Chiranjeevi: ‘గాడ్‌ ఫాదర్‌’ పవర్‌ఫుల్‌ డైలాగ్‌.. క్రియేటర్‌ ఈయనే..!

‘ఇన్నాళ్లూ రోడ్డు కాంట్రాక్టులు, ఇసుక కాంట్రాక్టులు, కొండ కాంట్రాక్టులు, నేల కాంట్రాక్టులు, నీళ్ల కాంట్రాక్టులు, మందు కాంట్రాక్టులు...

Published : 29 Sep 2022 17:13 IST

హైదరాబాద్‌: ‘‘ఇన్నాళ్లూ రోడ్డు కాంట్రాక్టులు, ఇసుక కాంట్రాక్టులు, కొండ కాంట్రాక్టులు, నేల కాంట్రాక్టులు, నీళ్ల కాంట్రాక్టులు, మందు కాంట్రాక్టులు అంటూ ప్రజల సొమ్ము తిన్నారు ఒక్కొక్కరూ. ఇక నుంచి మీరు పీల్చే గాలి కాంట్రాక్టు నేను తీసుకుంటున్నా. ఇందులో ఒకటే రూల్‌.. ఇక నుంచి ప్రజలకు సుపరిపాలన అందించాలనే నిర్ణయం. తప్పుచెయ్యాలంటే భయం మాత్రమే మీ మనసుల్లో ఉండాలి. లేదంటే.. మీ ఊపిరి గాల్లో కలిసిపోతుంది’’.. బుధవారం సాయంత్రం అనంతపురంలో జరిగిన ‘గాడ్‌ ఫాదర్‌’ (God Father) ప్రీ రిలీజ్‌ వేడుకలో మెగాస్టార్‌ చిరంజీవి (Chirajeevi) చెప్పిన పవర్‌ఫుల్‌ డైలాగ్‌ ఇది.

ఈవెంట్‌లో భాగంగా ‘గాడ్ ఫాదర్‌’లోని ఈ డైలాగ్‌ చెప్పి వేడుకకు వచ్చిన అభిమానులను ఆయన అలరించారు. దీంతో ఈ డైలాగ్‌ కాస్త ఇప్పుడు అంతటా వైరల్‌గా మారింది. డైలాగ్‌ అద్భుతంగా ఉందంటూ అభిమానులు చెప్పుకొంటున్నారు. ఈ నేపథ్యంలో ఈ చిత్రానికి మాటల రచయితగా పనిచేసిన వ్యక్తిని చిరు అందరికీ పరిచయం చేశారు. ‘‘గాడ్ ఫాదర్’ చిత్రానికి పవర్‌ఫుల్ డైలాగ్స్ సమకూర్చిన లక్ష్మీభూపాల్‌కు నా అభినందనలు! మంచి ప్రతిభ ఉన్న నీకు మంచి భవిష్యత్తు ఉంటుందని నమ్ముతున్నా’’ అని పేర్కొన్నారు. లక్ష్మీ భూపాల్‌ గతంలో ‘నేనే రాజు నేనే మంత్రి’, ‘ఓ బేబీ’, ‘గోవిందుడు అందరివాడేలే’ వంటి చిత్రాలకు మాటల రచయితగా పనిచేశారు. ఇక, మలయాళంలో సూపర్‌హిట్‌ అందుకున్న ‘లూసిఫర్‌’కు రీమేక్‌గా ‘గాడ్‌ ఫాదర్‌’ సిద్ధమైంది. మోహన్‌రాజా దర్శకుడు. సల్మాన్‌ఖాన్‌, నయనతార, సత్యదేవ్‌ కీలకపాత్రలు పోషించారు. దసరా కానుకగా అక్టోబర్‌ 5న ఈసినిమా విడుదల కానుంది.



Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని