Waltair Veerayya: ఎమోషనల్‌ రోలర్‌ కోస్టర్‌ ‘వాల్తేరు వీరయ్య’: చిరంజీవి

Waltair Veerayya: చిరంజీవి కథానాయకుడిగా నటించిన ‘వాల్తేరు వీరయ్య’ప్రీరిలీజ్‌ వేడుక విశాఖపట్నంలో జరిగింది.

Updated : 08 Jan 2023 23:32 IST

విశాఖ: ‘వాల్తేరు వీరయ్య’ (Waltair Veerayya) పక్కా కమర్షియల్‌ సినిమా అని, అయితే అంతకు మించిన ఎమోషన్స్‌ మూవీలో ఉంటాయని అగ్ర కథానాయకుడు చిరంజీవి అన్నారు. అన్నింటినీ మేళవించి దర్శకుడు బాబీ దీన్ని తీర్చిదిద్దారని చెప్పారు. బాబీ దర్శకత్వంలో ఆయన కథానాయకుడిగా నటించిన మాస్‌ యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌ చిత్రం ‘వాల్తేరు వీరయ్య’ (Waltair Veerayya). శ్రుతిహాసన్‌ (Shruti Haasan) కథానాయిక. రవితేజ (Ravi teja) కీలక పాత్ర పోషించారు. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ సినిమా సంక్రాంతి కానుకగా జనవరి 13న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా చిత్ర ప్రీరిలీజ్‌ వేడుక వైజాగ్‌లో జరిగింది. ఈ సందర్భంగా చిరంజీవి (Chiranjeevi) మాట్లాడారు.

‘‘ఎప్పుడు విశాఖ వచ్చినా నేను ఒక ఉద్వేగానికి లోనవుతా. ఇక్కడి ప్రజలంటే నాకు ఇష్టం. ఇక్కడ ఒక స్థలం కొనుక్కొని ఇల్లు కట్టుకోవాలని నేను ఎప్పటినుంచో అనుకున్నా. ఇటీవల భీమిలి వెళ్లేదారిలో కొనుక్కున్నా. కచ్చితంగా ఇల్లు కట్టి, విశాఖ పౌరుడిని అవుతా. బాబీ ‘వాల్తేరు వీరయ్య’ కథ కేవలం గంటన్నర మాత్రమే చెప్పాడు. వెంటనే ఓకే చెప్పా. నేను హిట్‌లు అందుకున్న చిత్రాలన్నీ వెంటనే కథలు ఓకే చేసినవే. ఒక అభిమానిగా సినిమా తీస్తే సరిపోదు. సినిమా అంటే ఖర్చుతో కూడుకున్నది. ప్రజలను మెప్పించేలా తీయాలి. ఆ విషయంలో బాబీ విజయం సాధించారు. ఆయన, ఆయన టీమ్‌ కష్టపడి పనిచేశారు. బాబీలో నలుగురు నిష్ణాతులు కనిపించారు. కథకుడు, రచయిత, స్క్రీన్‌ప్లే రైటర్‌, నాలుగో వ్యక్తి దర్శకుడు. ఆ తర్వాత అతడిలో అభిమానిని చూశా. ఇది పక్కా కమర్షియల్‌ సినిమానే. అయితే, అంతకు మించిన ఎమోషన్స్‌ ఉంటాయి. నిజంగా ఇదొక ఎమోషనల్‌ రోలర్‌ కోస్టర్‌’’

‘‘సినిమా చేస్తున్నప్పుడు ఎక్కడైనా గ్రేషేడ్స్‌ ఉంటే తన బృందంతో కలిసి దాన్ని మెరుగుపరుచుకుంటూ వచ్చాడు. తెరపై కనిపించే ప్రతి చిన్న లోపాన్ని సరిచేసుకుంటూ వెళ్లాడు. నాకు చాలా మంది అభిమానులు ఉంటారు. ఎవరైతే పనిని ప్రేమిస్తారో.. కష్టాన్ని నమ్ముకుంటారో వారే అసలైన నా అభిమానులు. అలాంటి వ్యక్తికి నేను అభిమానిని. ఈ రెండేళ్లు కష్టాన్ని చూసి నేను బాబీకి అభిమానిని అయ్యా. సినిమా మొదటి 20 నిమిషాల్లో హాలీవుడ్‌ స్థాయి సన్నివేశాలు ఉంటాయి. ఇక ఇంతకుమించి చెప్పను ఎందుకంటే, ‘రంగస్థలం’ నుంచి చిరు లీక్స్‌ అలవాటైపోయింది. ఈ సంక్రాంతికి మైత్రీ మూవీ మేకర్స్‌ విడుదల చేసే ‘వీరసింహారెడ్డి’, ‘వాల్తేరు వీరయ్య’ చిత్రాలు మంచి విజయాలు సాధించాలి. ఇక ఈ సినిమాలో కీలక పాత్ర కోసం రవితేజ పేరు చెప్పగానే వెంటనే ఓకే చెప్పా. సినిమాలో మా పాత్రలు చాలా ఇంట్రెస్టింగ్‌గా ఉంటాయి. సెకండాఫ్‌లో రవి పాత్ర ఓ రేంజ్‌లో ఉంటుంది. శ్రుతిహాసన్‌ ఈ ఈవెంట్‌కు రాలేకపోయింది. ఆరోగ్యం బాగోలేదని, ఫోన్‌చేసి విషయాన్ని చెప్పి బాధపడింది. ఒంగోలులో ఏం తిన్నదో ఏమో లేదా ఎవరైనా బెదిరించారేమో జ్వరం వచ్చింది అట(నవ్వులు) ఇక ఈ సినిమాలో ఓ పాట కోసం మైనస్‌ డిగ్రీల్లో చలి వాతావరణంలో చీరకట్టుకుని ఆమె డ్యాన్స్‌ చేసింది. వృత్తి పట్ల ఆమెకున్న అంకితభావానికి నిజంగా హ్యాట్సాఫ్‌. కేథరిన్‌, బాబీ సింహా, ప్రకాశ్‌రాజ్‌, రాజేంద్రప్రసాద్‌ ఇలా ప్రతి ఒక్కరూ చాలా బాగా నటించారు. దేవిశ్రీ ప్రసాద్ అందించిన మ్యూజిక్‌ ఈ సినిమాకు హైలైట్‌. ఈ సినిమాల తర్వాత నిర్మాతలు మైత్రీ మూవీ మేకర్స్‌ ఎంతో ఎత్తుకు చేరుకుంటారు. ఈ కార్యక్రమం సజావుగా సాగడానికి పోలీసులు ముందు నుంచీ సహకారం అందిస్తూ వచ్చాారు. ప్రత్యేక ఏర్పాట్లు చేయాలని సీఎంవో నుంచి కూడా ఆదేశాలు వచ్చాయి. తాజాగా ‘వాల్తేరు వీరయ్య’ మళ్లీ చూశా.  నోడౌట్‌ ఇది బ్లాక్‌బస్టర్‌ మూవీ’’ అని చిరంజీవి అన్నారు.

వీరయ్య చిత్ర బృందానికి కంగ్రాట్స్‌: రవితేజ

నటుడు రవితేజ మాట్లాడుతూ.. ‘‘విజేత’ ఫంక్షన్‌కు నేను ఆలస్యంగా వెళ్లాను. దూరం నుంచి చిరంజీవిని చూడాల్సి వచ్చింది. అప్పుడు నా స్నేహితులతో చెప్పాను. ఎప్పటికైనా చిరంజీవిగారి పక్కన కూర్చుంటానని చెప్పా. ఆయనతో కలిసి నటించా. ఆయన పక్కన కాదు.. ఆయన ఒడిలో కూర్చున్న సందర్భాలు కూడా ఉన్నాయి. రాజకీయాల వల్ల 9 ఏళ్లు మిమ్మల్ని మిస్‌ అయ్యాం. ఇక అవకూడదు. నాకు పరిచయం అయిన దగ్గరి నుంచి ఆయన ఎవరినీ నొప్పించలేదు. ‘వాల్తేరు వీరయ్య’ చిత్ర బృందానికి కంగ్రాట్స్‌. సక్సెస్‌మీట్‌లో కచ్చితంగా కలుద్దాం’’ అని చెప్పారు. 

మెగాస్టార్‌లాంటి వ్యక్తి ప్రతి ఇంట్లోనూ ఉండాలి: బాబీ

దర్శకుడు బాబీ మాట్లాడుతూ.. ‘‘లక్షలాది  మంది చిరంజీవి అభిమానుల్లో నేనూ ఒకడిని. ‘ఇంద్ర’ సినిమా తర్వాత హైదరాబాద్‌ వచ్చి, ఆయనతో ఫొటో దిగా. ఆ తర్వాత చిన్నికృష్ణగారి దగ్గర 2003లో అసిస్టెంట్‌గా చేరా. 2023లో అంటే 20ఏళ్ల తర్వాత చిరంజీవి గారి సినిమాకు దర్శకత్వం వహించే అవకాశం వచ్చింది. ఆయనతో షూటింగ్‌ చేసినన్ని రోజుల్లో ఒకసారైనా ఆయనలో అసహనం కనిపిస్తోందేమోనని గమనించా. ఒక్కసారి కూడా చూడలేదు. ప్రతి ఇంట్లోనూ ఒక మెగాస్టార్‌లాంటి వ్యక్తి ఉండాలి. ఎప్పటికైనా చిరంజీవిగారితో సినిమా చేస్తానని మా నాన్నకు మాటిచ్చా. ఇప్పుడు అదే నిజమైంది. కేవలం 94 రోజుల్లో షూటింగ్‌ పూర్తి చేశా. బాస్‌ రాజకీయాల్లోకి వెళ్లినప్పుడు ఆయనతో సినిమా చేయడం కుదరదేమోనని అనుకున్నా. మళ్లీ మీరు సినిమాల్లోకి వచ్చారు. మీకు రాజకీయాలు అసలు కరెక్ట్ కాదు అన్నయ్య. దేవుడు మీకు ఒక తమ్ముడిని ఇచ్చాడు. రాజకీయాలన్నీ ఇక అతను చూసుకుంటాడు. అతను మాటకు మాట.. కత్తికి కత్తి.. సమస్య వస్తే, నిద్రలో కూడా లేచి సాయం చేసే వ్యక్తి పవన్‌కల్యాణ్‌. ఈ సినిమాలో ఒక బలమైన పాత్ర ఉందని చెప్పినప్పుడు రవితేజ కరెక్ట్‌ అనిపించింది. ఈ విషయాన్ని చిరంజీవిగారికి చెబితే ఆయన కూడా వెంటనే ఓకే చెప్పారు. రవితేజ ఎంపిక కరెక్ట్‌ అని సినిమా చూసిన తర్వాత మీరే చెబుతారు. ఈ సినిమా కోసం ప్రతి ఒక్కరూ ఎంతో కష్టపడి పనిచేశారు. అందరికీ ధన్యవాదాలు’’ అని అన్నారు.

‘‘అభిమానులందరూ కలిసి ఒక సినిమా తీస్తే, ‘వాల్తేరు వీరయ్య’లా ఉంటుంది. చిరంజీవిగారికి ఒక గొప్ప మైలురాయిలా ఉండాలని మేమంతా కష్టపడి పనిచేశాం. చిరంజీవి, రవితేజలను చూసినప్పుడల్లా ఎనర్జీ వచ్చేస్తుంది. ఎందుకంటే ఎప్పుడూ పాజిటివ్‌గా ఉంటారు. వరుసగా క్లాస్‌ పాటలు చేస్తున్న నేను మొదటిసారి మాస్‌ పాట రవితేజ కోసమే చేశా. వెంకీ సినిమాలో ‘మాస్‌తో పెట్టుకుంటే మడతడిపోద్ది’. బాస్‌ కోసం ఇందులో ‘బాస్‌ పార్టీ’ చేశా. ఇక చిరు-రవితేజ కలిసి చేసే పాట కోసం కేవలం చిన్న బూరతో సంగీతం క్రియేట్‌ చేశా. సంగీతానికి కొన్నిసార్లు పెద్దవి, ఖరీదైన వాయిద్య పరికరాలే అవసరం లేదు. సంగీతాన్ని మన గుండెల్లో నుంచి కూడా పుట్టించవచ్చు’’ అని సంగీత దర్శకుడు దేవిశ్రీ ప్రసాద్‌ అన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని