ఇంటర్వ్యూ: నా వ్యక్తిగత జీవితమే ‘ఎఫ్‌-2’

తెలుగు సినిమా సెల్యూలాయిడ్‌పై హాస్యాన్ని ప్రధానాంశంగా ఎంచుకొని దానికి ఎన్నో వినూత్నమైన కథాంశాలు జోడించి విజయాలతో దూసుకెళ్తోన్న దర్శకుడు అనిల్‌రావిపూడి. ‘పటాస్‌’తో ఆయన టాలెంట్‌ను పరిచయం చేసి ‘సుప్రీమ్‌’ డైరెక్టర్‌ అయి..

Updated : 15 Feb 2021 14:51 IST

ఈనాడు ‘పదవినోదం’ నుంచే భాష నేర్చుకున్నా!

ఇంటర్నెట్‌ డెస్క్‌: తెలుగు సినిమా సెల్యులాయిడ్‌పై హాస్యాన్ని ప్రధానాంశంగా ఎంచుకొని దానికి ఎన్నో వినూత్నమైన కథాంశాలు జోడించి విజయాలతో దూసుకెళ్తున్న దర్శకుడు అనిల్‌ రావిపూడి. ‘పటాస్‌’తో ఆయన టాలెంట్‌ను పరిచయం చేసి ‘సుప్రీమ్‌’ డైరెక్టర్‌ అయి.. ‘రాజా ది గ్రేట్‌’ తర్వాత రావిపూడి ది గ్రేట్‌ అనిపించుకొని ‘ఎఫ్‌2’తో ఫెంటాస్టిక్‌ ఫోర్‌ పూర్తి చేసి.. ఆ తర్వాత ‘సరిలేరు నీకెవ్వరు’ అనిపించుకున్నారు. ‘శౌర్యం’ సినిమాతో రచయితగా ప్రారంభమైన ఆయన కలానికి మరింత బలాన్ని చేకూర్చారు. ఆయన దర్శకుడు మాత్రమే కాదు.. మార్గదర్శకుడూ అయ్యారు.  తెలుగు చిత్రసీమలో సక్సెస్‌ఫుల్‌ డైరెక్టర్‌గా దూసుకెళుతున్న అనిల్‌ రావిపూడి ఈటీవీలో ప్రసారమయ్యే ‘చెప్పాలని ఉంది’లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా పలు ఆసక్తికరమైన విషయాలు పంచుకున్నారు.

సినిమాల్లోలాగే ఆనందంగా, ఆహ్లాదంగా కనిపిస్తున్నారు?

అనిల్‌ రావిపూడి: నవ్వే మనకు ఎనర్జీ(నవ్వుతూ)

మీ చరిత్రలో ప్లాఫ్‌ కనిపించడం లేదు.. మీ రహస్యమేంటి?

అనిల్‌ రావిపూడి: నా హిట్‌ ఫార్ములా ప్రేక్షకులే. థ్రిల్లర్‌, యాక్షన్‌ సినిమాలు, కామెడీ.. ఇలా జోనర్‌ ఏదైనా అన్ని వర్గాల వారికి నచ్చే సినిమాలుంటాయి. నా అదృష్టం కొద్దీ నేను తీసే సినిమాలన్నీ ఎక్కడోచోట అన్ని రకాల ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాయి. సినిమా ఫలితం అనేది రెవెన్యూ మీద ఆధారపడి ఉంటుంది. ప్రతి సినిమాకు భారీ రెవెన్యూలు, ఆ తర్వాత టీవీల్లో టీఆర్‌పీలు. ఈ రెండు విషయాల్లోనూ నేను తీసే సినిమా సక్సెస్‌ అవుతోంది. ఒకే రకమైన సినిమాలు కాకుండా.. బాగా కష్టపడి భిన్నమైన కథలు చూపిస్తున్నా. ఓటమి లేకుండా ముందుకు సాగుతున్నా. అన్నింటికంటే ముఖ్యంగా సినిమా పట్ల ఉన్న భక్తి, భయం వల్లే ఇలా ఉన్నాను.

ఇటువైపు రావాలన్న ఆలోచన ఎలా వచ్చింది..?

అనిల్‌ రావిపూడి: చిన్నప్పటి నుంచి నాకు సినిమా మీద ఆసక్తి ఎక్కువ. మా ఇంట్లో పుస్తకాలతో పాటు సినిమా ఒక భాగం. ఎప్పటికైనా ఇండస్ట్రీలోకి వస్తానని నాకు నమ్మకం ఉండేది. నా అదృష్టం ఏంటంటే.. మా బాబాయ్‌ అరుణ్‌ప్రసాద్‌ గారు.. అప్పటికే ఇండస్ట్రీలో ఉన్నారు. ఆయన ‘తమ్ముడు’ సినిమాకు పనిచేశారు. ఆయన ఇక్కడ ఉండటం వల్ల కొంచెం ధైర్యం వచ్చింది. ప్రవేశం సులభంగానే సాధ్యమైనప్పటికీ ప్రయాణం మాత్రం కొంచెం కష్టంగా సాగింది. డైరెక్టర్‌ కావడానికి దాదాపు పదేళ్లు పట్టింది. 2005లో ‘గౌతమ్‌ ఎస్‌ఎస్‌సీ’ చిత్రానికి అసిస్టెంట్‌గా చేశా. 2008లో ‘శౌర్యం’ సినిమాకు రచయితగా పనిచేశాను.

ఎలా దర్శకుడిగా మారారు?

అనిల్‌ రావిపూడి: ‘పటాస్‌’ కథతో ఇద్దరు ముగ్గురు హీరోలను కలిశాను. అలా ఓసారి కల్యాణ్‌రామ్‌ను కలిసి కథ చెప్పాను. నిర్మాతలు ఎవరూ నన్ను నమ్మకపోవడంతో సినిమా పట్టాలెక్కదేమోనని భయం వేసింది. ఎవరూ చేయకపోతే తానే నిర్మిస్తానని ఆయన భరోసా ఇచ్చారు. అలా ఆ సినిమాకు ఆయనే నిర్మాతగా మారారు. ఆయన కష్టాల్లో ఉన్నప్పటికీ డబ్బు బాగానే ఖర్చు పెట్టారు. ఆయన్ని ఇబ్బంది పెట్టడం ఇష్టం లేక.. తక్కువ బడ్జెట్‌లో ఆ సినిమా తీశాను. దాని వల్ల నేరుగా వరల్డ్‌కప్‌ ఫైనల్‌ ఆడినట్లు అనిపించింది. అందుకే ‘పటాస్‌’ నా జీవితంలో ఎప్పటికీ మర్చిపోని ఓ మధురజ్ఞాపకం.

బడ్జెట్‌ ప్లానింగ్‌ ఎక్కడ నేర్చుకున్నారు?

అనిల్‌ రావిపూడి: సినిమా అనేది ఆర్ట్‌తో పాటు బిజినెస్‌ కూడా. జనాలు కూడా ఫ్రీగా ఏం చూడరు కదా. రూ.150-200 ఖర్చుపెట్టి సినిమాకు వస్తారు. మనం రూపాయి పెడితే కనీసం రూపాయి అయినా సంపాదించాలి. అలా కాకుండా.. రూపాయి పెట్టిన సినిమాకు పావలా వచ్చేలా తీస్తే మనల్ని ఎవరూ ఆదరించరు. ప్రతి సినిమాకు కనీసం మనం పెట్టింది పోకుండా ఉండాలన్నదే నా లక్ష్యం. బ్లాక్‌బస్టర్‌ అయితే.. ఆ పైన ఎంత వచ్చినా అది బోనస్‌ కిందే లెక్క. సినిమాను బట్టి కొంచెం ధైర్యం చేస్తా. ‘ఇంతవరకూ తెలుగు సినిమా చరిత్రలో రాని సినిమా తీశాడు.. కానీ డబ్బులు రాలేదంట’ అంటే ప్లాఫ్‌ కిందే లెక్క. ఎంతపేరు వచ్చినా డబ్బు కూడా ముఖ్యమే కదా.!

అనుకున్నదానికంటే ఎక్కువ బడ్జెట్‌ పెట్టిన సినిమా ఉందా..?

అనిల్‌ రావిపూడి: ఉంది. ‘ఎఫ్‌2’కు మేం అనుకున్న దానికంటే రూ.నాలుగు నుంచి ఐదు కోట్లు పెరిగింది. అంతకుముందు వరకూ పరిమితంగానే ఉన్నాం. ఎలాగైనా బ్లాక్‌బస్టర్‌ కొడతాననే నమ్మకం ఉంది. రాజుగారితో కూడా మీరు పెట్టినదానికి మూడురెట్లు సంపాదిస్తారని చెప్పాను. పెళ్లైన చాలామంది జీవితానికి కనెక్ట్‌ అయ్యే కథ అది. అందుకే ‘ఎఫ్‌2’ అనేది ప్రత్యేకం. రెవెన్యూ పరంగా రూ.80కోట్లు దాటింది. ఇంటర్నేషనల్‌ ఫిల్మ్‌ ఫెస్టివల్‌కు కూడా వెళ్లింది. ప్రదర్శన మాత్రమే కాదు.. బెస్ట్‌ డైరెక్టర్‌గా అవార్డు కూడా తెచ్చిపెట్టింది. నిజానికి ఆ సినిమాపై పెట్టిన శ్రమ చాలా తక్కువ. నా నిజజీవితంలో జరిగిన చిన్నచిన్న సంఘటనల ఆధారంగా తీసిన సినిమా అది.

ఏ సినిమాకైనా కథ ఎలా చెబుతున్నాననే దానికంటే.. ఎలాంటి సన్నివేశాలు రాబోతున్నాయి.. అనే దానిపై ఎక్కువ దృష్టి పెడతా. ఛాలెంజ్‌ తీసుకోవడానికి ఎక్కువగా ఇష్టపడతా. ‘రాజా ది గ్రేట్‌’ గురించి మాట్లాడితే.. రెండున్నర గంటల పాటు ప్రేక్షకులు సీట్లో కూర్చొని సినిమా ఆస్వాదించేలా ఒక దివ్యాంగుడి కథతో సినిమా తీయడం అంటే మామూలు విషయం కాదు. ఇప్పటికీ టీవీల్లో సినిమా చూసి నాకు ఫోన్‌ చేసేవాళ్లు ఉన్నారు. సినిమాలు థియేటర్లలో ఆడటం ఒక ఎత్తయితే.. టీవీల్లో ఆడటం మరో ఎత్తు. నేను  ఏ సినిమా తీసినా.. ఫ్యామిలీ మొత్తం చూసేలా జాగ్రత్త పడతా.

బ్లైండ్‌ బట్‌ ఐయామ్‌ ట్రైన్డ్‌.. నెవ్వర్‌ బిఫోర్‌ ఎవ్వర్‌ ఆఫ్టర్‌..  ఇలాంటి డైలాగ్స్‌ ఎలా వస్తాయి?

అనిల్‌ రావిపూడి: జంధ్యాల గారికి నేను పెద్ద అభిమానిని. ఆయన సినిమాలు ఇప్పుడు విడుదలై ఉంటే బాక్సాఫీస్‌ బద్దలయ్యేది. ఆయన గొప్ప డైరెక్టర్‌. ‘చంటబ్బాయ్‌’ సినిమాలో.. బంగాళ భౌభౌ.. అరటిపండు లంబాలంబా.. ఇలాంటి టిపికల్‌ పదాలు వాడడంలో ఆయన దిట్ట. ఆ తర్వాత ఈవీవీగారు అదే ఒరవడి కొనసాగించారు. వాళ్ల సినిమాలు ఎక్కువగా చూడటం వల్ల తెలియకుండానే నా సినిమాల్లో అలాంటి డైలాగులు వస్తుంటాయి.

‘అంతేగా అంతేగా..’ ప్రదీప్‌ ఎలా తట్టారు?

అనిల్‌ రావిపూడి: జంధ్యాల గారి హాస్యోత్సవం చేసేటప్పుడు ప్రదీప్‌గారితో పరిచయం ఏర్పడింది. ఆయన జంధ్యాలగారి విద్యార్థి. కామెడీ టైమింగ్‌ కూడా బాగా తెలుసు. రెండు సీన్లు చేయగానే.. ‘మీ కెరీర్‌కు ఇదొక మలుపు.. ఇప్పటి నుంచి ‘అంతేగా అంతేగా’ అంటారు చూడండి’ అని చెప్పాను. ‘ఎఫ్-‌3’లో కూడా అది కొనసాగిస్తున్నాం. ‘ఎఫ్-2’లో ఉన్న పాత్రలన్నీ రాబోయే సినిమాలోనూ ఉంటాయి. ‘ఎఫ్-‌2’కు మించి ‘ఎఫ్‌-3’ అలరిస్తుంది.

తెలుగుపై ఇంత పట్టు ఎలా వచ్చింది?

అనిల్‌ రావిపూడి: నేను అస్సలు పుస్తకాలు చదవను. పుస్తకం ఒక మూడు పేజీలు తిప్పగానే నిద్రతో పడుకొని పోతాను.  ‘ఈనాడు’ సండేబుక్‌లో వచ్చే ‘పదవినోదం’ నింపేవాడిని. చాలా వేగంగా పూరించేవాడిని. తెలుగు పదాల మీద పట్టు.. కొన్ని కొత్త పదాలు నేర్చుకోవడం దాని వల్లే అలవాటైంది. పదవినోదం అంటేనే పట్టుకోవడం. దాన్ని పూరించడం వల్ల నాకు తెలియకుండానే పదాలపై పట్టు లభించింది. ఇక సాహిత్యం స్వయంగా చదవకపోయినా.. ఎంతోమంది సాహిత్యం చదివిన డైరెక్టర్‌లు ఉన్నారు. వాళ్లు తీసిన సినిమాలు చూడటం వల్ల ఆ ప్రభావం నాపై ఉండొచ్చు. ఇప్పుడు త్రివిక్రమ్‌ ఉన్నారు. ఆయన బోలెడు పుస్తకాలు చదువుతారు. ఆయన సినిమాలు చూసినప్పుడు మనకు తెలియకుండానే.. మనకూ సాహిత్యం అబ్బుతుంది.

‘సుప్రీమ్‌’ సినిమా సమయంలో ఏమైనా జాగ్రత్తలు పాటించారా?

అనిల్‌ రావిపూడి: మెగాస్టార్‌ చిరంజీవిగారి మేనల్లుడు కాబట్టి కచ్చితంగా ఆయన పోలికలు సాయి తేజ్‌కు వస్తాయి. తేజ్‌ కూడా కావాలని వాటిని చూపించుకోవాలని ఎక్కడా ప్రయత్నించడు. డైరెక్టర్‌ కావాలని చూపిస్తే తప్పితే. చిరంజీవిగారి మేనరిజం అంటే నాక్కూడా ఇష్టమే. అందుకే ఆసినిమాలోని కొన్ని సన్నివేశాల్లో వాటిని వాడాను.

మహేశ్‌బాబు కోసమే ‘సరిలేరు నీకెవ్వరు’ కథ రాశారా?

అనిల్‌ రావిపూడి: లేదు. అయితే, నా కథను దాదాపు 45 నిమిషాల పాటు ఆయనకు చెప్పాను. కథ నచ్చి వెంటనే చేద్దాం అన్నారు. అప్పుడు ‘ఎఫ్‌-2’ షూటింగ్‌ దశలో ఉంది. ‘మీరు సినిమా పూర్తి చేయండి.. తర్వాత మనం సినిమా చేద్దాం’ అని ఆయన అన్నారు. ‘ఎఫ్-‌2’ విడుదలైన తర్వాత సుకుమార్‌ గారి సినిమా వాయిదా పడటం వల్ల మా సినిమా ముందుకు వచ్చింది.

దాదాపు 13ఏళ్లుగా సినిమాకు దూరంగా ఉంటున్న విజయశాంతిని ఎలా ఒప్పించారు?

అనిల్‌ రావిపూడి: ఆవిడ మళ్లీ సినిమాల్లోకి వస్తే చూడాలని ఎప్పటి నుంచో నా మనసులో ఉండేది. ‘రాజా ది గ్రేట్‌’ సమయంలోనే ఆమెకు కథ చెప్పాను. ఆవిడ కొంచెం ఆలోచించారు. ఎందుకంటే.. మొదటిసారి కథ చెప్పినప్పుడు అంత పవర్‌ఫుల్‌గా లేదు. అయితే.. చివరికి కథ మొత్తం ఆమె చుట్టూ తిరుగుతూ ఉండేలా తీర్చిదిద్దాను. మరలా అవకాశం వస్తే ఆమెతో సినిమా చేయాలనిపిస్తుంది.

మీకు బాగా నచ్చిన రచయిత ఎవరు?

అనిల్‌ రావిపూడి: జంధ్యాలగారే. ఇప్పటికాలంలో ఈవీవీ గారి దగ్గర ఎంతమంది పనిచేశారో తెలియదు కానీ, ఆ రచయితలందరికీ ధన్యవాదాలు. ఆయన సినిమాలు కూడా నా మీద బాగా ప్రభావం చూపించాయి. కృష్ణారెడ్డి గారి సినిమాలు, దివాకర్‌బాబు, ఎల్బీ శ్రీరామ్‌, ఎంఎస్‌ నారాయణగారు ఇలా అందరి ప్రభావం నాపై ఉంది.

రాజేంద్రప్రసాద్‌ దాదాపు మీ సినిమాలన్నింటిలో ఉన్నారు కదా..!

అనిల్‌ రావిపూడి: నాకు బాగా నచ్చిన హీరో రాజేంద్రప్రసాద్‌. ఆయనతో ‘పటాస్‌’ చేయలేకపోయా. ‘సుప్రీమ్‌’లో కూడా చాలా చిన్న పాత్ర చేశారు. నిజానికి ఆయన చేయకూడని పాత్ర అది. మా పడవలోకి ఎక్కండి తర్వాత దాన్ని ఎలా నడిపిస్తానో చూడండి అని పడవ ఎక్కించా..! అలా మా ఇద్దరి ప్రయాణం ‘రాజా ది గ్రేట్’‌, ‘ఎఫ్-‌2’, ‘ఎఫ్-‌3’, ‘గాలిసంపత్‌’ కొనసాగుతోంది. సందర్భం వచ్చింది కాబట్టి చెబుతున్నా ‘గాలి సంపత్‌’లో శ్రీవిష్ణు, రాజేంద్రప్రసాద్‌ ఇద్దరే కీలకం. ఆ ప్రాజెక్టు నేనే దగ్గరుండి చూసుకున్నాను. ‘గాలి సంపత్‌’ నా కెరీర్‌లో ప్రత్యేకమైన చిత్రం అవుతుంది. నేనెందుకు చెప్తున్నానో రేపు సినిమా చూశాక మీకు అర్థమవుతుంది. రాజేంద్రప్రసాద్‌ గారి కెరీర్‌లో ఇదొక బెంచ్‌మార్క్‌ సినిమా అవుతుంది. ఆయనది అవార్డు విన్నింగ్‌ పెర్ఫార్మెన్స్‌.

మీకు బాగా నచ్చే హాస్యనటులు?

అనిల్‌ రావిపూడి: రాజేంద్రప్రసాద్‌ గారిని ఒక పరిపూర్ణ నటుడిగా ఇష్టపడతాను. కమెడియన్ల విషయానికి వస్తే.. బ్రహ్మానందం, సునిల్‌ నాకు బాగా ఇష్టం.

సాయికార్తీక్‌ను కాదని దేవిశ్రీతో చేయడానికి కారణమేమిటి?

అనిల్‌ రావిపూడి: సాయికార్తీక్‌ మంచి సంగీత దర్శకుడు. నా మొదటి మూడు సినిమాల్లో అద్భుతమైన సంగీతం ఇచ్చారు. అందులో ఎలాంటి అనుమానం లేదు. అయితే.. మార్పు కోసం మాత్రమే దేవిశ్రీతో పనిచేశాను. నేనవరితోనైనా ప్రయాణం ప్రారంభిస్తే అది అలాగే కొనసాగుతుంది. అలా దేవితో సెట్‌ అయింది.

‘ఎఫ్-‌2’ను బాలీవుడ్‌లో రీమేక్‌ చేస్తున్నారట? దానికి కూడా మీరే డైరెక్టరా?

అనిల్‌ రావిపూడి: బాలీవుడ్‌లో రీమేక్‌ చేస్తున్నది వాస్తవమే. అయితే.. దానికి నేను దర్శకత్వం వహించడం లేదు. చిన్నచిన్న మార్పులు చేసుకొని వాళ్లే తెరకెక్కిస్తున్నారు.

‘ఎఫ్-‌3’ తర్వాత రామ్‌చరణ్‌తో సినిమా చేస్తున్నారని వార్తలు వస్తున్నాయి?

అనిల్‌ రావిపూడి: లేదు. అందులో ఎలాంటి నిజం లేదు. ఆయనతో ఇప్పటి వరకూ సినిమా గురించి ఎప్పుడూ మాట్లాడలేదు. అవకాశం వస్తే మాత్రం కచ్చితంగా చేస్తా.

ప్రతి చిత్రానికి మీకు రాఘవేంద్రరావు నుంచి ఫోన్‌ వస్తుందట?

అనిల్‌ రావిపూడి: అవును. ఆయనంటే నాకు ఎంతో అభిమానం. ఇద్దరం ఎన్నో విషయాలు పంచుకుంటాం. ఒక్కోసారి కథలో సత్తా లేకపోయినా.. మేకింగ్‌తో మ్యాజిక్‌ చేసి ప్రేక్షకులను ఎలా కట్టిపడేయవచ్చనేది ఆయనకు బాగా తెలుసు. అందుకే ఆయనను దర్శకేంద్రుడు అన్నారు. ఆయన ఒక జీనియస్‌. విమర్శించడం చాలా సులభం. కానీ.. మెచ్చుకోవడం చాలా గొప్ప విషయం. అదే ఆయనలో ఉన్న గొప్పతనం. ప్రతి సినిమాకు ఆయన నాకు ఫోన్‌ చేసి పిలిచి మాట్లాడతారు. సినిమా బాగుందని ఆయన చెబితే ఒక ఎనర్జీ వస్తుంది. ఒకసారి ఆయన మా ఊరికి వచ్చి రెండ్రోజులు ఉన్నారు. అదో గొప్ప జ్ఞాపకం.

‘సరిలేరు నీకెవ్వరు’లో ఒక పాత్రకు జగపతిబాబును అనుకొని మార్చారట?

అనిల్‌ రావిపూడి: అవును. కొన్ని కారణాల వల్ల అలా చేయాల్సి వచ్చింది. ఆయన కూడా దాన్ని అర్థం చేసుకున్నారు. తర్వాత ఆయనను కలిసి థాంక్స్‌ చెప్పాను. ఆయన స్థానంలో వేరేవాళ్లు ఉండి ఉంటే.. దాన్ని ఇంకోలా ఆపాదించేవాళ్లు.

పనిలో బిజీగా ఉన్నప్పుడు ఎవరైనా మీకు విసుగుపుట్టిస్తే పట్టించుకోరట?

అనిల్‌ రావిపూడి: అలాంటి సమయాల్లో నన్ను ఎవరైనా తిట్టినా నేను నవ్వుతా. అదే నా బలం. మనల్ని ఇబ్బంది పెట్టేవాళ్లు మన చుట్టూ ఉంటే మనం ఇంకా జాగ్రత్తగా పనిచేస్తాం. అలా ఉండటం కూడా మనకు కలిసొచ్చే విషయమే. ఎవరూ కావాలని విసుగు తెప్పించరు. అనుకోకుండా చేస్తుంటారు. డైరెక్టర్‌ అనేవాడు నవ్వుతూ ఉంటే సెట్లో సానుకూల దృక్పథం నెలకొంటుంది. ఆర్టిస్టులు కూడా బాగా చేస్తారు. ఒకసారి వెంకటేశ్‌గారు నాపై కోప్పడ్డప్పుడు కూడా నేను నవ్వుతూ ఉండిపోయాను. వెంటనే ఆయన నా దగ్గరకు వచ్చి కౌగిలించుకొని ‘నువ్వు గ్రేట్‌’ అని  చిరునవ్వులు చిందించారు.

హీరోగా చేసే అవకాశం ఉందా?

అనిల్‌ రావిపూడి: హీరోగా కాదు. కానీ.. నటుడిని అవుతానేమో. అది కూడా నన్ను డైరెక్టర్‌గా ప్రేక్షకులు ఇక చాలు అనుకున్నప్పుడు.. ఆలోచిస్తా.(నవ్వుతూ)

ఏ హీరోతో సినిమా చేయాలని ఉంది?

అనిల్‌ రావిపూడి: 1987-88 సమయంలో సినిమా చూడటం మొదలుపెట్టాను. అక్కడి నుంచి సినిమానే నా ప్రపంచం. చిరంజీవి, నాగార్జున, వెంకటేశ్‌, బాలకృష్ణ, రాజేంద్రప్రసాద్‌.. అంటే నాకెంతో అభిమానం. వెంకటేశ్‌, రాజేంద్రప్రసాద్‌తో సినిమా చేశాను. మిగిలిన వాళ్లతో చేయాలని ఉంది. జీవితంలో వెనక్కి తిరిగి చూస్తే.. నా చిన్నతనంలోనే నన్ను సినిమావైపు లాగిన హీరోలను డైరెక్ట్‌ చేశాననేది కిక్‌ ఇస్తుంది. చేస్తానన్న నమ్మకం కూడా ఉంది.

హీరోలతో కామెడీ చేయిస్తే.. వాళ్ల ఇమేజ్‌ తగ్గుతుందనే సంకోచం మీలో రాలేదా?

అనిల్‌ రావిపూడి: అది స్క్రిప్ట్‌ మీద ఆధారపడి ఉంటుంది. స్క్రిప్ట్‌లో బలం, బలహీనతలు ఉంటాయి. ‘పటాస్‌’ ఒక సీరియస్‌ పోలీస్‌ కథ. అయితే.. అందులో కామెడీ లేకుండా తీసి ఉంటే ఆ సినిమా అంత హిట్‌ అయి ఉండేది కాదు. కల్యాణ్‌రామ్‌ కామెడీ చేస్తారా? అని చాలామంది అనుకున్నారు. కానీ అందులో ఆయన నటన అద్భుతంగా ఉంటుంది. అభిమానులు కూడా ఆస్వాదించారు. హీరో పాత్ర మీద బరువు ఉంటే కామెడీ చేయించడం కుదరదు. అందుకే.. ఇతర పాత్రలపై బరువు పెట్టి హీరో పాత్రకు స్వేచ్ఛనిస్తా. అప్పుడే హీరో ఏదైనా చేయవచ్చు. ‘సరిలేరు నీకెవ్వరు’లో ఆర్మీ ప్రస్తావన ఉండటం వల్ల మహేశ్‌బాబు గారితో ఎక్కువ కామెడీ చేయించలేకపోయాను.

సాధారణంగా ఏ సినిమాకైనా ప్రతినాయకుడిని చంపడంతో సినిమా పూర్తి అవుతుంది. కానీ ‘సరిలేరు నీకెవ్వరు’లో విలన్‌ని మార్చడంతో సినిమాకి శుభం కార్డు పడుతుంది? అలా చేయాలని ఎందుకు అనుకున్నారు?

అనిల్‌ రావిపూడి: ఏదైనా కొత్తగా చెప్పాలనుకున్నా. అలా, అక్కడ కొంత రిస్క్‌ తీసుకుని క్లైమాక్స్‌ని ఆ విధంగా చూపించాను. ప్రేక్షకులు నుంచి మంచి స్పందన వచ్చింది.

క్లైమాక్స్‌ గురించి ప్రస్తావించినప్పుడు మహేశ్‌ లేదా వేరే ఎవరైనా అభ్యంతరం వ్యక్తం చేశారా?

అనిల్‌ రావిపూడి: లేదు. మహేశ్‌ అయితే అద్భుతంగా ఉంది అన్నారు. కథల విషయంలో ఆయనకు మంచి అవగాహన ఉంది. ‘కొత్తగా ఉంది. తప్పకుండా మీరు చెప్పినట్లే చేద్దాం’ అని ఆయన కథ చెప్పిన వెంటనే సరే అన్నారు.

నిజజీవితంలో మీరు ఎదుర్కొన్న సంఘటనలను ఎప్పుడైనా మీ సినిమాల్లో చూపించారా?

అనిల్‌ రావిపూడి: నేను ఎలా అయితే సినిమా చూడడానికి ఆసక్తి కనబరుస్తానో అలాగే తెరకెక్కిస్తాను. ఏ డైరెక్టర్‌ అయినా అంతే. ప్రతిఒక్కరికీ ఓ వ్యక్తిగతమైన అభిరుచి ఉంటుంది. అందుకే ఏ ఇద్దరు డైరెక్టర్లూ ఒకేలా సినిమా తీయలేరు. డైరెక్టర్‌ వ్యక్తిగత జీవితం, అనుభవాలు చాలావరకూ ఆయన తెరకెక్కించే సినిమాలపై ప్రభావం చూపిస్తాయి. నిజ జీవితంలో నేను ఎంతో సరదాగా ఉండే వ్యక్తిని. అందుకే నా సినిమాల్లో కూడా ఎంటర్‌టైన్‌మెంట్‌ ఎక్కువగా ఉంటుంది.

మీ సినిమాలు రీమేక్‌ చేయాలనిపిస్తే. ఏది చేస్తారు?
అనిల్‌ రావిపూడి: రాజా ది గ్రేట్‌

ఇండస్ట్రీలోకి రావాలి, డైరెక్షన్‌ చేయాలి అనుకునే వాళ్లకి మీరు ఇచ్చే సలహా?

అనిల్‌ రావిపూడి: పరిశ్రమలో నిలదొక్కుకోవడం ఎంతో ముఖ్యమైన విషయం. దర్శకుడిగా ఓ విజయవంతమైన ట్రాక్‌ ఏర్పాటు చేసుకోవడం ముఖ్యం. దానిని సాధించాలి అంటే ఓర్పు ఎంతో అవసరం. అది ఉంటే మనం ఏదైనా సాధించవచ్చు. నెగెటివికీ దూరంగా ఉండాలి. మన ఫోకస్ అంతా మన పనులపైనే ఉండాలి. శ్రమించే గుణం ఉండాలి.

‘‘నా వ్యక్తిగత జీవితమే ఎఫ్‌-2. నా భార్యకు చెప్పే ఆ కథ రాశాను. మా ఇద్దరి జీవితాల్లో జరిగిన కొన్ని అంశాలను ఆధారంగా చేసుకుని కథ అల్లాను. పది మందిలోకి వచ్చినప్పుడు ఎవరు ఎలా మాట్లాడుతున్నారనేది ఎక్కువగా గమనిస్తుంటాను. వాటినే నా కథల్లో పాత్రలకు ఆపాదిస్తుంటాను.’’

‘‘అన్నపూర్ణమ్మగారిని చూస్తే మా ఇంట్లో బామ్మను చూసినట్లు ఉంటుంది. వయసు అనేది పక్కనపెడితే ఆమె ఎంతో చలాకీగా, సహజత్వం ఉట్టిపడేలా నటించే వ్యక్తి. ‘రాజా ది గ్రేట్‌’లో అన్నపూర్ణమ్మకు, రాజేంద్రప్రసాద్‌కి మధ్య జరిగే సంభాషణలకు ఎంతోమంది కనెక్ట్‌ అయ్యారు. వాళ్లిద్దరి మధ్య జరిగే కామెడీ ట్రాక్‌.. మనం ఇంతకు ముందు జంధ్యాల గారి సినిమాల్లో చూశాం. ఆయన సినిమాల నుంచి స్ఫూర్తి పొందే ఆ సన్నివేశాలను తీర్చిదిద్దాను’’

‘‘ఎఫ్‌-2’లో నవ్వించిన బామ్మలు ‘ఎఫ్‌-3’లో కూడా ఉంటారు. ఈ సారి ఇంకా ఎక్కువగా నవ్విస్తారు. ‘ఎఫ్‌-2’లో వెంకీ-వరుణ్‌ని ఒకలా బాధపెట్టిన బామ్మలు.. ఈసారి మరొకలా ఇబ్బంది పెడతారు.’’

‘‘రాజమౌళిగారితో పోల్చుకునే స్థాయి నాకింకా రాలేదు. ఆయన ఎన్నో ఉన్నత శిఖరాలను అధిరోహించారు. దర్శకత్వ రంగంలో నేను ఇప్పుడిప్పుడే ఎదుగుతున్నాను. ‘గాలి సంపత్‌’కు నేను దర్శకత్వ పర్యవేక్షణ చేస్తున్నాను. నా నుంచి వచ్చే కొత్త జోనర్‌ చిత్రమది. అలాగే, కొత్త జోనర్‌కు సంబంధించి కథలపై ఎన్నో ఆలోచనలున్నాయి.’’

‘‘సినీ పరిశ్రమ ఎప్పుడు ప్రారంభమైందనే విషయం నాకు సరిగ్గా తెలీదు. ఇప్పుడు మనం అనుకుంటున్న కథా ప్రాధాన్యమున్న చిత్రాలను చాలా సంవత్సరాల క్రితమే మన దర్శకులు తెరకెక్కించారు. నాకు తెలిసి అప్పట్లో వచ్చినన్ని మంచి కథా చిత్రాలు ఇప్పుడు రావడం లేదు. మన తెలుగులో చేసినన్ని అద్భుతమైన చిత్రాలు వేరొక భాషలో చేయలేదు.’’


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు