Chiranjeevi: ‘వాల్తేరు వీరయ్య’ రేటింగ్స్‌పై చిరంజీవి జోకులు

‘వాల్తేరు వీరయ్య’ (Waltair Veerayya) సక్సెస్‌లో భాగమైన ప్రతి అభిమానికి కృతజ్ఞతలు చెప్పారు మెగాస్టార్‌ చిరంజీవి (Chiranjeevi). సినిమా రిలీజ్‌ అయినప్పుడు పలు వెబ్‌సైట్స్‌ ఇచ్చిన రేటింగ్‌పై ఆయన సరదాగా వ్యాఖ్యలు చేశారు.

Published : 23 Jan 2023 12:10 IST

హైదరాబాద్‌: ‘వాల్తేరు వీరయ్య’ (Waltair Veerayya)కు పలు వెబ్‌సైట్స్‌ ఇచ్చిన రేటింగ్స్‌పై మెగాస్టార్‌ చిరంజీవి(Chiranjeevi) జోకులు వేశారు. ఎవర్నీ విమర్శించాలనే ఉద్దేశంతో తాను ఈ జోకులు వేయడం లేదని.. కేవలం సరదాగానే చెబుతున్నానని అన్నారు. ‘‘వాల్తేరు వీరయ్య’ యూఎస్‌ ప్రీమియర్స్‌ చూసి ఇక్కడ పలు వెబ్‌సైట్స్‌లో సినిమా రివ్యూలు రాశారు. పలువురు ఈ చిత్రానికి 2.5 రేటింగ్‌ ఇచ్చారు. వాటిని చూసి.. బాధపడకూడదని అనుకున్నాను. ఎందుకంటే ఈ సినిమాపై నాకు పూర్తి నమ్మకం ఉంది. ‘ఘరానా మొగుడు’, ‘గ్యాంగ్‌ లీడర్‌’, ‘రౌడీ అల్లుడు’, ‘అన్నయ్య’ చిత్రాల తర్వాత అంతటి పూర్తిస్థాయి ఎంటర్‌టైన్‌మెంట్‌ ఉన్న చిత్రమిది. కాబట్టి వాళ్లు ఇచ్చే రేటింగ్‌ను పట్టించుకోవద్దని నిర్ణయించుకున్నా. కానీ, ఆ తర్వాతే తెలిసింది 2.5 అంటే 2.5 మిలియన్ల డాలర్లు అని. యూఎస్‌లో అంత రెవెన్యూ వస్తుందని వాళ్లు ముందే చెప్పారని.. మేమే పొరపాటు పడ్డామని తెలిసింది’’ అంటూ చిరంజీవి నవ్వులు పూయించారు.

‘గాడ్‌ఫాదర్‌’ తర్వాత మెగాస్టార్‌ నటించిన చిత్రం ‘వాల్తేరు వీరయ్య’. బాబీ దర్శకత్వం వహించిన ఈసినిమాలో రవితేజ కీలకపాత్ర పోషించారు. కేథరిన్‌, శ్రుతిహాసన్‌, ప్రకాశ్‌ రాజ్‌, బాబీ సింహా, రాజేంద్రప్రసాద్‌ తదితరులు ముఖ్యభూమిక పోషించారు. సంక్రాంతి కానుకగా జనవరి 13న విడుదలైన ఈసినిమా అంతటా మంచి వసూళ్లు రాబడుతోంది. యూఎస్‌లోనూ ఈ సినిమాకు ఘన విజయం దక్కింది. ఇప్పటికే ఈ సినిమా అమెరికాలో 2 మిలియన్‌ డాలర్ల క్లబ్‌లోకీ ప్రవేశించింది. ఈ విషయంపై ఆనందం వ్యక్తం చేసిన చిరు తాజాగా అమెరికాలో వివిధ ప్రాంతాల్లో నివసిస్తోన్న పలువురు అభిమానులతో జూమ్‌ కాల్‌లో మాట్లాడారు. తన చిత్రానికి మంచి విజయాన్ని ఇచ్చిన ఫ్యాన్స్‌కు కృతజ్ఞతలు చెప్పారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని