Updated : 28 May 2022 12:10 IST

NTR Jayanthi: ఈ గుండెని మరొక్కసారి తాకిపో తాతా : జూ.ఎన్టీఆర్‌

జీవితంలో ఒక్కసారైనా ఎన్టీఆర్‌తో సినిమా చేయగలనా అని అనుకున్నా : రాఘవేంద్రరావు

హైదరాబాద్‌: ‘‘జీవితంలో ఒక్కసారైనా ఎన్టీఆర్‌తో సినిమా చేయగలనా..? అనుకున్నా. కానీ ఆయనతో గొప్ప సినిమాలు తెరకెక్కించే అదృష్టం నాకు దక్కింది’’ అంటున్నారు దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు. విశ్వవిఖ్యాత నట సార్వభౌముడు ఎన్టీఆర్‌ శత జయంతిని పురస్కరించుకుని శనివారం ఉదయం రాఘవేంద్రరావు నివాళులర్పించారు. ఎన్టీఆర్‌తో తనకున్న అనుబంధాన్ని గుర్తు చేసుకుంటూ ఓ ప్రత్యేక వీడియోని షేర్‌ చేశారు. రాఘవేంద్రరావుతోపాటు పలువురు సినీ ప్రముఖులు సైతం ఎన్టీఆర్‌ జయంతి సందర్భంగా సోషల్‌మీడియాలో పోస్టులు పెట్టారు.

‘‘నందమూరి తారకరామారావు శతజయంతి ఉత్సవాల సందర్భంగా ఆయనకు శతకోటి వందనాలు. కాలేజీలో చదువుతున్న రోజుల్లో ఆయన సినిమాలు చూసేవాడిని. రాముడు, రావణుడు, దుర్యోధనుడు, కృష్ణుడిగా ఆయన ఎన్నో గొప్ప పాత్రలు పోషించారు. జీవితంలో ఒక్కసారైనా ఆయనతో సినిమా చేయగలనా..?అనుకునేవాడిని. భగవంతుడి దయ వల్ల అసిస్టెంట్‌ డైరెక్టర్‌గా మొదటిసారి ఆయన సినిమాకు పనిచేయడం, ఆయనపై క్లాప్‌ కొట్టే అవకాశం వచ్చింది. నేనెంతో అదృష్టవంతుడిని అనుకున్నా. ఆతర్వాత ‘అడవిరాముడు’ లాంటి గొప్ప చిత్రానికి నన్ను దర్శకుడిగా ఆయన ఎంపిక చేయడం మాటల్లో చెప్పలేని ఆనందాన్ని ఇచ్చింది. ఆయన రుణాన్ని నేను ఎప్పటికీ మర్చిపోలేను. ‘అడవిరాముడు’ అఖండ విజయం నా సినీ భవిష్యత్తుకి ఓ కొత్త బంగారుబాట వేసింది. ‘కేడీ నం: 1’, ‘డ్రైవర్‌ రాముడు’, ‘వేటగాడు’, ‘జస్టిస్‌ చౌదరి’, ‘కొండవీటి సింహం’, ‘మేజర్‌ చంద్రకాంత్‌’ ఇలా ఎన్నో చిత్రాలకు ఆయనతో కలిసి పనిచేసే భాగ్యం లభించింది. ఆయనతో కలిసి ఉన్న క్షణాలు నాకెప్పటికీ గుర్తుండిపోతాయి. ఇవాళ నేను ఈ స్థాయిలో ఉండటానికి అన్నగారే కారణం. ఆయన రుణం తీర్చుకోలేనిది. ఆయన ఎక్కడ ఉన్నా ఆయన ఆశీస్సులు మనందరికీ ఉండాలని కోరుకుంటున్నా’’ - రాఘవేంద్రరావు

‘‘మీ పాదం మోపక తెలుగు ధరిత్రి చిన్నబోతోంది. మీ రూపు కానక తెలుగు గుండె తల్లడిల్లిపోతోంది. పెద్ద మనసుతో ఈ ధరిత్రిని, ఈ గుండెని మరొక్కసారి తాకిపో తాతా’’ - జూ.ఎన్టీఆర్‌

‘‘నటుడిగా అలరించి, అబ్బుర పరచి.. అఖండ ఖ్యాతి నార్జించారు! నాయకుడిగా అండనిచ్చి, అభివృద్ధినందించి.. ఆదర్శప్రాయుడయ్యారు!! వ్యక్తిగా ఆత్మగౌరవానికి నిలువెత్తురూపంగా నిలిచారు!! తెలుగువారి గుండెల్లో మీ స్థానం..సుస్థిరం.. సమున్నతం.. శాశ్వతం!!’’ - శ్రీనువైట్ల

‘‘ఆయన కలియుగ దైవం. నమ్ముకున్నవారికి ఆర్తత్రాణ పరాయణుడు. ఈ రోజు నుంచి వారి శత జయంతి ప్రారంభమౌతుంది. అన్నగారూ మీకు జన్మదిన శుభాకాంక్షలు. తెలుగుజాతిని ఆశీర్వదించండి. తెలుగు అన్న మూడు అక్షరాలను విశ్వవ్యాప్తం చేసిన మహానుభావా వందనం శిరసాభివందనం’’ -పరుచూరి గోపాలకృష్ణ

‘‘ఇంతకు ముందు, ఇకపై ఆయనలా ఎవరూ లేరు. ఉండరు. వన్‌ అండ్‌ ఓన్లీ ఎన్టీఆర్‌’’ - హరీశ్‌ శంకర్‌Read latest Movies News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

మరిన్ని