Chiranjeevi: ఆ మార్క్‌ చేరుకోవడం ఆషామాషీ కాదు: చిరంజీవి

‘వాల్తేరు వీరయ్య’ విజయోత్సవ వేడుకను చిత్రబృందం హనుమకొండలో నిర్వహించింది. మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు, నటుడు రామ్‌చరణ్‌ అతిథిగా హాజరయ్యారు.

Updated : 28 Jan 2023 22:43 IST

హనుమకొండ: చిరంజీవి (Chiranjeevi), రవితేజ కలిసి నటించిన చిత్రం ‘వాల్తేరు వీరయ్య’ (Waltair Veerayya). దర్శకుడు కె. బాబీ దర్శకత్వం వహించిన ఈ సినిమా సంక్రాంతి సందర్భంగా విడుదలైన సంగతి తెలిసిందే. ప్రేక్షకుల నుంచి విశేష స్పందనరావడంతో చిత్రబృందం హనుమకొండలో విజయోత్సవ వేడుక నిర్వహించింది. మంత్రి ఎర్రబెల్లి దయాకరరావు, చిరంజీవి తనయుడు, నటుడు రామ్‌చరణ్‌ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు.

వేడుకనుద్దేశించి చిరంజీవి మాట్లాడుతూ.. ‘‘నేను ఓరుగల్లుకు వచ్చి చాలా కాలమైంది. ఇక్కడ రోడ్‌షో చేసినప్పటి దృశ్యాలు ఇంకా నా కళ్లలో కదలాడుతూనే ఉన్నాయి. అదే స్థాయిలో ఉన్న ఈ జనసందోహాన్ని చూస్తుంటే ఆనందంగా ఉంది. వరంగల్‌లోనే విజయోత్సవ వేడుక నిర్వహించాలని ప్రతి ఒక్కరం అనుకున్నాం. ఈ సినిమా విజయం సాధిస్తుందనుకున్నాంకానీ.. నాన్‌ ‘బాహుబలి’, నాన్‌ ‘ఆర్‌ఆర్‌ఆర్’ స్థాయి చిత్రం అవుతుందని ఊహించలేదు. ఈ విజయంలో అగ్రతాంబూలం అందుకోవాల్సిన వారు ప్రేక్షకులు. ఈ సినిమా నేటితో రూ. 250 కోట్ల (గ్రాస్‌) వసూళ్ల మార్క్‌ చేరుకోబోతోందంటే అది ఆషామాషీ విషయంకాదు’’

‘‘వాల్తేరు వీరయ్య’ను చూస్తూ మీరంతా నా గత చిత్రాలను గుర్తుచేసుకోవడం చాలా సంతోషంగా ఉంది. అలాంటి అనుభూతి పొందడానికి కారణం దర్శకుడు బాబీ. 1983లో వచ్చిన ‘ఖైదీ’ నాకు స్టార్‌డమ్‌ ఇచ్చినట్టుగానే 2023లో వచ్చిన ‘వాల్తేరు వీరయ్య’ బాబీని స్టార్‌ డైరెక్టర్‌ని చేసింది. సినిమా కోసం తనెంతో కష్టపడ్డాడు. ఆయన పనితీరుకు నేనే అభిమానినయ్యా. చరణ్‌ నటించిన ‘రంగస్థలం’ సినిమా సమయం నుంచి మైత్రీ మూవీ మేకర్స్‌ సంస్థ నిర్మాతలు నాకు తెలుసు. ఈ సినిమాలో చరణ్‌.. చిట్టిబాబుగా అద్భుతంగా నటించాడు. ‘ఆర్‌ఆర్‌ఆర్‌’లో విశ్వరూపం చూపించాడు. ఎన్టీఆర్‌ తానూ కలిసి నటించిన ఈ సినిమాలోని ‘నాటు నాటు’ పాట ఆస్కార్‌కు నామినేట్‌ కావడం కంటే మనకు కావాల్సింది ఏముంది. దేశానికే గర్వకారణమది. రామ్‌చరణ్‌ స్థానంలో నేనే ఉన్నాననే భావన కలుగుతోంది’’ అని చిరంజీవి అన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని