Chiranjeevi: చిరంజీవికి ప్రతిష్ఠాత్మక పురస్కారం

గోవాలో జరుగుతున్న 53వ అంతర్జాతీయ భారత చలన చిత్రోత్సవాల్లో  ప్రముఖ కథానాయకుడు చిరంజీవికి ప్రతిష్టాత్మక పురస్కారం దక్కింది.

Updated : 21 Nov 2022 07:15 IST

గోవాలో జరుగుతున్న 53వ అంతర్జాతీయ భారత చలన చిత్రోత్సవాల్లో  ప్రముఖ కథానాయకుడు చిరంజీవికి (Chiranjeevi) ప్రతిష్టాత్మక పురస్కారం దక్కింది. ఇండియన్‌ ఫిలిం పర్సనాలిటీ ఆఫ్‌ ది ఇయర్‌ - 2022 (IFFI) పురస్కారానికి చిరంజీవిని ఎంపిక చేస్తున్నట్టు కమిటీ ప్రకటించింది. నాలుగు దశాబ్దాలుగా నటుడిగా 150కిపైగా సినిమాలు చేసి ప్రజాదరణ పొందారని, ఆయనది విశిష్టమైన కెరీర్‌ అని చిరంజీవిని అభినందిస్తూ కేంద్రమంత్రి అనురాగ్‌ ఠాకూర్‌ ట్వీట్‌ చేశారు. గతంలో ఈ అవార్డుని అమితాబ్‌ బచ్చన్‌, హేమమాలిని, రజనీకాంత్‌, ఇళయరాజా తదితర హేమాహేమీలు గెల్చుకున్నారు. అన్నయ్య ఈ పురస్కారానికి ఎంపికవడం పట్ల పవన్‌కల్యాణ్‌ సంతోషం వ్యక్తం చేస్తూ శుభాకాంక్షలు తెలిపారు.

చిరంజీవికి కిషన్‌రెడ్డి అభినందన

ఈనాడు, హైదరాబాద్‌: ఇండియన్‌ ఫిలిం పర్సనాలిటీ అవార్డుకు ఎంపికైన సినీ నటుడు చిరంజీవిని కేంద్ర పర్యాటక శాఖ మంత్రి జి.కిషన్‌రెడ్డి (Kishan Reddy) ఆదివారం రాత్రి ఓ ప్రకటనలో అభినందించారు. తెలుగువారితో పాటు ప్రపంచవ్యాప్తంగా అభిమానుల్ని సంపాదించుకున్న చిరంజీవి ఈ అవార్డుకు వన్నె తీసుకువచ్చారనడంలో అతిశయోక్తి లేదని అన్నారు. ‘చిరంజీవి నటప్రస్థానం ఇకపైనా ఇలాగే కొనసాగాలి. సేవా కార్యక్రమాల్ని కూడా ఇదే స్ఫూర్తితో ముందుకు తీసుకెళ్లాలి’ అని ఆకాంక్షించారు.


వీరయ్య పార్టీ

సంక్రాంతి సందడి కోసం శరవేగంగా సిద్ధమవుతున్నాడు ‘వాల్తేరు వీరయ్య’ (waltair veerayya). ఒక పక్క చిత్రీకరణ సాగుతుండగా, మరోవైపు ప్రచార హంగామాని షురూ చేసింది చిత్రబృందం. బాస్‌ పార్టీ సాంగ్‌ పేరుతో ఓ గీతాన్ని ఈనెల 23న విడుదల చేయనున్నారు. చిరంజీవి కథానాయకుడిగా మైత్రీ మూవీ మేకర్స్‌ పతాకంపై తెరకెక్కుతున్న చిత్రమిది. శ్రుతిహాసన్‌ కథానాయిక. రవితేజ ఓ శక్తిమంతమైన పాత్రని పోషిస్తున్నారు. బాబీ కొల్లి (కె.ఎస్‌.రవీంద్ర) దర్శకుడు. నవీన్‌ యెర్నేని, వై.రవిశంకర్‌ నిర్మాతలు. పార్టీ సాంగ్‌లో చిరంజీవితోపాటు ఊర్వశి రౌతేలా ఆడిపాడారు. చిత్రబృందం తాజాగా విడుదల చేసిన ప్రచార చిత్రంలో చిరంజీవి గళ్ల లుంగీ, పూల చొక్కాతో ఒకప్పటి తన మాస్‌ అవతారాన్ని గుర్తు చేస్తున్నారు. దేవిశ్రీప్రసాద్‌ స్వరకల్పనలోని ఈ గీతానికి శేఖర్‌ నృత్య రీతులు సమకూర్చారని, ఈ పాట గుర్తుండిపోయేలా ఉంటుందని సినీవర్గాలు తెలిపాయి. వాణిజ్యాంశాలతో, యాక్షన్‌ ప్రధానంగా రూపొందుతున్న ఈ సినిమాకి కథ, మాటలు: బాబీ, స్క్రీన్‌ప్లే: కోన వెంకట్‌, చక్రవర్తి రెడ్డి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని