pawan kalyan: మినిస్టర్‌ పవన్‌కల్యాణ్‌.. అత్యంత ఖరీదైన బహుమతి ఇచ్చిన వదినమ్మ సురేఖ

మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన అనంతరం అన్నయ్య, వదినలను కలిసేందుకు పవన్‌కల్యాణ్‌ రాగా, సురేఖ ఆయనకు ఖరీదైన పెన్నును బహుమతిగా ఇచ్చారు.

Updated : 15 Jun 2024 18:02 IST

హైదరాబాద్‌: తాజా ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో సినీ నటుడు, జనసేన అధినేత పవన్‌కల్యాణ్‌ (Pawan Kalyan) ఘన విజయాన్ని సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. పిఠాపురం నుంచి పోటీ చేసిన ఆయన గెలుపొందడమే కాదు, పార్టీ నుంచి బరిలో నిలిచిన ప్రతీ అభ్యర్థి గెలిచేలా అహర్నిశలు శ్రమించారు. అంతేకాదు, ఆంధ్రప్రదేశ్‌ ఉప ముఖ్యమంత్రి పదవితో పాటు, పంచాయతీరాజ్‌ సహా కీలక శాఖలను దక్కించుకున్నారు. మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన అనంతరం అన్నయ్య చిరంజీవి (Chiranjeevi) కుటుంబాన్ని కలిసేందుకు పవన్‌ హైదరాబాద్‌ వచ్చారు.

ఈ సందర్భంగా ఆయన వదినమ్మ సురేఖ అత్యంత ఖరీదైన మోంట్‌బ్లాంక్‌ పెన్నును బహుమతిగా ఇచ్చారు. ఇందుకు సంబంధించిన వీడియోను చిరంజీవి తన సామాజిక మాధ్యమాల వేదికగా పంచుకున్నారు. సురేఖ స్వయంగా పెన్నును తీసి, పవన్‌ జేబులో పెట్టగా అది చూసి పవన్‌ తెగ సంతోషపడ్డారు. అప్పటికే ఆయన వద్ద ఉన్న పెన్ను తీసి చూపించగా, ‘ఇది కూడా అట్టిపెట్టుకో’ అన్నట్లు సురేఖ చెప్పారు. ఆ వెంటనే ఒకవైపు నుంచి చిరంజీవి, మరోవైపు నుంచి పవన్‌ సతీమణి అన్నాలెజినోవా వచ్చి ఫొటో దిగారు.

‘తెలుగు ప్రజల ఆకాంక్షల్ని నిజం చేస్తావని ఆశిస్తూ, ఆశీర్వదిస్తూ.. వదిన, అన్నయ్య’ అంటూ చిరంజీవి వీడియోను ముగించారు. ప్రస్తుతం ఈ వీడియో సామాజిక మాధ్యమాల వేదికగా వైరల్‌ అవుతోంది. అత్యంత ఖరీదైన విలాసవంతమైన ఉత్పత్తులను మోంట్‌బ్లాంక్‌ అందిస్తుంది. లగ్జరీ పెన్నులు, రీఫిల్స్‌, బ్యాగ్స్‌, లెదర్‌ వస్తువులు, వాచీలు, సెంట్స్‌ తదితర గిఫ్ట్‌లను తయారుచేస్తుంది. వీటి ఖరీదు కూడా అంతే ఎక్కువగా ఉంటుంది. సురేఖ.. పవన్‌కు ఇచ్చిన మోంట్‌ బ్లాంక్‌ డిస్నీ ఎడిషన్‌ పెన్నుల ధరల శ్రేణి రూ.90 వేల నుంచి రూ.2.60లక్షల వరకూ ఉంది.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని