Kaikala Satyanarayana: సత్యనారాయణకు ఆ రెండూ ప్రాణం: చిరంజీవి

కైకాల సత్యనారాయణ మరణం తనని ఎంతగానో కలచి వేసిందని చిరంజీవి అన్నారు. ఆయనతో తనకున్న మధుర జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటూ సోషల్‌మీడియాలో పోస్ట్‌ పెట్టారు.  

Updated : 23 Dec 2022 11:11 IST

హైదరాబాద్‌: కైకాల సత్యనారాయణ (Kaikala Satyanarayana) మరణం పట్ల సంతాపం ప్రకటించారు నటుడు చిరంజీవి (Chiranjeevi). ఆయన మరణం తనని ఎంతగానో కలచివేసిందన్నారు. నటన, రుచికరమైన భోజనం.. ఈ రెండూ ఆయనకు ప్రాణమని చిరు చెప్పారు. ఆయనతో తనకున్న అనుబంధాన్ని గుర్తు చేసుకుంటూ సుదీర్ఘ పోస్ట్‌ పెట్టారు.

‘‘తెలుగు సినీ కళామతల్లి ముద్దుబిడ్డ, నవరస నటనా సార్వభౌముడు కైకాల సత్యనారాయణ మరణం నన్ను ఎంతగానో కలచివేస్తోంది. తెలుగు సినీ రంగానికే కాదు.. భారత చిత్ర పరిశ్రమకు గర్వకారణమైన అత్యంత ప్రతిభావంతుడైన నటుడాయన. ఆయన పోషించినన్ని వైవిధ్యమైన పాత్రలు బహుశా భారతదేశంలో మరో నటుడు పోషించి ఉండరు. ఆయనతో నేను ఎన్నో చిత్రాల్లో నటించాను. అలా ఆయన వ్యక్తిత్వాన్నిదగ్గర నుంచి పరిశీలించే అవకాశం నాకు దక్కింది. డైలాగులు చెప్పడంలో ఆయనది ప్రత్యేక పంథా. నిష్కల్మషమైన మనసున్న మనిషి. ఎటువంటి అరమరికలు లేకుండా ఉన్నది ఉన్నట్లు చెప్పేవారు. నన్ను ‘తమ్ముడు’ అంటూ తోడబుట్టినవాడిలా ఆదరించారు. మా మధ్య అనుబంధం, ఆత్మీయత అంతకంతకూ బలపడుతూ వచ్చాయి. ఆయనతో నాకు ఎన్నో మధుర జ్ఞాపకాలు ఉన్నాయి.

నటన, రుచికరమైన భోజనం రెండూ ఆయనకు ప్రాణం. నా శ్రీమతి సురేఖ చేతి వంటను ఆయన ఎంతో ఇష్టంగా తినేవారు. గతేడాది, ఈ ఏడాది ఆయన జన్మదినం సందర్భంగా ఇంటికి వెళ్లి శుభాకాంక్షలు తెలియజేయడం నాకు మిలిగిన సంతృప్తి. అప్పుడు ఆయన సురేఖతో.. ‘‘అమ్మా.. ఉప్పు చేప వండి పంపించు’’ అని అన్నప్పుడు.. ‘‘మీరు త్వరగా కోలుకోండి ఉప్పు చేపతో మంచి భోజనం చేద్దాం’’ అని చెప్పాం. ఆ క్షణాన ఆయన చిన్న పిల్లాడిలా ఎంతో సంతోషపడ్డారు.

సత్యనారాయణ గొప్ప సినీ సంపదను అందరికీ అందించి వెళ్లిపోయారు. ఆయన ఆత్మకు శాంతి కలగాలని భగవంతుణ్ణి కోరుకుంటూ.. ఆయన కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను’’ అని చిరంజీవి రాసుకొచ్చారు.

చిరంజీవి నటించిన ‘విజేత’, ‘కొండవీటి రాజా’, ‘మగధీరుడు’, ‘చక్రవర్తి’, ‘జేబుదొంగ’, ‘మంచిదొంగ’, ‘యముడికి మొగుడు’, ‘ఖైదీ నం :786’, ‘రుద్రవీణ’, ‘అత్తకు యముడు అమ్మాయికి మొగుడు’, ‘స్టేట్‌ రౌడీ’, ‘కొదమసింహాం’, ‘రౌడీ అల్లుడు’, ‘ఘరానా మొగుడు’, ‘మెకానిక్‌ అల్లుడు’, ‘బావగారు బాగున్నారా’ తదితర చిత్రాల్లో సత్యనారాయణ కీలకపాత్రలు పోషించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని