Chiranjeevi: అప్పుడు చాలా బాధపడ్డా.. కానీ ఇప్పుడు: చిరంజీవి

53వ అంతర్జాతీయ చలన చిత్రోత్సవ వేడుకల్లో నటుడు చిరంజీవి ‘ఇండియన్‌ ఫిల్మ్‌ పర్సనాలిటీ ఆఫ్ ది ఇయర్‌’ అవార్డు అందుకున్నారు.

Updated : 28 Nov 2022 19:24 IST

పనాజీ: గతంలో నిర్వహించిన చలన చిత్రోత్సవంలో ఒక్క దక్షిణాది నటుడి ఫొటో లేకపోవడంపై చాలా బాధపడ్డానని, ఇప్పుడు అవార్డు అందుకోవడం ఆనందంగా ఉందని అన్నారు ప్రముఖ నటుడు చిరంజీవి (Chiranjeevi). గోవా వేదికగా జరిగిన 53వ అంతర్జాతీయ చలన చిత్రోత్సవ ముగింపు వేడుకలో ఆయన ‘ఇండియన్‌ ఫిల్మ్‌ పర్సనాలిటీ ఆఫ్ ది ఇయర్‌’ అవార్డు అందుకున్నారు. 

అనంతరం ఆయన మాట్లాడుతూ.. ‘‘ఈ అవార్డు ఇచ్చినందుకు ఇఫీ, భారత ప్రభుత్వానికి కృతజ్ఞతలు. ప్రత్యేకంగా నిలిచే అవార్డుల్లో ఇదొకటి. ఈ క్షణం కోసం దశాబ్దాల నుంచి ఎదురుచూస్తున్నా. సరైన సమయంలోనే నాకు ఇచ్చారని భావిస్తున్నా. ఇది నాకే కాదు నా అభిమానుల్లోనూ ఎనలేని ఉత్సాహాన్ని నింపింది. నేను ఓ మధ్యతరగతి కుటుంబంలో జన్మించా. శివ శంకర్‌ వరప్రసాద్‌ అనే నాకు.. సినీ పరిశ్రమ చిరంజీవిగా మరో జన్మనిచ్చింది. 45ఏళ్లకు పైగా ఇండస్ట్రీలో ఉన్నా. రాజకీయంలోకి వెళ్లడం వల్ల కొన్నాళ్లు గ్యాప్‌ వచ్చింది. పాలిటిక్స్‌లోకి వెళ్లడం వల్ల సినిమా విలువేంటో అర్థమైంది. ఏ రంగంలో అయినా అవినీతి ఉండొచ్చు. కానీ, చిత్ర పరిశ్రమలో లేదు. ఇక్కడ ప్రతిభ ఒక్కటే కొలమానం. రీ ఎంట్రీ సమయంలో ప్రేక్షకులకు ఎలా ఆదరిస్తారోననే సందేహం ఉండేది. కానీ, ఎప్పటిలానే నాపై ప్రేమ చూపారు. వారి ప్రేమకు నేను దాసుణ్ని. జీవితాంతం చిత్ర పరిశ్రమలోనే ఉంటా. గతంలో జరిగిన చలన చిత్రోత్సవ వేడుకలకు ఓసారి వచ్చా. దక్షిణాదికి చెందిన ఒక్క నటుడి ఫొటో కూడా లేదని చాలా బాధపడ్డా. సినిమా ఎక్కడైనా తీయొచ్చు. కానీ, అది భారతీయ సినిమా అని గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు ప్రాంతీయ భేదాలు పోయి భారతీయ సినిమా అనే రోజు వచ్చింది.నాకు యువ హీరోలు పోటీ కాదు. నేనే వాళ్లకు పోటీ. వాళ్లకు ఇప్పుడు కష్టకాలమే’’ అని చిరంజీవి పేర్కొన్నారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని