Chiranjeevi: రాజకీయాల్లో రాణించడం చాలా కష్టం.. చిరంజీవి ఆసక్తికర వ్యాఖ్యలు

రాజకీయాలకు పవన్‌కల్యాణ్‌ తగినవాడు అని, ఏదో ఒకరోజు పవన్‌ను ఉన్నతస్థాయిలో చూస్తామని అగ్ర కథానాయకుడు చిరంజీవి అన్నారు.

Updated : 20 Nov 2022 16:12 IST

హైదరాబాద్‌: ప్రస్తుత పరిస్థితుల్లో రాజకీయాల్లో రాణించడం చాలా కష్టమని అగ్రకథానాయకుడు చిరంజీవి (Chiranjeevi) అన్నారు. ఆదివారం హైదరాబాద్‌లోని వైఎన్‌ఎం కళాశాలలో పూర్వ విద్యార్థుల సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరైన ఆయన అనేక ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ‘‘రాజకీయాల్లో మాటలు పడాలి.. అనాలి. చాలా మొరటుగా, కటువుగా ఉండాలి. ఒక దశలో నాకు రాజకీయాలు అవసరమా? అనిపించింది. రాజకీయాలకు పవన్‌కల్యాణ్‌ తగినవాడు. ఏదో ఒకరోజు పవన్‌ను ఉన్నతస్థాయిలో చూస్తాం’’ అని వ్యాఖ్యానించారు.

నటుణ్నికావాలని ఆ కాలేజీలోనే ఫిక్స్‌ అయ్యా

‘‘ఇలాంటి కార్యక్రమానికి రావడం ఇదే తొలిసారి. వీళ్లంతా ఆహ్వానించినప్పుడు కుదురుతుందో లేదోనని సందేహించా. ఎందుకంటే ప్రస్తుతం ‘వాల్తేరు వీరయ్య’ సినిమా చిత్రీకరణ శరవేగంగా జరుగుతోంది. ఒక్కరోజైనా విరామం ఉండదనుకున్నా. కానీ, గతంలో జరిగిన ఆత్మీయ సమావేశం గురించి తెలుసుకోవడంతో రావాలని ఆసక్తి కలిగింది. పూర్వ విద్యార్థుల సమ్మేళనం అనే ప్రక్రియ 200 ఏళ్ల క్రితం అమెరికాలో మొదలైందట. దీని ద్వారా పూర్వ విద్యార్థులంతా కలిసి గత స్మృతులను గుర్తు చేసుకోవడం, వారు సాధించిన విజయాలు గురించి చర్చించుకోవడం, ఆ దిశగా రాణించాలనుకొనే వారికి చేయూతనివ్వడమనేది మాటల్లో చెప్పలేని అనుభూతి. కళాశాల విద్య పూర్తయ్యాక ఒక్కొక్కరూ ఒక్కో రంగంలోకి అడుగుపెట్టి ముందుకెళ్తుంటాం. భవిష్యత్తులో మనం ఏం కావాలనుకుంటున్నామో దానికి బీజం పడేది  కాలేజీ రోజుల్లోనే. ఆ సమయం నుంచే  నాకు నటనపై ఇష్టం ఉండేది. ఆ మక్కువ కొద్దీ ఓ నాటకం వేస్తే ఉత్తమ నటుడిగా పేరొచ్చింది. ఎన్ని కష్టాలు ఎదురైనా వాటిని అధిగమించి సినిమా రంగంలో నటుడిగా రాణించాలనే బలమైన నమ్మకానికి పునాది పడింది ‘ఎర్రమిల్లి నారాయణమూర్తి కళాశాల’ (వైఎన్‌ఎం)లోనే. బెస్ట్‌ యాక్టర్‌గా గుర్తింపు వచ్చాక అమ్మాయిలు నన్ను చూస్తుంటే పెద్ద హీరోలా ఫీలయ్యేవాణ్ని (నవ్వులు)’’

‘‘ఎన్‌సీసీ’లో సీనియర్‌ కెప్టెన్‌ పొజిషన్‌ వరకు వెళ్లా. 1976లో రిపబ్లిక్‌ డే సందర్భంగా క్యాంపు వెళ్లి ఆంధ్రప్రదేశ్‌ తరఫున రాజ్‌పథ్‌లో మార్చింగ్‌ చేశా. ఆ కాలేజీలోనే క్రమశిక్షణ నాకు అలవడింది. నాకు డ్యాన్స్‌ విషయంలో గురువులు ఎవరూ లేరు. కానీ, బెస్ట్‌ డ్యాన్సర్‌నంటూ అంతా నన్ను అంటారు. కేవలం పుస్తకాల నుంచే కాదు మన చుట్టూ ఉండే వారి నుంచీ నేర్చుకుంటూనే ఉండాలి. నా మనసుకు నచ్చితే దాని అంతు చూడటమనేది నాకు అలవాటుగా మారింది. నా మనసులోంచి రాకపోతే దాని అంతు నేను చూడలేను. అదేంటో మీకు తెలుసు  ప్రత్యేకంగా నేను చెప్పనవసరం లేదు (నవ్వుతూ..). రాజకీయాల్లో సెన్సిటివ్‌గా ఉంటే రాణించడం చాలా కష్టం. అవసరం ఉన్నా లేకపోయినా  మాటలు అనాలి, అనిపించుకోవాలి. తను (పవన్‌ కల్యాణ్‌) తగినవాడు. అంటాడు, అనిపించుకుంటాడు. మీ అందరి ఆశీస్సులతో ఏదో ఒకరోజు అత్యుత్తమ స్థానంలో ఉంటాడు’’ అని చిరంజీవి అన్నారు. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని