Chiranjeevi: ముఖ్యమంత్రి జగన్‌తో లంచ్‌ చేయనున్న చిరంజీవి

ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి(ys jagan mohan reddy)ని అగ్ర కథానాయకుడు చిరంజీవి(Chiranjeevi) గురువారం కలవనున్నారు.

Updated : 13 Jan 2022 13:21 IST

అమరావతి: ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి(ys jagan mohan reddy)ని అగ్ర కథానాయకుడు చిరంజీవి(Chiranjeevi) గురువారం కలవనున్నారు. మధ్యాహ్నం భోజన విరామ సమయంలో కలిసేందుకు చిరుకు సీఎం జగన్‌ అపాయింట్‌మెంట్‌ ఇచ్చారు. ఇరువురు కలిసి లంచ్‌ చేయనున్నారు. సీఎం జగన్‌ను చిరంజీవి కలవడంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ప్రస్తుతం చిత్ర పరిశ్రమలో నెలకొన్న సమస్యల గురించి చిరు చర్చించే అవకాశం ఉంది. ముఖ్యంగా సినిమా టికెట్ల వివాదంపై ప్రధానంగా వీరి మధ్య చర్చ జరగవచ్చు. రోజురోజుకీ ఈ వివాదం ముదురుతున్న నేపథ్యంలో దీనికి ఫుల్‌స్టాప్‌ పెట్టాలని చిరు భావిస్తున్నారట. ఇందులో భాగంగానే జగన్‌ను కలిసి పరిస్థితి వివరించనున్నారట. చిత్ర పరిశ్రమపై పలువురు వైకాపా నాయకులు చేస్తున్న అనుచిత వ్యాఖ్యలను ఈ సందర్భంగా సీఎం జగన్‌ దృష్టికి చిరంజీవి తీసుకెళ్లే అవకాశం ఉంది.

ఏపీలో సినిమా టికెట్‌ ధరలను తగ్గిస్తూ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై పునరాలోచన చేయాలని గత కొన్ని రోజులు సినీ పరిశ్రమ వర్గాలు కోరుతున్నాయి. ఈ అంశంపై ఇప్పటికే పలువురు దర్శకులు, నిర్మాతలు విడతల వారీగా ప్రభుత్వంతో చర్చించారు. ఇటీవల దర్శకుడు రామ్‌గోపాల్‌వర్మ మంత్రి పేర్ని నానితో భేటీ అయి, టికెట్‌ ధరల తగ్గింపు వల్ల ఇండస్ట్రీ కలిగే నష్టాన్ని ఆయన దృష్టికి తీసుకొచ్చారు. మరోవైపు టికెట్‌ ధరల వ్యవహారంపై ప్రభుత్వం కమిటీని కూడా నియమించింది. ఈ క్రమంలో ముఖ్యమంత్రి జగన్‌ను చిరంజీవి కలవటం ఆసక్తికరంగా మారింది. సినిమా రంగంలో నెలకొన్న సమస్యలపై ఇరువురు ప్రధానంగా చర్చించనున్నట్లు తెలుస్తోంది. కొవిడ్‌ వల్ల సినిమా థియేటర్‌ యజమానులు, డిస్ట్రిబ్యూటర్లు, కార్మికులు తీవ్రంగా నష్టపోతున్నారన్న విషయాన్ని సీఎం దృష్టికి తీసుకెళ్లే అవకాశం ఉంది. సమస్యకు వీలైనంత త్వరగా పరిష్కారం చూపించాలని జగన్‌ను చిరు కోరనున్నట్లు తెలుస్తోంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని