైనా... దాన్ని మరిచిపోయి ఆచార్యతో కలిసి సిద్ధ ప్రయాణం చేయడంతో కథ పక్కకు మళ్లినట్టు అనిపిస్తుంది. చిరంజీవి(Chiranjeevi), రామ్‌చరణ్‌ల పాత్రల్ని, కథ నడిచే టెంపుల్ టౌన్నీ, ఇతరత్రా పాత్రల్ని బలంగానే డిజైన్ చేసినా... కథ కథనాల పరంగా మాత్రం దర్శకుడి పనితనం తేలిపోయింది. దాంతో ప్రతీ సన్నివేశం గ్రాండియర్‌గా కనిపించినా దాని తాలూకు ప్రభావం మాత్రం ప్రేక్షకుడిపై మచ్చుకైనా కనిపించదు. (Acharya Review) చిరంజీవి, రామ్‌చరణ్ కలిసి కనిపించే సన్నివేశాలు మాత్రం అభిమానులకి కిక్‌నిచ్చేలా ఉంటాయి. ముఖ్యంగా భలే భలే బంజారా పాటలో ఇద్దరి నృత్యం చాలా బాగుంటుంది.
ఎవరెలా చేశారంటే?: చిరంజీవి(Chiranjeevi) కామ్రేడ్ ఆచార్యగా చక్కటి అభినయం ప్రదర్శించారు. ఆయన కనిపించిన విధానంతోపాటు పోరాట ఘట్టాలు, డ్యాన్సులతో అలరించారు. రామ్‌చరణ్(Ram charan) ద్వితీయార్ధం మొత్తం కనిపిస్తారు. వాళ్లిద్దరివే బలమైన పాత్రలు. సోనూసూద్, జిషూసేన్ గుప్తా ప్రధాన ప్రతినాయకులుగా కనిపిస్తారు. పూజాహెగ్డే పాత్రకిపెద్దగా ప్రాధాన్యం లేదు. సిద్ధని ప్రేమించిన యువతిగా కనిపిస్తుందంతే. నీలాంబరి పాటలో అందంగా కనిపించింది. రెజీనా శానాకష్టం అంటూ సాగే ప్రత్యేకగీతంలో సందడి చేసింది.
సాంకేతికంగా సినిమా ఉన్నతంగా ఉంది. మణిశర్మ పాటలు, నేపథ్య సంగీతంతో సినిమాపై ప్రభావం చూపించారు. తిరు కెమెరా పనితనం మెప్పిస్తుంది. ధర్మస్థలి నేపథ్యాన్ని ఆవిష్కరించిన తీరు చాలా అందంగా ఉంటుంది. నిర్మాణం పరంగా చక్కటి హంగులు కనిపిస్తాయి. దర్శకుడు కొరటాల శివ ధర్మం అంటూ చెడుపై మంచి సాధించే ఓ సాధారణ కథని చెప్పారు. ఇప్పటిదాకా తీసిన ప్రతీ సినిమాతోనూ తనదైన ముద్ర వేసిన కొరటాల శివ.... ఈ సినిమాతో మాత్రం కొత్తగా ఏమీ చెప్పలేకపోయారు.
బలాలు
+ చిరంజీవి.. రామ్‌చరణ్ పాత్రలు
+ ధర్మస్థలి నేపథ్యం
+ అభిమానుల్ని అలరించే పాటలు
బలహీనతలు
- కథ, కథనం
- భావోద్వేగాలు పండకపోవడం
చివరిగా: ‘ఆచార్య’.. పాఠం గుణపాఠం
గమనిక: ఈ సమీక్ష సమీక్షకుడి దృష్టి కోణానికి సంబంధించింది. ఇది సమీక్షకుడి వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే!
ఇవీ చదవండి
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
India News
Kaali: ‘కాళీ’ డాక్యుమెంటరీ పోస్టర్ వివాదాస్పదం.. దర్శకురాలిపై మండిపడుతోన్న నెటిజన్లు
-
India News
Digital India: ఆన్లైన్ వ్యవస్థతో ‘క్యూ లైన్’ అనే మాటే లేకుండా చేశాం: మోదీ
-
Sports News
IND vs ENG: జో రూట్ హాఫ్ సెంచరీ.. 200 దాటిన ఇంగ్లాండ్ స్కోర్
-
India News
Tamil Nadu: తమిళనాడుకు స్వయం ప్రతిపత్తి.. సంచలన వ్యాఖ్యలు చేసిన డీఎంకే ఎంపీ
-
India News
Eknath Shinde: పెట్రోల్, డీజిల్‌పై వ్యాట్ తగ్గిస్తాం.. శిందే కీలక ప్రకటన
-
Movies News
Vishal: ఫైట్ సీన్స్ చేస్తుండగా కుప్పకూలిన హీరో విశాల్
ఎక్కువ మంది చదివినవి (Most Read)
- Cyber Crime: ఆన్లైన్ మోసానికి సాఫ్ట్వేర్ ఉద్యోగిని బలి!
- ఈ రోజు రాశి ఫలం ఎలా ఉందంటే? (04-07-2022)
- భార్యతో అసహజ శృంగారం.. రూ.కోటి ఇవ్వాలని డిమాండ్
- బిగించారు..ముగిస్తారా..?
- Hyderabad News: నన్ను లోనికి రానివ్వలేదనేది దుష్ప్రచారమే: యాదమ్మ
- Raghurama: ఏపీ పోలీసులు ఫాలో అవుతున్నారని రైలు దిగిపోయిన ఎంపీ రఘురామ
- IND vs ENG: బుమ్రా స్టన్నింగ్ క్యాచ్.. బెన్‌స్టోక్స్‌ను ఎలా ఔట్ చేశాడో చూడండి
- Shiv Sena: టార్గెట్ ఠాక్రే.. అసలు సిసలు ‘మహా’ రాజకీయ వ్యూహం..!
- cook yadamma : ఔరౌర పెసర గారె.. అయ్యారె సకినాలు..!
- ప్రేమ పెళ్లి చేసుకున్నాడని మట్టుబెట్టారు