Chor Nikal Ke Bhaga Review: రివ్యూ: చోర్‌ నికల్‌ కె భాగా

Chor nikal ke bhaga movie review: యామిగౌతమ్‌ కీలక పాత్రలో నటించిన ‘చోర్‌నికల్‌ కే భాగా’ ఎలా ఉందంటే?

Updated : 24 Mar 2023 16:20 IST

Chor Nikal Ke Bhaga Review; చిత్రం: చోర్‌ నికల్‌ కె భాగా; నటీనటులు: యామి గౌతమ్‌, సన్నీ కౌశల్‌, శరద్‌ ఖేల్కర్‌, ఫారూక్‌ అజామ్‌ ప్రియాంక కరుణాకరన్‌, రిక్‌ అబే; సంగీతం: విశాల్‌ మిశ్రా; సినిమాటోగ్రఫీ: జియానీ జియాన్నెల్లి; ఎడిటింగ్‌: చారు థాకర్‌; నిర్మాత: దినేశ్‌ విగన్‌, అమర్‌ కౌశిక్‌; దర్శకత్వం: అజయ్‌ సింగ్‌; స్ట్రీమింగ్‌ వేదిక: నెట్‌ఫ్లిక్స్‌

ఒకవైపు థియేటర్‌లో సినిమాలు ప్రేక్షకులను అలరిస్తున్నా, మరోవైపు ఓటీటీలకు క్రేజ్‌ ఏమాత్రం తగ్గడం లేదు. రోజు రోజుకీ ఓటీటీల్లో సినిమాలు చూసే వారి సంఖ్య గణనీయంగా పెరుగుతోంది. ఈ క్రమంలో కొన్ని సినిమాలు నేరుగా ఓటీటీకే ఓటు వేస్తున్నాయి. అలా తాజాగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన చిత్రం ‘చోర్‌ నికల్‌ కె భాగా’. ప్రముఖ ఓటీటీ వేదిక నెట్‌ఫ్లిక్స్‌ వేదికగా శుక్రవారం నుంచి స్ట్రీమింగ్‌ మొదలైంది. (Chor Nikal Ke Bhaga Review) ఇంతకీ ఈ సినిమా కథేంటి? ఎలా ఉంది?

కథేంటంటే: అంకిత్‌ సేథి (సన్నీ కౌశల్‌) ఒక బిజినెస్‌ మ్యాన్‌. విదేశాల నుంచి తీసుకువచ్చే వజ్రాలకు బీమా అందించే కంపెనీ నిర్వహిస్తుంటాడు. ఈ క్రమంలోనే తరచూ విమాన ప్రయాణాలు చేస్తుంటాడు. ఒకరోజు విమానంలో ఎయిర్‌హోస్టెస్‌ నేహా గ్రోవర్‌ (యామి గౌతమ్‌) పరిచయం అవుతుంది. ఆ పరిచయం కాస్తా ప్రేమగా మారి ఇద్దరూ ఒకటవడంతో నేహా గర్భవతి అవుతుంది. కంపెనీలో పనిచేసే ఒక ఉద్యోగి మోసం చేసి రూ.20కోట్ల విలువైన వజ్రాలను కొట్టేయడంతో ఆ మొత్తం కట్టమని అంకిత్‌పై వజ్రాల యజమానులు ఒత్తిడి చేస్తారు. అదే సమయంలో భారత హోంశాఖ మంత్రికి వజ్రాలను డెలివరీ చేసే అసైన్‌మెంట్‌ ఒకటి వస్తుంది. దీంతో ఆ వజ్రాలను కొట్టేసి, వాటిని మార్చి, రూ.20కోట్ల నష్టపరిహారం చెల్లించాలని ప్లాన్‌ వేస్తాడు. ఇదే విషయాన్ని నేహాకు కూడా చెబుతాడు. దీంతో ఇద్దరూ విమానం ఎక్కుతారు. సరిగ్గా అదే సమయంలో విమానాన్ని ఉగ్రవాదులు హైజాక్‌ చేస్తారు. ఈ హైజాక్‌  నుంచి అంకిత్‌, నేహా, ఇతర ప్రయాణికులు ఎలా బయటపడ్డారు? (chor nikal ke bhaga movie review) అంకిత్‌ వజ్రాలను మార్చేసి నకిలీవి పెట్టగలిగాడా? రా డిప్యూటీ చీఫ్‌ (శరద్‌ ఖేల్కర్‌) హైజాక్‌ చేసిన వారెవరో కనిపెట్టాడా? తెలియాలంటే సినిమా చూడాల్సిందే!

ఎలా ఉందంటే: పౌరులు, ప్రయాణికులను బంధించి ఉగ్రవాదాలు తమ డిమాండ్‌లను నెరవేర్చుకోవడం, అమాయక ప్రజలను కాపాడేందుకు పోలీసులు, ఎన్‌ఎస్‌జీ కమాండోలు రంగంలోకి ఆపరేషన్లు చేయడం నేపథ్యంతో అన్ని భాషల్లోనూ సినిమాలు వచ్చాయి. చివరి వరకూ ఉత్కంఠగా సాగే ఇలాంటి సినిమాలు మంచి థ్రిల్‌ను పంచుతాయి. ఇప్పుడు అజయ్‌ సింగ్‌ దర్శకత్వంలో వచ్చిన ‘చోర్‌ నికల్‌ కె భాగా’ కూడా అలాంటిదే. మొదటి నుంచి చివరి వరకూ ప్రేక్షకుడిని ఉత్కంఠకు గురిచేస్తూ అలరించడంలో దర్శకుడు అజయ్‌ విజయం సాధించారు. తాను చెప్పాలనుకున్న పాయింట్‌ను సూటిగా సుత్తిలేకుండా చెప్పాడు. 1 గంటా 50 నిమిషాల పాటు సాగే సినిమాలో బోరింగ్‌ అనిపించే సన్నివేశాలు చాలా తక్కువ. అంకిత్‌ను రా డిప్యూటీ చీఫ్ విచారించే సన్నివేశంతో కథను ప్రారంభించిన దర్శకుడు అసలు ఏం జరిగి ఉంటుందనే ఉత్సుకతతో సినిమాను ప్రారంభించాడు. అక్కడి నుంచి అంకిత్‌, నేహాల పరిచయం, ప్రేమతో తదితర సన్నివేశాలతో కథను కాస్త నెమ్మదిగా సాగుతుంది. అసలు పాయింట్ రావడానికి కాస్త సమయం పడుతుంది. ఎప్పుడైతే అంకిత్‌, నేహాలు వజ్రాలను మార్చేయాలని ప్లాన్‌ వేస్తారో అప్పటి నుంచి కథ, కథనం పరుగులు పెడుతుంది. (chor nikal ke bhaga movie review) విమానం హైజాక్‌ అయిన తర్వాత వచ్చే ప్రతి ట్విస్ట్‌ మెప్పిస్తుంది. అసలు ప్రేక్షకుడికి ఊహకు ఏమాత్రం అందని రీతిలో కథనాన్ని తీర్చిదిద్దిన విధానం బాగంది. ద్వితీయార్ధంలో ఒక్కో ముడిని విప్పుతుంటే భలే ఆసక్తిగా ఉంటుంది. హైజాక్‌ ఎవరు చేశారు? ఎందుకు చేశారు? వంటి విషయాలను తెరపైనే చూస్తే బాగుంటాయి. ఇంతకు మించి చెబితే స్పాయిలర్‌ అవుతుంది.

ఎవరెలా చేశారంటే: యామి గౌతమ్‌ ఈ సినిమాకు సెంటరాఫ్‌ అట్రాక్షన్‌. సినిమా మొత్తం ఆమె చుట్టూనే తిరుగుతుంది. కథకు కర్త, కర్మ, క్రియ మొత్తం తనే. ఎయిర్‌హోస్టెస్‌గా, ప్రేమికురాలిగా యామి చాలా బాగా నటించింది. ద్వితీయార్ధంలో ఆమె నటన హైలైట్‌. అంకిత్‌గా సన్నీ కౌశల్‌ కూడా బాగానే నటించాడు. మిగిలిన వాళ్ల పాత్రలు పరిమితం. ఎవరి పాత్రకు వారు న్యాయం చేశారు. సాంకేతికంగా సినిమా బాగుంది. విశాల్‌ మిశ్రా సంగీతం, జియాన్నీ సినిమాటోగ్రఫీ ఓకే. చారు టక్కర్‌ ఎడిటింగ్‌ సూటిగా, క్లుప్తంగా ఉంది. (chor nikal ke bhaga movie review) దర్శకుడు అజయ్‌ సింగ్‌ రాసుకున్న హైజాక్‌ అనే పాయింట్‌ పాతదే అయినా, దానికి అదనపు హంగులు, ట్విస్ట్‌లు జోడించి తెరకెక్కించిన తీరు బాగుంది. ముఖ్యంగా ఓటీటీని దృష్టిలో పెట్టుకునే సినిమాను తీర్చిదిద్దిన విధానం అలరిస్తుంది. ఎక్కడా అసభ్యతకు తావు లేదు. ఈ వీకెండ్‌లో కుటుంబంతో కలిసి ఏదైనా ఆసక్తికర సినిమా చూడాలంటే ‘చోర్‌ నికల్‌ కె భాగా’ బెస్ట్‌ ఛాయిస్‌. తెలుగు ఆడియో కూడా అందుబాటులో ఉంది.

బలాలు: + యామి గౌతమ్‌; + దర్శకత్వం; + ట్విస్ట్‌లు

బలహీనతలు: - ప్రథమార్ధంలో కొన్ని సన్నివేశాలు

చివరిగా: ‘చోర్‌ నికల్‌కె భాగా’.. ట్విస్ట్‌లతో అలరించి మరీ దొంగ పారిపోయాడు! (chor nikal ke bhaga movie review)

గమనిక: ఈ సమీక్ష సమీక్షకుడి దృష్టి కోణానికి సంబంధించింది. ఇది సమీక్షకుడి వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే!Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని