Updated : 16 Sep 2021 14:55 IST

సైదాబాద్‌ ఘటన నిందితుడు రాజు ఆత్మహత్య.. ‘దేవుడు ఉన్నాడు’

హైదరాబాద్‌: సైదాబాద్‌ బాలిక హత్యాచార ఘటనలో నిందితుడిగా ఉన్న పల్లకొండ రాజు ఆత్మహత్య చేసుకున్న సంగతి తెలిసిందే. స్టేషన్‌ ఘన్‌పూర్‌ సమీపంలోని నష్కల్‌  రైల్వే ట్రాక్‌పై రాజు మృతదేహాన్ని గుర్తించారు. చేతిపై పచ్చబొట్టు ఆధారంగా నిందితుడిని నిర్ధారించారు. కాగా, రాజు ఆత్మహత్య చేసుకున్నాడన్న విషయం తెలిసి పలువురు సినీ ప్రముఖులు, నెటిజన్లు సామాజిక మాధ్యమాల వేదికగా స్పందించారు. పాపకు న్యాయం జరిగిందంటూ ట్వీట్లు చేశారు. ఈ సందర్భంగా అగ్ర కథానాయకుడు చిరంజీవి ట్విటర్‌ వేదికగా స్పందించారు.

‘‘అభంశుభం తెలియని ఆరేళ్ల చిన్నారిపై హత్యాచారానికి పాల్పడిన కిరాతకుడు రాజు తనకు తానే శిక్షించుకోవడం బాధిత కుటుంబంతో సహా అందరికీ కొంత ఊరట కలిగిస్తుంది. ఈ సంఘటనపై మీడియా, పౌర సమాజం గొప్పగా స్పందించాయి. ఇటువంటి సంఘటనలు పునరావృతం కాకుండా ఉండేందుకు ప్రభుత్వంతో పాటు, పౌర సమాజం చొరవ చూపాలి. అటువంటి కార్యక్రమం ఎవరు చేపట్టినా వారికి నా సహకారం ఉంటుంది. చిన్నారి కుటుంబాన్ని ప్రభుత్వం తగిన విధంగా ఆదుకోవాలి’’ అని చిరంజీవి ట్వీట్‌ చేశారు.

రాజు ఆత్మహత్య చేసుకున్న ఘటనను మంత్రి కేటీఆర్‌ ట్విటర్‌ వేదికగా వెల్లడించగా, ఆయన ట్వీట్‌ను మంచు మనోజ్‌ రీట్వీట్‌ చేస్తూ ‘సమాచారం ఇచ్చినందుకు ధన్యవాదాలు సర్‌.. దేవుడు ఉన్నాడు’ అని పేర్కొన్నారు.

‘‘కోర్టుల్లేవు.. విచారణల్లేవు.. మానవ హక్కుల సంఘాల్లేవు...పేజీలకు పేజీల ఆరాల్లేవు.. ఎదురు చూసే పనులు అస్సల్లేవు.. చిట్టి తల్లి కన్న తల్లిదండ్రుల బాధకి కాస్త ఊరట కలిగిస్తూ, వారు కోరుకున్న న్యాయం జరిగిందని ఆశిస్తూ..’’ అంటూ సందీప్‌ అనే నెటిజన్‌ ట్విటర్‌ వేదికగా స్పందించాడు.

‘‘చట్టం నుంచి తప్పించుకోవచ్చేమో గానీ ఆ దైవం నుండి ఎవ్వరూ తప్పించుకోలేరు.. అభంశుభం తెలియని ఆ పసికందును అతి కిరాతకంగా హత్య చేసిన ఆ నరరూప రాక్షసుడికి దైవం సరైన శిక్ష విధించింది... పాప ఆత్మకు శాంతి చేకూరాలని ఆ భగవంతుని ప్రార్థిద్దాం’‘ అని రఫీక్‌ అనే మరో నెటిజన్‌ పేర్కొన్నాడు.

Read latest Movies News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat, and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని