Sarath Babu: సినిమా ఒక గొప్ప నటుడిని కోల్పోయింది.. సినీ ప్రముఖల సంతాపం

శరత్‌బాబు (Sarath Babu) మరణం పట్ల పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు సంతాపం ప్రకటించారు. 

Updated : 22 May 2023 21:05 IST

Sarath Babu.. ప్రముఖ నటుడు, ఆమదాల వలస అందగాడు శరత్‌బాబు (Sarath Babu) మరణంతో సినీ పరిశ్రమలో విషాదం నెలకొంది. శరత్‌బాబు మరణ వార్త విని పలువురు సినీ ప్రముఖులు, రాజకీయ నాయకులు దిగ్భ్రాంతికి గురయ్యారు. ఆయన పార్థివదేహాన్ని చూసేందుకు పలువురు నటీనటులు తెలుగు ఫిలిం ఛాంబర్‌ వద్దకు చేరుకుంటున్నారు. మరోవైపు, సోషల్‌మీడియా వేదికగా ఆయన మృతికి సంతాపం ప్రకటిస్తూ ట్వీట్స్‌ చేస్తున్నారు.

‘‘విలక్షణ నటుడు శరత్‌బాబు మరణవార్త నన్నెంతో బాధించింది. ఎన్నో అద్భుతమైన పాత్రల రూపంలో ఆయన ఎప్పటికీ గుర్తుండిపోతారు. ఆయన కుటుంబసభ్యులకు నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను’’ - ప్రధాని నరేంద్రమోదీ

‘‘వెండితెర ‘జమిందార్’, ప్రముఖ నటుడు శరత్‌బాబు మరణ వార్త  కలచివేసింది. అందం, హుందాతనం ఉట్టిపడే తన నటనతో ప్రేక్షకుల మనసులో స్థానం సంపాదించుకున్న ఆయనతో నాకు మంచి అనుబంధం ఉంది. అనేక చిత్రాలలో ఆయన నా సహనటుడిగా నటించారు. ఆయన కుటుంబసభ్యులకు, అభిమానులందరికీ నా ప్రగాఢ సంతాపం. ఓం శాంతి’’ - చిరంజీవి

‘‘సీనియర్ సినీ నటులు శరత్‌బాబు మరణవార్త దిగ్భ్రాంతికి గురి చేసింది. వివిధ భాషాచిత్రాల్లో హీరో, విలన్, సహాయనటుడిగా నటించి దక్షిణాది సినీ పేక్షకులను మెప్పించిన ఆయన మృతి సినీరంగానికి తీరని లోటు. ఆయన ఆత్మశాంతికై ప్రార్థిస్తూ, ప్రగాఢ సంతాపాన్ని తెలియజేస్తున్నాను’’  - నారా చంద్రబాబు నాయుడు

‘‘ శరత్‌బాబు మరణం కలచివేసింది. ఆయన మృతి చిత్రపరిశ్రమకు తీరని లోటు.శరత్‌బాబు కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నా’’ - కేసీఆర్‌

‘‘శరత్‌బాబు విలక్షణమైన నటనతో చిత్రసీమలో తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్నారు. కథానాయకుడిగా, ప్రతినాయకుడిగా, సహాయనటుడిగా తనదైన ముద్ర వేశారు. క్రమశిక్షణ, అంకితభావం గల నటుడు. ఆయనతో కలసి పని చేయడం మర్చిపోలేని అనుభూతి. ఈ రోజు ఆయన మన మధ్య లేకపోవడం ఎంతో బాధాకరం. ఆయన మరణం పరిశ్రమకు తీరని లోటు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుడిని ప్రార్ధిస్తున్నాను. ఆయన కుటుంబ సభ్యులందరికీ నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాను’’ - బాలకృష్ణ

‘‘గొప్ప నటుడు, నాకు మంచి స్నేహితుడు శరత్‌బాబు అకాల మరణ వార్త నన్నెంతో బాధించింది. నా గురువు కె.బాలచందర్‌ ఆయన్ని తమిళ పరిశ్రమకు పరిచయం చేశారు. శరత్‌బాబుతో కలిసి పనిచేసిన ఆరోజులు నా మదిలో మెదులుతున్నాయి. ఎప్పటికీ గుర్తుండిపోయే ఎన్నో అద్భుతమైన పాత్రల్లో ఆయన నటించారు. సినిమా ఒక గొప్ప నటుడిని కోల్పోయింది’’ - కమల్‌హాసన్‌

‘‘విలక్షణ నటుడు శరత్‌బాబు మరణం విచారకరం. ఇండియన్‌ సినిమాకు ఆయన అందించిన సేవలు ఎప్పటికీ గుర్తుంటాయి. ఆయన కుటుంబసభ్యులకు నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నా. ఓం శాంతి’’ - ఎన్టీఆర్‌

‘‘మాటలు రావడం లేదు. ఎంతో బాధగా ఉంది. RIPSarathBabu’’ - రాధిక

‘‘అద్భుత నటుడినే కాదు.. ఓ మంచి వ్యక్తిని మనం కోల్పోయాం. ఆయన్ని తలచుకుంటే మనసుని హత్తుకునే జ్ఞాపకాలు మదిలో మెదులుతాయి. ఆయన చిరునవ్వు, ధైర్యాన్ని ఇచ్చే మాటలు, అండగా నిలిచే ఆ చేతులను ఇకపై ఎంతగానో మిస్‌ అవుతా. ఆయన్ని నేను ఎప్పుడూ పెద్దన్న అని ఆప్యాయంగా పిలిచేదాన్ని. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తున్నా’’ - ఖుష్బూ  

‘‘సుమారు 5 దశాబ్దాలుగా తెలుగు, తమిళం, కన్నడ, మలయాళ భాషల్లో కథానాయకుడు, సహాయనటుడిగా నటించిన సీనియర్‌ నటుడు శరత్‌బాబు కన్నుమూయడం కళారంగానికి తీరని లోటు. చివరిసారిగా ఆయన  ‘మళ్ళీపెళ్లి’లో ఒక అద్భుతమైన పాత్రలో నటించారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తున్నాం.’’ - మళ్ళీ పెళ్లి టీమ్‌Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని