Chiranjeevi: డోలీ మోసిన వారికి నమస్కరించిన చిరంజీవి

ఇటీవల కరోనా నుంచి కోలుకున్న అగ్రకథానాయకుడు, మెగాస్టార్‌ చిరంజీవి ప్రస్తుతం ఆధ్మాత్మిక యాత్రలో నిమగ్నమయ్యారు. తన సతీమణి సురేఖతో కలిసి కేరళలోని పలు దేవాలయాలను సందర్శిస్తున్నారు.....

Published : 14 Feb 2022 12:50 IST

నిన్న శబరిమల.. నేడు గురువాయుర్‌లో ప్రత్యేక పూజలు

ఇంటర్నెట్‌డెస్క్‌: ఇటీవల కరోనా నుంచి కోలుకున్న అగ్రకథానాయకుడు మెగాస్టార్‌ చిరంజీవి ప్రస్తుతం ఆధ్మాత్మిక యాత్రలో నిమగ్నమయ్యారు. తన సతీమణి సురేఖతో కలిసి కేరళలోని పలు దేవాలయాలను సందర్శిస్తున్నారు. దీనిలో భాగంగా ఆదివారం ఉదయం తనకెంతో ఇష్టమైన శబరిమల అయ్యప్ప స్వామి దర్శనానికి వెళ్లారు. దేవాలయం వద్ద భక్తుల రద్దీ ఎక్కువగా ఉన్న కారణంగా ఆయన డోలీలో ప్రయాణించారు. గమ్యస్థానానికి చేరిన వెంటనే తన డోలీని మోసిన శ్రామికులకు చేతులెత్తి నమస్కరించారు.

శబరిమల దర్శనానికి సంబంధించిన ఫొటోలను ట్విటర్‌ వేదికగా షేర్‌ చేస్తూ.. ‘‘చాలా సంవత్సరాల తర్వాత శబరిమలలో దర్శనం చేసుకొన్నాను. భక్తుల రద్దీ, అభిమానుల తాకిడి ఎక్కువగా ఉన్న కారణంగా అందర్నీ అసౌకర్యానికి గురి చేయకుండా డోలీలో వెళ్లాల్సి వచ్చింది. ఆ స్వామి పుణ్య దర్శనానికి వస్తోన్న భక్తుల కోసం తమ శ్రమ ధారపోస్తున్న ఆ శ్రామిక సోదరులకు నా హృదయాంజలి’’ అని తెలిపారు. ఇక, చిరంజీవి-సురేఖ దంపతులు సోమవారం ఉదయం గురువాయూర్‌ శ్రీ కృష్ణ ఆలయంలో ప్రత్యేకపూజల్లో పాల్గొన్నారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన పలు ఫొటోలు నెట్టింట్లో వైరల్‌గా మారాయి. మరోవైపు చిరంజీవి అయ్యప్పస్వామిని ఎక్కువ విశ్వసిస్తారనే విషయం తెలిసిందే. ఆయనతోపాటు ఆయన తనయుడు రామ్‌చరణ్‌ సైతం ప్రతి ఏడాది అయ్యప్ప మాల ధరిస్తారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని