Chiranjeevi: ‘రంగమార్తాండ’ చూసి భావోద్వేగానికి గురయ్యా: చిరంజీవి

కృష్ణవంశీ (KrishnaVamsi) తెరకెక్కించిన ‘రంగమార్తాండ’ (Rangamarthanda) ను మెచ్చుకున్నారు నటుడు చిరంజీవి (Chiranjeevi). సినిమా తనకెంతో నచ్చిందని అన్నారు.

Updated : 25 Mar 2023 10:43 IST

హైదరాబాద్‌: ‘రంగమార్తాండ’ (Rangamarthanda)పై మెగాస్టార్‌ చిరంజీవి (Chiranjeevi) ప్రశంసల వర్షం కురిపించారు. ప్రతి ఒక్కరూ చూడాల్సిన చిత్రమిదని అన్నారు. భావోద్వేగాలతో నిండిన ఇలాంటి అపురూప చిత్రాలను అందరూ ఆదరించాలని కోరారు. ఈ మేరకు చిత్రబృందాన్ని మెచ్చుకుంటూ ఆయన శనివారం ఉదయం ట్వీట్స్‌ చేశారు. 

‘‘రంగమార్తాండ’ (Rangamarthanda) చూశాను. ఈ మధ్యకాలంలో వచ్చిన ఒక మంచి చిత్రం ఇది. ప్రతి ఆర్టిస్ట్‌కు తన జీవితాన్నే కళ్ల ముందు చూస్తున్న భావన కలుగుతుంది. ఈ చిత్రం ఓ ‘త్రివేణీ సంగమం’లా అనిపించింది. కృష్ణవంశీ లాంటి ఓ క్రియేటివ్‌ దర్శకుడు, ప్రకాశ్‌రాజ్‌ లాంటి జాతీయ ఉత్తమ నటుడు,  హాస్యబ్రహ్మానందం..  వారి పనితనం, ముఖ్యంగా ఆ ఇద్దరు అద్భుతమైన నటుల నటన ఎంతో భావోద్వేగానికి గురి చేసింది. బ్రహ్మానందం ఇలాంటి ఉద్విగ్నభరితమైన పాత్ర చేయడం ఇదే తొలిసారి. సెకండాఫ్‌ మొత్తం అప్రయత్నంగానే కన్నీరు వచ్చేసింది. ఇలాంటి చిత్రాలను అందరూ చూసి ఆదరించాలి. రసవత్తరమైన చిత్రాన్ని తెరకెక్కించిన కృష్ణవంశీ, ప్రకాశ్‌రాజ్‌, రమ్యకృష్ణ.. చిత్ర యూనిట్‌ మొత్తానికి నా అభినందనలు’’ అని చిరంజీవి (Chiranjeevi) పేర్కొన్నారు.

మరాఠీలో మంచి విజయాన్ని అందుకున్న ‘నటసామ్రాట్‌’కు రీమేక్‌గా ఈ సినిమా రూపుదిద్దుకుంది. రంగస్థల నటుడిగా పేరుపొందిన రాఘవరావు (ప్రకాశ్‌రాజ్‌).. తన జీవితంలో ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొన్నాడు? అనే ఆసక్తికర అంశాలతో ఈ సినిమా తెరకెక్కింది. రాఘవరావు సతీమణిగా రమ్యకృష్ణ నటించగా.. ఆయన స్నేహితుడి పాత్రలో బ్రహ్మానందం కీలకపాత్ర పోషించారు. రాహుల్‌ సిప్లిగంజ్‌, శివాత్మిక, అనసూయ.. తదితరులు ఆయా పాత్రల్లో నటించి మెప్పించారు. సినిమాకు వస్తోన్న రెస్పాన్స్‌, మరీ ముఖ్యంగా బ్రహ్మానందం పాత్రకు వస్తోన్న ఆదరణ చూసి.. ఇటీవల చిరంజీవి, రామ్‌చరణ్‌ ఆయన్ని సన్మానించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని