Godfather review: రివ్యూ: గాడ్‌ ఫాదర్‌

Godfather review: చిరంజీవి, సల్మాన్‌ కీలక పాత్రల్లో నటించిన ‘గాడ్‌ఫాదర్‌’ సినిమా ఎలా ఉందంటే?

Updated : 05 Oct 2022 11:42 IST

Godfather review: చిత్రం: గాడ్‌ఫాదర్‌; నటీనటులు: చిరంజీవి, సల్మాన్‌ఖాన్‌, నయనతార, సత్యదేవ్‌, పూరిజగన్నాథ్, మురళీశర్మ తదితరులు; సంగీతం: ఎస్‌ఎస్‌ తమన్‌; సినిమాటోగ్రఫీ: నీరవ్‌ షా; ఎడిటింగ్‌: మార్తాండ్‌ కె. వెంకటేశ్‌; నిర్మాత: రామ్‌చరణ్‌, ఆర్బీ చౌదరి. ఎన్వీ ప్రసాద్‌; స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: మోహన్‌రాజా; విడుదల: 05-10-2022

చిరంజీవి సినిమా వస్తుందంటే ఆయన అభిమానులకే కాదు.. ప్రతి తెలుగు ప్రేక్షకుడికీ ఆసక్తి ఉంటుంది. రీఎంట్రీ తర్వాత వరుస సినిమాలు చేస్తున్న ఆయనకు ఈ ఏడాది ‘ఆచార్య’ కాస్త గట్టిగానే షాక్ ఇచ్చింది. అయితే, ఈ దసరాకు ‘గాడ్‌ఫాదర్‌’గా తనదైన వినోదాన్ని పంచడానికి సిద్ధమయ్యారు. మలయాళంలో ఘన విజయం సాధించిన ‘లూసిఫర్‌’ రీమేక్‌గా మోహన్‌రాజా దీన్ని తెరకెక్కించారు. మరి కింగ్‌ మేకర్‌గా చిరు ఎలా చేశారు? (Godfather review) మాతృకతో పోలిస్తే ఏవి మెరుగ్గా ఉన్నాయి? సల్మాన్‌, నయన్‌, సత్యదేవ్‌ పాత్రలు అదనపు ఆకర్షణ తెచ్చాయా?

కథేంటంటే: రాష్ట్ర ముఖ్యమంత్రి పి.కె.రామదాసు (పీకేఆర్‌) మరణం తర్వాత రాజకీయ శూన్యం ఏర్పడుతుంది. సీఎంగా ఎవరిని ఎంపిక చేయాలన్నదానిపై జన జాగృతి పార్టీ (జేజేపీ) తర్జనభర్జన పడుతుంటుంది. పీకేఆర్‌ స్థానంలో అధికారాన్ని హస్తగతం చేసుకుని సీఎం కావాలని అతడి అల్లుడు జైదేవ్‌ (సత్యదేవ్‌) భావిస్తాడు. అందుకు పార్టీలోని కొందరు దురాశపరులతో చేతులు కలుపుతాడు. అయితే, పీకేఆర్‌కు అత్యంత సన్నిహితుడు, ప్రజాదరణ కలిగిన నాయకుడు బ్రహ్మ తేజ (చిరంజీవి) మాత్రం జైదేవ్‌ సీఎం కాకుండా అడ్డు నిలబడతాడు. జన జాగృతి పార్టీ నుంచి, అసలు ఈ లోకం నుంచే బ్రహ్మను పంపించడానికి జైదేవ్‌ కుట్రలు పన్నుతాడు. మరి ఆ కుట్రలను బ్రహ్మ ఎలా ఎదుర్కొన్నాడు? జైదేవ్‌ నీచుడన్న విషయం జైదేవ్‌ భార్య సత్యప్రియ (నయనతార)కు ఎలా తెలిసింది? రాష్ట్ర పాలన దురాశపరుల చేతిలో పడకుండా బ్రహ్మ ఎలా అడ్డుకున్నాడు? ఇంతకీ బ్రహ్మకు, పీకేఆర్‌కు ఉన్న సంబంధం ఏంటి? (Godfather review) మధ్యలో మసూద్‌ భాయ్‌ (సల్మాన్‌) ఎవరు? తెలియాలంటే సినిమా చూడాల్సిందే.

ఎలా ఉందంటే: ‘‘గాడ్‌ ఫాదర్‌’ స్క్రీన్‌ప్లే కొత్తగా, ఆశ్చర్యకరంగా ఉంటుంది. మలయాళంలో చూడని పది పాత్రలు ఇందులో వేరే రూపంలో ఉంటాయి. ఇవన్నీ సర్‌ప్రైజింగ్‌గా ఉంటాయి. ఓపిక ఉంటే ‘లూసిఫర్‌’ని మరోసారి చూసి రండి’’ - ఇదీ ఇటీవల ఇంటర్వ్యూలో దర్శకుడు మోహన్‌రాజా చెప్పిన విషయం. తన స్క్రీన్‌ప్లే, మార్పులపై ఎంత నమ్మకంతో చెప్పారో దాన్నే తెరపై చూపించడంలో విజయం సాధించారు దర్శకుడు. ‘లూసిఫర్‌’ చూసిన వాళ్లు కూడా ‘గాడ్‌ఫాదర్‌’ను ఎంజాయ్‌ చేస్తారు. పీకేఆర్‌ మరణంతో సినిమా మొదలు పెట్టిన దర్శకుడు, కొద్దిసేపటికే అసలు కథేంటి? సినిమాలో పాత్రల తీరుతెన్నులు వివరంగా చెప్పేశారు. ఇక ప్రేక్షకుడు చూడాల్సింది తెరపై కనిపించే రాజకీయ చదరంగమే.

ఈ చదరంగంలో రెండు బలమైన పావులుగా ఒకవైపు బ్రహ్మగా చిరంజీవి, జైదేవ్‌గా సత్యదేవ్‌లు నిలబడ్డారు. ఒక్కో సన్నివేశంలో ఒక్కొక్కరిది పై చేయి ఉంటుంది. అయితే, బ్రహ్మ పాత్ర కీలకం కావడంతో అంతర్లీనంగా అతడే ఒక మెట్టుపైన ఉంటాడు. (Godfather review) చిరంజీవి కనిపించే ప్రతి సన్నివేశమూ ఆయన్ను ఎలివేట్‌ చేసిన విధానం స్టైలిష్‌గా బాగుంది. ఆ సన్నివేశాలకు తమన్‌ నేపథ్యం సంగీతం థియేటర్‌ను ఓ ఊపు ఊపేసింది.

జన జాగృతి పార్టీ పగ్గాలు బ్రహ్మ చేపట్టకుండా జైదేవ్‌, అతడి మద్దతుదారులు చేసే పయత్నాలు, వాటిని బ్రహ్మ తిప్పి కొట్టడం ఇలా ప్రతి సన్నివేశమూ నువ్వా-నేనా అన్నట్లు ప్రథమార్ధం సాగుతుంది. విరామ సన్నివేశానికి ముందు జైలులో చిరు ఫైట్‌, సంభాషణలు అభిమానులు మెచ్చేలా ఉన్నాయి. ఆ తర్వాత సల్మాన్‌ రాకతో అసలు ట్విస్ట్‌ మొదలవుతుంది. అసలు బ్రహ్మ ఎవరు? మసూద్‌ గ్యాంగ్‌ అతడిని ఎందుకు సపోర్ట్‌ చేస్తుంది? జైదేవ్‌ కుట్రలను బ్రహ్మ ఎలా ఛేదించుకుంటూ వచ్చాడు? ఇలా ద్వితీయార్ధం ఒక రెగ్యులర్‌ కమర్షియల్‌ ఫార్మాట్‌లో సాగుతుంది. ప్రథమార్ధంలో ఉన్నంత డ్రామా, ఎలివేషన్స్‌ ద్వితీయార్ధానికి వచ్చే సరికి కాస్త రొటీన్‌ అనిపిస్తాయి. (Godfather review) పతాక సన్నివేశాల్లో పెద్దగా మెరుపులేవీ ఉండవు. అయితే, ఒకవైపు చిరంజీవి, మరోవైపు సత్యదేవ్‌లు తమ నటనతో అవి కనిపించకుండా చేశారు.  ప్రతి సన్నివేశాన్నీ చిరు అభిమానులు మెచ్చేలా మోహన్‌రాజా తీర్చిదిద్దారు. హీరోయిజం ఎలివేట్‌ అయ్యేలా యాక్షన్‌ సన్నివేశాలను తీర్చిదిద్దిన విధానం బాగుంది.

ఎవరెలా చేశారంటే: బ్రహ్మతేజ పాత్రలో ప్రజాదరణ కలిగిన నాయకుడిగా, మాస్‌ హీరోగా చిరంజీవి ఒదిగిపోయారు. తన అనుభవాన్ని అంతా రంగరించి చాలా సెటిల్డ్‌గా నటించారు. ఇక్కడ మోహన్‌లాల్‌ నటనతో చిరంజీవి నటన పోల్చాల్సిన అవసరం లేదు. ఇద్దరూ అగ్ర కథానాయకులే. ఎవరి నటనా ప్రతిభ వారిది.  ప్రతినాయకుడు జైదేవ్‌గా సత్యదేవ్‌ మెప్పించారు. స్టైలిష్‌ విలనిజం చూపించారు. సినిమాలో సత్యదేవ్‌ ఎక్కడా కనిపించలేదు. జైదేవ్‌గా అధికార దాహం కలిగిన విలన్‌గా ఒదిగిపోయారు. నయనతార, మురళీశర్మ, సునీల్‌, బ్రహ్మాజీ వారి పాత్రలకు న్యాయం చేశారు. పూరి జగన్నాథ్‌, షఫీ పాత్రలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. తమన్‌ సంగీతం ఓకే. నేపథ్య సంగీతంతో సినిమాను ఎలివేట్‌ చేయడంలో అతడికి అతడే సాటి. చిరు పరిచయ సన్నివేశాలు, యాక్షన్‌ సన్నివేశాలు బాగా ఎలివేట్‌ అయ్యాయి. (Godfather review) నీరవ్‌ షా సినిమాటోగ్రఫీ డీసెంట్‌. మార్తాండ్‌ కె.వెంకటేశ్‌ ఎడిటింగ్‌ షార్ప్‌గా ఉంది. ఇక్కడ ప్రధానంగా చెప్పుకోవాల్సిన మరో వ్యక్తి రచయిత లక్ష్మీ భూపాల. ఇప్పటికే విడుదల చేసిన ప్రచార చిత్రాల్లో చిరు పలికిన సంభాషణలు ఆకట్టుకోగా.. థియేటర్‌లో విజిల్స్‌ వేయించాయి. వర్తమాన రాజకీయాలపై వేసిన సెటైర్లు బాగున్నాయి. చిరంజీవి అభిమానులు ఏం కోరుకుంటారో వాటన్నింటినీ రంగరించి దర్శకుడు మోహన్‌రాజా ‘లూసిఫర్‌’ను రీమేక్‌ చేశారు. దసరా సెలవుల్లో ‘గాడ్‌ఫాదర్‌’ మాస్‌ ఎంటర్‌టైనర్‌గా అలరిస్తాడు.

బలాలు

+ చిరంజీవి, సత్యదేవ్‌ల నటన

+ దర్శకత్వం

+ తమన్ నేపథ్య సంగీతం

బలహీనతలు

- ద్వితీయార్ధంలో కొన్ని సన్నివేశాలు

- రొటీన్‌ క్లైమాక్స్‌

చివరిగా: గాడ్‌ఫాదర్‌.. మాస్‌ బుల్డోజర్‌

గమనిక: ఈ సమీక్ష సమీక్షకుడి దృష్టి కోణానికి సంబంధించింది. ఇది సమీక్షకుడి వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే!


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని