Chiranjeevi: భుజాలు తడుముకుంటే నేనేమీ చేయలేను: చిరంజీవి వ్యాఖ్య

ప్రస్తుత రాజకీయ నేతలపై ‘గాడ్‌ ఫాదర్‌’ సినిమాలో ఎలాంటి సెటైర్లు వేయలేదని ప్రముఖ నటుడు చిరంజీవి స్పష్టం చేశారు.

Published : 05 Oct 2022 02:03 IST

హైదరాబాద్‌: ప్రస్తుత రాజకీయ నేతలపై ‘గాడ్‌ ఫాదర్‌’ సినిమాలో ఎలాంటి సెటైర్లు వేయలేదని ప్రముఖ నటుడు చిరంజీవి స్పష్టం చేశారు. బుధవారం ‘గాడ్‌ఫాదర్‌’ సినిమా విడుదలవుతున్న నేపథ్యంలో హైదరాబాద్‌లో చిత్రబృందం ప్రెస్‌మీట్‌ ఏర్పాటు చేసింది. ఈ సందర్భంగా మీడియా ప్రతినిధులు అడిగిన ప్రశ్నలకు చిరంజీవి ఆసక్తికర సమాధానాలిచ్చారు. 

‘గాడ్‌ఫాదర్‌’ సినిమాలో మాతృక అయిన ‘లూసిఫర్‌’ కథ ఆధారంగానే డైలాగులు ఉన్నట్లు చిరంజీవి తెలిపారు. ఇటీవల సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా ‘నేను రాజకీయం నుంచి దూరంగా ఉన్నాను. కానీ రాజకీయం నా నుంచి దూరం కాలేదు’ అంటూ ఓ డైలాగ్‌ను చిరంజీవి ట్వీట్‌ చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆ డైలాగులను మీడియా ప్రతినిధులు ప్రస్తావించారు. ఆ డైలాగులు విని ఎవరైనా భుజాలు తడుముకుంటే తానేమీ చేయలేనని చిరంజీవి వ్యాఖ్యానించారు. భవిష్యత్‌లో తన తమ్ముడు, జనసేన అధినేత పవన్‌కల్యాణ్‌కు తన మద్దతు ఉంటుందని చెప్పారు. ఆంధ్రప్రదేశ్‌కు అంకితభావం కలిగిన నాయకుడు అవసరమని.. ఆ అవకాశాన్ని ప్రజలు పవన్‌కు ఇస్తారని భావిస్తున్నట్లు తెలిపారు.

‘‘ఈ సినిమా అవకాశం నాకు వచ్చేలా చేసిన ఎన్వీ ప్రసాద్‌, చరణ్‌, చిరంజీవికి ధన్యవాదాలు. రేపు ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుందంటే ఎంతో ఆనందంగా ఉంది. ‘లూసిఫర్‌’ గురించి మాట్లాడేవారందరికీ నేను చెప్పేది ఒక్కటే.. నేను ఆ సినిమాకి పెద్ద అభిమానిని. నా మనసులో ఆ చిత్రానికి ప్రత్యేక స్థానం ఉంది. ఏడాదిన్నర పాటు వర్క్‌ చేసి.. దీన్ని రూపొందించా. దీనికి ‘గాడ్‌ఫాదర్‌’ అనే టైటిల్‌ పెట్టడానికి తమన్‌ ఒక కారణం. ఆయన అందించిన మ్యూజిక్‌ మరో స్థాయిలో ఉంది. కేవలం, చిరు కళ్ల కోసమే మూడు సీన్స్‌ చేశాం. ఇంటర్వెల్‌ సీన్‌కు థియేటర్‌ దద్దరిల్లిపోతుంది. చిరంజీవి అంటే నాకెంత ప్రేమ ఉందో ఈ సినిమాతో చూపించా. ఇది కేవలం ఆయన ఇమేజ్‌ కోసం రాసిన స్క్రీన్‌ప్లే. అభిమానులందరికీ నేను చెప్పేది ఒక్కటే.. ఈ సినిమా మీకు నచ్చితే.. దీనికంటే పెద్ద హిట్‌ ఇండస్ట్రీలో మరొకటి లేదని మీరు చూపించాలి ’’

- మోహన్‌రాజా

‘‘ఈ సినిమా కోసం పనిచేసిన వారందరికీ కృతజ్ఞతలు చెప్పడానికే ఈ ప్రెస్‌మీట్‌ పెట్టాం. ‘మీరెందుకు ఇంత సింపుల్‌గా ఉంటారు?’ అని అందరూ అంటుంటారు. నన్ను గొప్ప శిల్పంగా మలిచింది నటీనటులు, దర్శకనిర్మాతలు, ఇతర సాంకేతిక బృందం. వాళ్లందరి కృషి వల్లే నాకు ఈ ఇమేజ్‌ వచ్చింది. ఒకే తరహా సినిమాలు చేస్తున్నప్పుడు ఏదైనా కొత్తగా చేయాలనే నా తపనని చరణ్‌ ఎప్పుడూ గమనిస్తుండేవాడు. ఓరోజు చరణ్‌ వచ్చి.. ‘‘నాన్నా.. లూసిఫర్‌ చూశావా? మీతో చేయాలని అనుకుంటున్నా’’ అని చెప్పాడు. చరణ్‌ చెప్పాక మరోసారి సినిమా చూశా. కాస్త సందేహాలు వచ్చాయి. మోహన్‌రాజా ఈ సినిమా విషయంలో చేసిన పెద్ద మార్పు వల్లే ఈ సినిమా విషయంలో తృప్తి కలిగింది. కథని ఎంతో పకడ్బందీగా తెరకెక్కించారు. ఈ సినిమా తప్పకుండా మీ ప్రేమ సంపాదించుకుంటుందని నమ్ముతున్నా. సినిమా కోసం అందరూ కష్టపడి పనిచేశారు’’

- చిరంజీవి

‘గ్యాంగ్‌లీడర్‌’ నుంచి ‘గాడ్‌ఫాదర్‌’ వరకూ మీ అభిమాన గళం ఒకేలా ఉంది. దానిపై మీ అభిప్రాయం ఏమిటి?

చిరంజీవి: తొమ్మిదేళ్లు విరామం తీసుకుని సినిమా చేసినప్పుడు అభిమానులు నాపై చూపించే ప్రేమ అలాగే ఉంటుందా? అనే అనుమానం కలిగింది. నా 150వ సినిమా ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ విజయవాడలో చేసినప్పుడు అక్కడికి వచ్చిన అభిమాన గళాన్ని చూసి.. ‘‘ఇది కదా ఇన్నాళ్లు మిస్ అయ్యింది’’ అనిపించింది. సినిమా ద్వారా మొదలైన వారి ప్రేమ వ్యక్తిగతంగా మారింది.

ఈ సినిమా చేసేటప్పుడు మీరు ఎలాంటి ఛాలెంజ్‌లు ఎదుర్కొన్నారు?

చిరంజీవి: ప్రతి కథకు ఒక సోల్‌ ఉంటుంది. దానితో మనం కనెక్ట్‌ కాగలిగితే సినిమా భవిష్యత్తు ఏమిటో అర్థమైపోతుంది. పాత్రల విషయంలో అవతలి వ్యక్తులు చేసిందే చేయాలని ఎప్పుడూ అనుకోను.

సత్యదేవ్‌, లక్ష్మీభూపాల్‌.. ఇలా ఫ్యాన్‌బాయ్స్‌తో కలిసి పనిచేయడం ఎలా ఉంది?

చిరంజీవి: భగవంతుడు ఇచ్చిన వరంగా, అదృష్టంగా భావిస్తున్నా. మనతో పనిచేసే టెక్నిషియన్స్‌, నటులు మన అభిమానులైతే కళ్లు మూసుకుని సినిమా చేసేవచ్చు. ఆ సినిమా తప్పకుండా సూపర్‌హిట్‌ అవుతుంది. అని ఓ సీనియర్‌ నటుడు నాతో ఓసారి చెప్పారు. అలాంటిది ఇప్పుడు వీళ్లందరితో కలిసి పనిచేయడం నాకెంతో ఆనందంగా ఉంది.

రాజకీయ నాయకులను టార్గెట్‌ చేస్తూ డైలాగ్‌లు పెట్టారు?

చిరంజీవి: ప్రస్తుతం ఉన్న రాజకీయ వ్యవస్థ, నాయకులను ఉద్దేశించి డైలాగ్‌లు వేయాలనే ఉద్దేశం మాకు లేదు. ఒరిజినల్‌లో ఉన్న దాన్నే ఇక్కడ తెలుగు వారికి చేరువయ్యేలా రాశాం. పొలిటికల్‌గా సెటైర్లు వేయాలని మేము ఎప్పుడూ భావించలేదు. కథ ఆధారంగానే డైలాగ్‌లు రాశాం. ఎవరైనా భుజాలు తడుముకుంటే నేను ఏమీ చేయలేను.

మీరు రాజకీయాల్లోకి మళ్లీ వెళ్తున్నట్లు వార్తలు వస్తున్నాయి?

చిరంజీవి: ఇలాంటి మాటలు ఎవరు అన్నారో కానీ వాళ్లు గొప్ప క్రియేటర్స్‌. వాళ్లు కనుక పరిశ్రమకు వచ్చి నాకు కథలు అందించగలిగితే అద్భుతమైన సినిమాలు వస్తాయి.

‘లూసిఫర్‌’ చేయడానికి.. అందులో మీకు బాగా నచ్చిన పాయింట్ ఏమిటి?

చిరంజీవి: సినిమా చూస్తే అందరికీ తెలుస్తుంది. ఇప్పుడే చెప్పలేను. ఈ సినిమా రేర్‌ ఫీట్‌. పొలిటికల్‌, కుటుంబం.. రెండింటి మిళితమే ఈ సినిమా. అది నాకు బాగా నచ్చింది.

తెలుగు సినిమా ఇప్పుడు ఇండియన్‌ సినిమా అయిపోయింది. బాలీవుడ్‌ వాళ్లు తెలుగులో చేయడానికి ఆసక్తి కనబరుస్తున్నారు. దాని గురించి ఏమైనా చెప్పగలరు?

చిరంజీవి: ఇటీవల ముంబయి ఈవెంట్‌లో సల్మాన్‌ని ఇదే ప్రశ్న అడిగారు. దానికి ఆయన.. ‘‘వాళ్లు నార్త్‌కి వచ్చేస్తున్నారు నేను సౌత్‌కి వెళ్లొద్దా’’ అని చమత్కారంగా చెప్పాడు. కానీ ఆ చమత్కారం వెనుక ఒక సత్యం ఉంది. నటీనటులు సమన్వయంతో హద్దులు చెరిగిపోయి ఇండియన్‌ సినిమాగా రూపాంతరం చెందుతున్నందుకు అందరూ గర్వించాలి.

నాగార్జునతో మీకు మంచి స్నేహం ఉంది. ఆయన నటించిన ‘ది ఘోస్ట్‌’ మీరు నటించిన ‘గాడ్‌ఫాదర్‌’ ఒకేరోజు రావడంపై ఈ అభిప్రాయం?

చిరంజీవి: ఆనందంగా ఉంది. పండక్కి ఇద్దరం కలిసి భోజనానికి వెళ్తున్నట్టు ఉంది.

సత్యదేవ్‌ని ప్రతినాయకుడిగా తీసుకోవడానికి కారణం ఏమిటి?

చిరంజీవి: సత్యదేవ్‌ నటించిన సినిమాలు నేను చూశా. తెలుగువాడు కాదు కన్నడ నటుడు అనుకున్నా. ఓసారి ఇంటికి పిలిపించి మాట్లాడాను అప్పుడు తెలిసింది అతను తెలుగువాడని.. నాకు అభిమాని అని. ఈ క్యారెక్టర్‌ కోసం వేరే భాషల్లోని నటుల్ని తీసుకురావాలని అనుకున్నారు. నేను సత్యదేవ్‌ పేరు సూచించాను. మోహన్‌రాజా ఓకే అన్నారు. సత్యదేవ్‌ అద్భుతమైన నటుడు.

గతంలో ఓ ఇంటర్వ్యూలో మీ మద్దతు జనసేనకే అని చెప్పారు. ఇప్పటికీ అదే మాట మీద ఉన్నారా?

చిరంజీవి: నా తమ్ముడు నిబద్ధత కలిగిన వ్యక్తి. నిబద్ధత ఉన్న నాయకుడు రావాలి. అందుకు నా సపోర్ట్‌ తమ్ముడికి ఉంటుంది. పరిపాలించే అవకాశాన్ని కూడా భవిష్యత్తులో ప్రజలు తనకి ఇస్తారనే అనుకుంటున్నా. అలాంటి రోజు రావాలని కోరుకుంటున్నా.

‘గాడ్‌ఫాదర్‌’ మలయాళంలో రిలీజ్‌ కానుందా?

చిరంజీవి: లేదు. మేము మొదట ఈ చిత్రాన్ని తెలుగు, హిందీలోనే రిలీజ్‌ చేస్తున్నాం. కొన్ని వారాల తర్వాత తమిళంలో రిలీజ్‌ చేస్తున్నాం. కానీ మలయాళంలో చేయడం లేదు. ఎవరో అభిమానులు మలయాళీ పోస్టర్లు క్రియేట్‌ చేశారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని