HBD Chiranjeevi: అలాంటి చోట నేను ఉండలేను.. వాటిని వినలేను: చిరంజీవి

చిరంజీవి పుట్టిన రోజు సందర్భంగా ప్రత్యేక కథనం. మెగాస్టార్‌ గురించి ఈ విషయాలు మీకు తెలుసా...

Published : 21 Aug 2022 15:55 IST

ఆయన ‘స్వయంకృషి’తో ఎదిగిన నటుడు. తన యాక్షన్‌, డ్యాన్స్‌లతో ఎందరిలోనో స్ఫూర్తినింపిన ‘ఆచార్యు’డు. ‘రిక్షావోడు’గా మారాలన్నా ‘స్టేట్‌ రౌడీ’గా కనిపించాలన్నా ‘గూండా’ వేషమైనా ‘హీరో’ పాత్రయినా.. ప్రతి ‘ఛాలెంజ్‌’ని స్వీకరించి ‘విజేత’గా నిలిచాడు. కామెడీ, ఎమోషన్‌.. ఇలా నవరసాలన్నింటిలో ‘మాస్టర్‌’ అనిపించుకున్నాడు. అభిమానుల విషయంలో ఆయన ఓ ‘ఖైదీ’. బాక్సాఫీసు వసూళ్ల ‘వేట’లో ‘మగ మహారాజు’. స్టార్‌గానే కాకుండా సామాజిక సేవతోనూ ‘అందరివాడు’ అనిపించుకున్న ఆయన ఎవరో కాదు చిరంజీవి (Chiranjeevi). సోమవారం ఆయన పుట్టిన రోజు సందర్భంగా కొన్ని విశేషాలు చూద్దాం.. (Happy Birthday Chiru)

తొలి భారతీయ నటుడిగా..

ఇప్పుడంటే టెక్నాలజీ బాగా పెరిగింది. నటులంతా ట్విటర్‌, ఇన్‌స్టాగ్రామ్‌, ఫేస్‌బుక్‌ తదితర మాధ్యమాల ద్వారా అభిమానులకు దగ్గరవుతున్నారు. వ్యక్తిగత, వృత్తిపరమైన విశేషాలన్నీ క్షణాల్లోనే వారితో పంచుకుంటున్నారు. కొన్నేళ్ల క్రితం కొందరు సెలబ్రిటీలు వెబ్‌సైట్లపై ఆసక్తి చూపేవారు, ఆయా సైట్లలో తమ వివరాల్ని పొందుపరిచేవారు. ఇప్పటికీ కొందరు తారలు తమ సొంత వెబ్‌సైట్లు, యాప్‌లను కొనసాగిస్తున్నారు. అలా.. వ్యక్తిగతంగా వెబ్‌సైట్‌ ఉన్న తొలి భారతీయ నటుడిగా చిరంజీవి నిలిచారు. చిరు సంగతుల కోసం https://www.kchiranjeevi.com/ ను సందర్శించవచ్చు.


తొలి దక్షిణాది నటుడిగా..

ప్రపంచ సినీ రంగంలో ప్రతిష్ఠాత్మకంగా భావించే అవార్డు ‘ఆస్కార్‌’. ఈ అకాడమీ అవార్డులు అందుకోవడం ఎంత గొప్ప విషయమో ఆ వేడుకలో అతిథిగా పాల్గొనే ఆహ్వానం పొందటం అంతకన్నా గొప్ప విశేషం. ఈ అవకాశం అందుకున్న తొలి దక్షిణాది నటుడిగా చిరంజీవి ఘనత సాధించారు. ఆయన 1987లో ఆస్కార్‌ అవార్డు ప్రదానోత్సవ వేడుకలకు హాజరయ్యారు.


పన్ను చెల్లింపులో అవార్డు..

1999-2000 ఆర్థిక సంవత్సరంలో అత్యధిక పన్ను చెల్లించిన వ్యక్తిగా చిరంజీవి ‘సమ్మాన్‌’ అనే అవార్డు పొందారు. 2002లో అప్పటి కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి చిరుకి ఈ అవార్డుని అందించారు.


సెప్టెంబరు 22న నటుడిగా పుట్టినరోజు!

చిరంజీవికి తన పుట్టిన రోజైన ఆగస్టు 22 ఎంత ప్రత్యేకమో సెప్టెంబరు 22 అంతే. ఎందుకంటే కొణిదెల శివశంకర్‌ వరప్రసాద్‌ అనే వ్యక్తిని చిరంజీవిగా తెలుగు ప్రేక్షకులకి పరిచయం చేసింది ఈ రోజే. చిరంజీవి నటించిన తొలి చిత్రం ‘పునాది రాళ్లు’ అయినా ముందుగా ‘ప్రాణం ఖరీదు’ చిత్రంతో ప్రేక్షకులకి పరిచయం అయ్యారు. 1978 సెప్టెంబరు 22న ఈ సినిమా విడుదలైంది.


సుప్రీమ్‌ హీరో.. మెగాస్టార్‌

ఒకే హీరోకి రెండు బిరుదులు ఉండటం అరుదు. ఆ అరుదైన గౌరవం చిరంజీవికి దక్కింది. తొలినాళ్లలో ‘సుప్రీమ్‌ హీరో’గా పేరొందిన ఆయన ఆ తర్వాత ‘మెగాస్టార్‌’గా విశేష క్రేజ్‌ సంపాదించుకున్నారు. 1988లో వచ్చిన ‘మరణ మృదంగం’తో చిరంజీవి.. మెగాస్టార్‌గా మారారు. ఆ చిత్ర నిర్మాణ కె. ఎస్‌. రామారావు చిరుకి ఆ బిరుదునిచ్చారు. అంతకు ముందు వరకూ ఆయన నటించిన సినిమా టైటిల్స్‌లో కొన్నింటిలో చిరంజీవి అని, మరికొన్ని చిత్రాల్లో సుప్రీమ్‌ హీరో అని కనిపిస్తుంది. చిరు ‘సుప్రీమ్‌ హీరో’గా కనిపించిన చివరి చిత్రం ‘ఖైదీ నంబరు. 786’. సుప్రీమ్‌ హీరో, మెగాస్టార్‌.. ఈ రెండింటిపైనా పాటలు రావటం విశేషం. ఈ స్థాయికి చేరుకునే ముందు చిరంజీవి ఆలోచనలు ఎలా ఉండేవో ఆయన మాటల్లోనే..


ఇండస్ట్రీలో అడుగుపెట్టకముందు..

‘‘నెగెటివ్‌ వైబ్రేషన్స్‌ అంటే నాకు అస్సలు ఇష్టం ఉండదు. అలాంటి చోట నేను ఉండలేను. జీవితంలో ఏదో సాధించాలని చెన్నై వెళ్లి, ఏమీ సాధించలేక, నిరుత్సాహంతో కూరుకుపోయిన వ్యక్తులు పాండీబజార్‌లో చాలామంది కనిపించేవాళ్లు. అటువైపు వెళ్లేందుకూ నేను సాహించలేదు. ఫెయిల్యూర్‌ స్టోరీస్‌ వినటం వల్ల.. మనం కూడా పోరాడే శక్తిని కోల్పోతామేమో అని అనిపించేది. నా మనసులో ఎప్పుడూ ‘నేను స్టార్‌ని అవుతా. తప్పకుండా మంచి స్థాయికి చేరుకుంటా’ అనే ఆలోచన ఉండేది. నేనిప్పుడు ఈ స్థాయిలో ఉన్నానంటే నాపై నాకున్న నమ్మకమే’’


కెరీర్‌ ప్రారంభంలో..

‘‘నటుడిగా ఇంత సుదీర్ఘ ప్రయాణం చేస్తానని నేను ఊహించలేదు. అప్పట్లో పెద్ద పెద్ద లక్ష్యాలు ఉండేవి కావు. చేతిలో ఉన్న సినిమాకి నేను ఎంత వరకు న్యాయం చేయగలను? నా అత్యుత్తమ ప్రదర్శన ఎలా ఇవ్వగలను? ఈ చిత్రంతో నన్ను నేను కొత్తగా ఎలా ఆవిష్కరించుకోగలను? అనే ఆలోచించేవాణ్ని. అంతే తప్ప రేపటి పరిస్థితి ఏంటి? భవిష్యత్తులో నా స్థానం ఎక్కడ ఉంటుంది? అనే విషయాన్ని ఎప్పుడూ పట్టించుకోలేదు’’


వారి కోసం ఎంతైనా కష్టపడతా..

‘‘అభిమానులే నాకు స్ఫూర్తి. వారి కోసం ఎంతైనా కష్టపడాలి అనిపిస్తుంటుంది. సినిమాసినిమాతో వారికి కొత్త అనుభూతి పంచాలి అని అనుకుంటుంటా. అలా.. ‘పసివాడి ప్రాణం’తో బ్రేక్‌ డ్యాన్సుల్ని ప్రవేశ పెట్టా. ‘బావగారు బాగున్నారా’ చిత్రంలో జంగీజంప్‌ చేశా. ఈ సినిమాలోని ఓ సన్నివేశం కోసం 240 అడుగుల ఎత్తునుంచి దూకా. దాన్ని చూసి ప్రేక్షకులు ఆనందించినప్పుడు నా కష్టాన్ని మర్చిపోయా’’


ఆయన వల్లే నా డ్యాన్స్‌ స్టైల్‌ మారింది

‘‘డ్యాన్సుల విషయంలో..  వెంకన్నబాబు అనే మేనేజరు నన్ను మార్చారు. అది నా ఐదో సినిమా చిత్రీకరణ అనుకుంటా.. నేను డ్యాన్స్‌ చేసి సెట్స్‌ నుంచి బయటకు వస్తుంటే అక్కడున్న వారంతా చప్పట్లు కొడుతూ నన్ను ప్రశంసించారు. ఆ పక్కనే ఉన్న వెంకన్నబాబుకి దగ్గరికి వెళ్లి, ‘ఎలా ఉంది? నా పెర్ఫామెన్స్‌’ అని అడిగా. ‘ఆ.. అందులో ఏముంది? నీ వెనక డ్యాన్సర్లు ఏం చేశారో, అదే నువ్వు చేశావ్‌. నీ ప్రత్యేకత చూపించాలి కదా?’ అని అన్నారు. కొరియోగ్రాఫర్లు చెప్పినదానికి అదనంగా ఇంకేదో చేయాలని ఆ క్షణమే అనిపించింది’’


అందుకే వేడుకలకు..

ఆహ్వానం అందటమే ఆలస్యం.. తానెంత బిజీగా ఉన్నా ఇతర హీరోల సినిమాల వేడుకకూ చిరు తప్పకుండా హాజరవుతారు. ముఖ్యంగా చిన్న సినిమాల ఈవెంట్‌కి ప్రాధాన్యం ఇస్తారు. ఈ విషయమై ఓసారి స్పందిస్తూ.. ‘‘దీన్ని నేను గర్వంగా ఫీలవడం లేదు. నేను పరిశ్రమలోకి అడుగుపెట్టిన సమయంలో ఎవరైనా ప్రోత్సహిస్తే బాగుండు అనిపించింది. ఇప్పుడు ఎవరైనా చిన్న హీరోలు నా దగ్గరకు వచ్చి వేడుకకు పిలిస్తే వారిలో నన్ను నేను చూసుకుంటుంటా. వారిని వెన్నుతట్టి నాకు చేతనైనంత ప్రోత్సహిస్తా’’ అని చిరంజీవి తెలిపారు. 


పెద్దగా కాదు కళామ్మతల్లి ముద్దు బిడ్డగా..

ఇండస్ట్రీలో నెలకొన్న పలు సమస్యలపై చిరంజీవి స్పందిస్తుంటారు. ఆ క్రమంలోనే ప్రస్తుతం.. ‘తెలుగు చలన చిత్ర పరిశ్రమకు పెద్దదిక్కు చిరంజీవి’ అని కొందరు అంటుంటే ‘నేను కళామ్మతల్లి ముద్దు బిడ్డగా ఉంటా. పెద్దగా కాదు’ అని ఆయన స్పష్టం చేశారు. మెరుగైన ఫలితాల కోసం ఆలోచనా విధానాన్ని మార్చుకోవాలని దర్శకులకు సూచిస్తుంటారు. ‘‘హీరోలు తప్ప మిగిలిన నటులకు వారు నటించే సినిమాల కథ తెలియదు. ప్రతి ఒక్కరికీ స్క్రిప్టుని పూర్తిగా వినిపించి, సంబంధిత వర్క్‌షాప్స్‌ నిర్వహిస్తే అద్భుతమైన ఔట్‌పుట్‌ వస్తుంది’’ అని చిరంజీవి ఇటీవల ఓ ఇంటర్వ్యూలో తెలిపారు.


Read latest Movies News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని