Chiranjeevi: రాజమౌళి దర్శకత్వంలో నటించాలనే కోరిక లేదు: చిరంజీవి

ప్రముఖ దర్శకుడు రాజమౌళి దర్శకత్వంలో నటించాలనే కోరిక తనకు లేదన్నారు నటుడు చిరంజీవి. సినిమాని తెరకెక్కించేందుకు ఆయన చాలా సమయం తీసుకోవటమే అందుకు కారణం అని తెలిపారు.

Published : 01 Oct 2022 02:28 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: ప్రముఖ దర్శకుడు రాజమౌళి (Rajamouli) అంటే తనకు ఇష్టమని, అయినా ఆయన దర్శకత్వంలో నటించాలనే కోరిక లేదని ప్రముఖ నటుడు చిరంజీవి (Chiranjeevi) అన్నారు. ‘గాడ్‌ ఫాదర్‌’ (God Father) ప్రచారంలో భాగంగా బాలీవుడ్‌కు చెందిన ఓ ప్రముఖ ఛానల్‌తో ఆయన మాట్లాడారు. ‘రాజమౌళితో పనిచేయనని ఇటీవల అన్నారు కదా. ఎందుకు?’ అని యాంకర్‌ ప్రశ్నించగా చిరు స్పందించారు. ‘‘రాజమౌళి గొప్ప దర్శకుడు. భారతీయ చలన చిత్ర పరిశ్రమ ఖ్యాతిని ప్రపంచానికి తెలిపారు. ప్రతి విషయాన్ని ఆయన ఎంతో లోతుగా చూస్తారు. ఆయన కోరుకునే ఔట్‌పుట్‌ను ఓ నటుడిగా నేను ఇవ్వగలనో లేదో నాకు తెలియదు. సినిమా తెరకెక్కించటానికి తను ఎంత సమయం వెచ్చిస్తారో తెలిసిందే. ఒక్కో సినిమాతో మూడు నుంచి ఐదేళ్లు ప్రయాణిస్తారు. నేను ఒకేసారి నాలుగు చిత్రాలు చేస్తున్నా. అందుకే ఆయనతో పనిచేయాలని, పాన్‌ ఇండియా నటుడిగా గుర్తింపు పొందాలని లేదు’’ అని చిరంజీవి నవ్వుతూ వివరించారు. తన ప్రతిభకు తన తనయుడు, నటుడు రామ్‌చరణ్‌ కొనసాగింపు అని పేర్కొన్నారు. ఓ సినిమాకు దర్శకత్వం వహించాలనుందని తెలిపారు. 

చిరంజీవి హీరోగా దర్శకుడు మోహన్‌ రాజా తెరకెక్కించిన ‘గాడ్ ఫాదర్‌’ అక్టోబరు 5న ప్రేక్షకుల ముందుకురానుంది. పొలిటికల్‌ యాక్షన్‌ నేపథ్యంలో రూపొందిన ఈ సినిమాలో బాలీవుడ్‌ నటుడు సల్మాన్‌ఖాన్‌, నయనతార, సత్యదేవ్‌, పూరీ జగన్నాథ్‌ కీలక పాత్రలు పోషించారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని